
‘విశ్వ’ బృందం
కీలక స్థానాల భర్తీపై మొదలైన కసరత్తు
మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖల్లో ముుఖ్య పోస్టుల్లో నియామకాలు
కొత్త జట్టులో పనిమంతులకే ప్రాధాన్యండ
‘విశ్వ’నగరం రూపకల్పనలో భాగంగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రతువులో పాలు పంచుకునే ‘కీ’లక బృందం ఎంపికకు కసరత్తు చేస్తోంది. వినూత్న లక్ష్యాలతో ముందుకెళుతున్న ప్రభుత్వం... వాటిని నెరవేర్చే సమర్థుల అన్వేషణలో పడింది. సాధ్యమైనంత త్వరగా ఇలాంటి వారితో కొత్త బృందాన్ని ఎన్నుకొని... ముందుకు దూసుకుపోవాలని చూస్తోంది.
సిటీబ్యూరో: నగరంలోని కీలక విభాగాలకు కొత్త అధికారుల బృందం రాబోతోంది. హైదరాబాద్‌ను విశ్వనగరం దిశగా అడుగులు వేయించే క్రమంలో స్థానిక పరిస్థితులపై అవగాహన, చిత్తశుద్ది కలిగిన వారికి సంబంధిత విభాగాల బాధ్యతలు కట్టబెట్టే దిశగా సర్కారు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే కొంతమంది పేర్లను వడబోస్తున్న సర్కారు వీలైనంత త్వరగా కీలక స్థానాలను భర్తీ చేయనుంది. సివిల్ సర్వీసు అధికారుల పంపకానికి ముందే నగర పోలీసు విభాగంలో దాదాపు అన్ని కీలక పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం...మిగిలిన వాటిపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్‌లతో పాటు కీలక శాఖలు ఇన్‌చార్జులతో సాగుతున్నాయి. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలును గడువులోగా పూర్తి చేయడంతో పాటు, హుస్సేన్ సాగర్ శుద్ధి, సాగర తీరాన ఆకాశహర్మ్యాలు, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం, వాటర్‌గ్రిడ్‌తో ఇంటింటికి నల్లా, మురికివాడల రహిత నగరం, భూ క్రమబద్ధీకరణను ప్రధాన అజెండాగా ఎంచుకుంది.నిరుపేదలకు రెండు గదుల ఇళ్లు... నగర స్వరూపాన్ని అమాంతం మార్చేసే ఐటీఐఆర్‌ల నిర్మాణం వంటి అంశాలు ఈ అజెండాలో ఉన్నాయి. వీటిని సక్రమంగా అమలు చేసేలా కొత్త బృందాన్ని ఎంపిక చేస్తోంది.
కీలక విభాగాలకు కొత్త అధికారులు
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో స్పెషల్ కమిషనర్లతో పాటు సెంట్రల్ జోన్, నార్త్ జోన్, వెస్ట్‌జోన్‌లలో జోనల్ కమిషనర్ల పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటికి ఇన్‌చార్జులుగా పని చేస్తున్న స్పెషల్ కమిషనర్లు ప్రద్యుమ్న, ఎ.బాబులను ప్రభుత్వం బుధవారం రిలీవ్ చేసింది. జీహెచ్‌ఎంసీలో కమిషనర్ తప్ప కీలక పోస్టులన్నీ ఖాళీ. మరో కీలక విభాగమైన హెచ్‌ఎండీఏ కమిషనర్ స్థానాన్ని సైతం కొత్త అధికారితో భర్తీ చేయనున్నారు. నగరానికి సమీపంలో ఓ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న అధికారి హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా వస్తున్నారన్న సమాచారం ఆ శాఖలో ప్రచారంలో ఉంది.జలమండలికి సైతం పూర్తి స్థాయి అధికారిని నియమించనున్నారు.
జంట జిల్లాలకు కొత్త కలెక్టర్లు
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కొత్త కలెక్టర్లు రానున్నారు. హైదరాబాద్ కలెక్టర్ మీనాను ఆంధ్రా కేడర్‌కు కేటాయించగా, రంగారెడ్డి కలెక్టర్ శ్రీధర్ సింగరేణికి బది లీపై వెళ్లారు. ఈ రెండు పోస్టులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జాయింట్ కలెక్టర్లుగా కొత్త వారిని నియమించే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ జిల్లాలో జాయింట్ కలెక్టర్ పోస్టు కూడా ఇన్‌చార్జితోనే కొనసాగుతోంది.రంగారెడ్డి జిల్లాలోని ఇద్దరు జాయింట్ కలెక్టర్లలో ఒకరు బదిలీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఆ ఇద్దరు పోలీస్ బాస్‌లు ఇక్కడే
జంట పోలీస్ కమిషనరేట్లలో కీలక పోస్టులన్నీ తెలంగాణ క్యాడర్ అధికారులతో ఇటీవల భర్తీ చేశారు. ఏపీ క్యాడర్‌కు బదిలీ అయిన నగర అదనపు సీపీ అంజనీ కుమార్ క్యాట్‌ను ఆశ్రయించి స్టే పొందారు. తీర్పు వచ్చేంత వరకు ఇక్కడే కొనసాగనున్నారు. ఏపీకి కేటాయించిన జాయింట్ కమిషనర్ శివప్రసాద్ పెట్టుకున్న అర్జీపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఆయన సేవలు ఇక్కడే అందుతాయి.సీసీఎస్ డీసీపీగా పనిచేస్తున్న పాలరాజును ఆంధ్రాకు కేటాయించటంతో ఆయన ఒకటి రెండు రోజుల్లో రిలీవయ్యే అవకాశం ఉంది. ఆయన స్థానాన్ని తెలంగాణ కేడర్ అధికారితో ప్రభుత్వం భర్తీ చేయనుంది.