హైదరాబాద్: నగర శివారు రాజేంద్రనగర్ మండలం బండ్లగూడలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భర్త కళ్ల ఎదుటే భార్యపై కొంతమంది యువకులు దాడి చేశారు. ఈ దాడిలో మహిళ మృతిచెందగా.. ఆమె భర్త తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామానికి చెందిన మల్లేష్, వెంకటమ్మ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి బండ్లగూడలో నిర్మిస్తున్న నూతన భవనానికి వాచ్‌మెన్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా.. పక్కనే నిర్మాణంలో ఉన్న మరో భవనంలో పని చేస్తున్న సెంట్రింగ్ కార్మికులు వారు పనిచేస్తున్న భవనంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆదివారం ఉదయం వెంకటమ్మను కరెంట్ ఇవ్వాల్సిందిగా అడిగారు. దీనికి ఆమె తన యజమాని వచ్చాక అడిగి తీసుకోండని సమాధానమిచ్చింది. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన సెంట్రింగ్ కార్మికులు ఆమెను దుర్భాషలాడారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆమె భర్త మల్లేష్ వారిని వారించడానికి యత్నించగా.. కార్మికులంతా కలిసి దంపతులపై దాడి చేశారు.
దెబ్బలు బలంగా తగలడంతో వెంకటమ్మ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందిందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు సెంట్రింగ్ కార్మికులు పనిచేస్తున్న భవనం వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మల్లేష్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బండ్లగూడలో దారుణం
Published Sun, Sep 18 2016 10:58 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
Advertisement
Advertisement