విశ్వ రూపిణి | Women's Day today | Sakshi
Sakshi News home page

విశ్వ రూపిణి

Published Mon, Mar 7 2016 11:43 PM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM

Women's Day today

విద్య, వైద్య, ఐటీ రంగాల్లో స్త్రీలే టాప్
నేడు మహిళా దినోత్సవం

 
‘ఆకాశంలో సగం... అవకాశాల్లో సగం’ అనే మాట మహిళల విషయంలో పాతబడి         పోయింది. అవకాశాల్లోనూ అధికులమని     నిరూపిస్తున్నారు. అవని నుంచి అంతరిక్షం వరకూ ప్రతిచోటా తమ ముద్ర వేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల పగ్గాలు చేపట్టి.. వ్యాపార సామ్రాజ్యంలో మహరాణులుగా ఎద గడమే కాదు... పాలనలో సైతం పురుషులకు    తీసిపోమని నిరూపిస్తున్నారు. కార్పొరేటర్లుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం      చేసుకొని... భాగ్యనగరిని ‘విశ్వ’నగరిగా    తీర్చిదిద్దే క్రతువులో భాగస్వాములయ్యేందుకు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.
 
సిటీబ్యూరో: ‘విశ్వ’మంత ఆశయంతో... వినూత్న వేగంతో... మహా నగరి మహిళలు దూసుకుపోతున్నారు. అవాంతరాలను... అడ్డంకులను... ఎదుగుదలకు మెట్లుగా మలచుకొని మునుముందుకు సాగుతున్నారు. రాజకీయాలు... సేవ.. క్రీడలు... ఉద్యోగ... పారిశ్రామిక రంగాల్లో ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. దేశంలోని మెట్రో నగరాల స్త్రీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజకీయాలనే తీసుకుంటే ఇటీవలి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 79 మంది (మొత్తం 150 స్థానాలు) కార్పొరేటర్లుగా ఎన్నికై... స్థానిక పరిపాలనలో కొత్త చరిత్ర సృష్టించారు. గతంలో ఉన్న కోటాను 33 నుంచి 50 శాతానికి పెంచాక... నిర్వహించిన ఎన్నికల్లో తమకు కేటాయించిన 75 స్థానాలతో పాటు అదనంగా బంజారాహిల్స్, వెంకటాపురం, ఫలక్‌నూమా, బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్లలో మహిళలే ఎన్నికయ్యారు.ఈ ప్రభావం వచ్చే సాధారణ ఎన్నికలపై పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా ఎంపీలు... ఎమ్మెల్యేలు నవ చరిత్రను లిఖించే రోజులు  సమీప భవిష్యత్తులోనే సాకారం కాబోతున్నాయనడంలో సందేహం లేదు.
 
సేవల్లో టాప్
నగరంలో స్త్రీ-పురుష నిష్పత్తిలో ఆందోళనకర గణాంకాలు (954-1000) ఉన్నా... విద్య.. ఐటీ.. వైద్య రంగాల్లోసేవలందిస్తున్న మహిళల సంఖ్య తారస్థాయికి చేరుకుంది. వైద్య రంగంలో మహిళల సంఖ్య 60 శాతం దాటగా... ప్రైవేటు పాఠశాలల నిర్వహణ, విద్యా బోధనలోనగర మహిళలు 50 శాతాన్ని మించిపోయారు. హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఐటీ సర్వీసుల్లోనూ మహిళా ఉద్యోగుల సంఖ్య మగాళ్లను దాటే స్థాయికి చేరిందని ఇటీవల ఒక ప్రముఖ సంస్థ అంచనా వేసింది. ఇవి కాకుండా బీపీఓ, ఆతిథ్య, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాల్లోనూ మహిళల శాతం గణనీయంగా పెరిగింది. పురుషులతో పోలిస్తే మహిళల్లో అంకితభావం... సమయ పాలన... క్రమశిక్షణ అధికంగా ఉంటోందని... ఈ నేపథ్యంలోనే వివిధ యాజమాన్యాలు మహిళా ఉద్యోగినుల ఎంపికకే ప్రాధాన్యమిస్తున్నాయని హెచ్‌ఆర్ కన్సల్టెంట్లు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల పోలీస్ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం కేటాయించడంతో వారి సంఖ్య పోలీస్ విభాగంలోనూ భారీగా పెరగనుంది. ప్రస్తుతం పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్య ఐదు శాతం లోపే. ఇటీవలే పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడటంతో నగర మహిళలు ఆ అవకాశాన్ని అందుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.
 
చదువులోనూ పైచేయి
గ్రేటర్‌లోనూ... జంట జిల్లాల పరిధిలోనూ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే చదువులో పైచేయి సాధిస్తుండడం గమనార్హం. హైదరాబాద్‌లో గత ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల్లో అబ్బాయిలు కేవలం 56 శాతం పాసైతే.... అమ్మాయిలు 73 శాతం.... రంగారెడ్డి జిల్లాలో అబ్బాయిలు 71 శాతం... అమ్మాయిలు 78.89 శాతం ఉత్తీర్ణులు కావడం... వారి ప్రతిభను చాటి చెబుతోంది. టెన్త్‌లోనూ అమ్మాయిల ఉత్తీర్ణత అబ్బాయిల కంటే పది శాతం అధికంగా నమోదు కావడం విశేషం.
 
‘ఎక్స్‌పో’జర్ అతివలకే  ఆమెదే ఆధిపత్యం
లైఫ్‌స్టైల్‌ప్రతినిధి: నగర మహిళలు అడుగు పెట్టని రంగం దాదాపు లేదనే చెప్పాలి. కొన్ని రంగాల్లో మగవారిని తోసిరాజని మరీ దూసుకుపోతున్నారు. అదే స్థాయిలో విజయాలు సాధిస్తున్నారు. నగరంలో మహిళల ఆధిక్యానికి అద్దం పట్టే రంగాలు, అంశాల్లో కొన్ని...
 నగరంలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగంలో మహిళల ఆధిపత్యం సుస్పష్టం. రాష్ట్ర స్థాయిలో పెద్ద ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని నిర్వహిస్తున్న రాఖీ కంకారియా ఈ రంగంలో రాణించాలనుకునే వారి కోసం అకాడమీని నెలకొల్పారు. ఈవెంట్ మేనేజర్లుగా రాణిస్తున్న మగవారు ఉన్నప్పటికీ కొన్ని ఈవెంట్లు పూర్తిగా మహిళాధిక్యాన్ని కనబరుస్తున్నాయి. స్టార్ హోటళ్లు, క్లబ్బులలో విభిన్న రకాల ఉత్పత్తులు విక్రయించే ఎక్స్‌పోల నిర్వహణలో మహిళలదే పైచేయిగా చెప్పాలి.
 
వహ్వా... పీఆర్వో...
మీడియాకు, ప్రజలకు మధ్య వారథిగా.. చెరగని చిరునవ్వుతో... ఆకట్టుకునే సంభాషణా చాతుర్యంతో విధులు నిర్వర్తించే పీఆర్వో విభాగంలో మహిళల హవా నడుస్తోంది. నగరంలో పదుల సంఖ్యలో ఉన్న పీఆర్ ఏజెన్సీలలో అమ్మాయిలే అధిక సంఖ్యలో కనిపిస్తారు. మీడియా సంబంధాలు నెరపేందుకు సంస్థాగతంగానూ, వ్యక్తిగత పీఆర్వోలుగానూ మహిళలనే నియమించుకోవడానికి పలువురు ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారు.
 
ఫ్యాషన్‌లో ఓషన్‌లా...

 సిటీలో ఫ్యాషన్ అనుబంధ రంగాలు పుంజుకోవడంతో పాటు వాటిలో మహిళల ఆధిపత్యమూ పెరుగుతోంది. స్త్రీ, పురుష డిజైనర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన డిజైనర్లలో వర్ష, శిల్పారెడ్డి, అనుశ్రీరెడ్డి తదితర మహిళలే ముందున్నారు. సిటీలో పేరొందిన డిజైనింగ్ స్కూల్స్ అన్నీ దాదాపు మహిళలు నిర్వహిస్తున్నవే.
 
గాలిలో తేలిపోతూ...
గాలిలో ఎగిరే ఎయిర్ హోస్టెస్ జాబ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన నగరానికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రాకతో... ఇక్కడి అమ్మాయిల్లోనూ అనేక మందిలో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగంపై ఆసక్తి పెరిగింది. దీనికి అనుగుణంగానే వారికి అవకాశాలు  వెల్లువెత్తుతున్నాయి.
 
ఆర్జే.. జేజే
‘గుడ్‌మార్నింగ్ హైదరాబాద్’ అంటూ పలకరింపులు మొదలుపెట్టి ‘ఇది చాలా హాట్ గురూ’ వంటి చమత్కారాలతో శ్రోతలను అలరించే రేడియో జాకీల హవా మొదలై దాదాపు దశాబ్దం కావస్తోంది. ఈ రంగంలో మగవాళ్లు ఉన్నప్పటికీ సిటీలో అత్యధిక ఆదాయం ఆర్జించే ఆర్జేల్లో మహిళలేఎక్కువని చెప్పాలి. భార్గవి, ప్రతీక వంటి కొందరు సినిమా స్టార్లతో సమానంగా ఆదరణ పొందుతున్నారు.
 
ప్రమోటర్‌గా సూపర్
 వివిధ ఈవెంట్లలో, పెద్ద పెద్ద సమావేశాల్లో అతిథులను పలుకరిస్తూ, వారికి అవసరమైన సరంజామాను అందిస్తూ చిరునవ్వుతో సందడి చేస్తారు ప్రమోటర్స్. నగరంలో వేల సంఖ్యలో ప్రమోటర్స్ ఉన్నారు. ఈ రంగంలోనూ అమ్మాయిలకే డిమాండ్ ఎక్కువని ఈవెంట్ మేనేజర్ రాజ్‌కిషోర్ చెప్పారు.  
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement