ఆ ఘోరాన్ని ఆపేందుకు యంత్రాంగం కదిలింది. సాక్షిలో ప్రచురితమైన పలు కథనాలకు స్పందించింది. సంతలద్వారా పశువులను దయనీయంగా తరలింపును నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంతలో ఈ మేరకు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసింది. కనీస సౌకర్యాలు కల్పించకుంటే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పింది. ఎట్టకేలకు కోట్లాదిరూపాయల లావాదేవీలకు అడ్డుకట్ట పడింది.
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని పలు సంతల్లో పశు రవాణాకు తాత్కాలిక బ్రేక్ పడింది. రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలు సంతల్లోని నిర్వాహకులకు పంచాయతీ అధికారులకు సూచనలు చేస్తూ ప్రస్తుతానికి రవాణా అరికట్టే చర్యలు చేపట్టారు. పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పిస్తేనే అనుమతించాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు.
అంతవరకూ సంతల్లో ఎలాంటి వాహనాలు తిరగరాదని సూచిస్తూ బోర్డులు పెట్టారు. సాక్షి దిన పత్రికలో పలు మార్లు ప్రచురితమైన కథనాలకు స్పందించిన గోసంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, పశు సంవర్థక శాఖ జేడీ తదితరులతో చర్చలు జరిపారు. వాటి ఫలితంగా సంతల్లో వాహనాలు నిషేధమంటూ బోర్డులు పెట్టారు. అధికారుల చర్యలతో కోట్లాదిరూపాయల విలువైన పశువుల వ్యాపారానికి అడ్డుకట్ట పడినట్టయింది.
రహస్యంగా వేరేచోట లోడింగ్?
మానాపురం సంతలో పెద్ద ఎత్తున పశువుల రవాణా జరుగుతుండేది. ప్రతీ వారం వంద నుంచి 150 వాహనాల్లో పశువులను కిక్కిరిసి లోడింగ్ చేసేవారు. ప్రస్తుతానికి వాహనాలను అధికారులు నిరోధించగలిగినా పశువులు మాత్రం వస్తునే ఉన్నాయి. అయితే ఈ పశువులు ఎక్కడ లోడింగ్ జరుగుతున్నదనేది తెలియడం లేదు. మరో చోటకు పశువుల వాహనాలను తరలించి అక్కడ రహస్యంగా లోడింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మానాపురం సంతతోటలో షెడ్లు నిర్మిస్తున్నా పశువులకు అనుకూలంగా నిర్మించడం లేదని చెబుతున్నారు.
ఆగోరానికి చెక్!
Published Tue, Jun 21 2016 11:21 PM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM
Advertisement