
విమానాల్లో మహిళలపై వికృత చేష్టలు
‘ఇండిగో’లో వ్యక్తి అసభ్య ప్రవర్తనపై మహిళ ఫిర్యాదు
హైదరాబాద్: విమానంలో ఓ మహిళా ప్రొఫెసర్‌తో విజయవాడ టీడీపీ కార్పొరేటర్ అసభ్యకర ప్రవర్తన వెలుగులోకి వచ్చినరోజే.. మరో విమానంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. శుక్రవారం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానంలో వస్తుండగా తన పక్కసీట్లో కూర్చున్న వ్యక్తి సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీస్తూ వికృతంగా ప్రవర్తించినట్లు ఓ మహిళ శనివారం ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రయాణం చేస్తున్నంతసేపూ అతడి ప్రవర్తనతో విసిగిపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నా.. అధికారికంగా ధ్రువీకరించలేదు. ఏడాది కిందట మద్యం మత్తులో విమానంలోని ఎయిర్‌హోస్టెస్ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. అలాగే తోటి ప్రయాణికురాలితో మరో వ్యక్తి కూడా అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలపై ఫిర్యాదులందాయి.