ఔటర్ రింగ్ రోడ్ తుక్కుగూడ జంక్షన్(ఫైల్ ఫొటో)
హైదరాబాద్: భర్తను విదేశానికి సాగనంపేందుకు పిల్లలతో సహా ఎయిర్ పోర్టుకు బయలుదేరిన మహిళ మృత్యువాతపడింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో మాధురి (28) అనే మహిళ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. కారులో ఉన్న భర్త, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు.
కీసర సమీపంలోని నాగారంలో మాధురి కుటుంబం నివసిస్తోంది. ఆమె భర్త దక్షిణాఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మంగళవారం ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగబెట్టేందుకు పిల్లలతోపాటు కారులో బయలుదేరారు. ఔటర్ పై తుక్కుగూడ వద్ద.. ఎయిర్ పోర్టుకు వెళ్లే దారిని కనుగొనడంలో పొరపాటు తలెత్తడంతో రోడ్డు మధ్యనే బ్రేక్ వేశారు. దీంతో వెనుకనుంచి వస్తోన్న మరో కారు మాధురి కుటుంబం ప్రయాణిస్తోన్న కారును ఢీకొట్టింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.