తుది దశకు మద్యం దుకాణాల కేటాయింపు
♦ రాత్రి వరకు సాగిన మద్యం దుకాణాల డ్రా
♦ జిల్లా కలెక్టర్, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారుల సమక్షంలో నిర్వహణ
♦ దరఖాస్తులు రాని దుకాణాలకు ఈనెల 29న మళ్లీ నోటిఫికేషన్
♦ అక్టోబర్ 5 వరకు దరఖాస్తులకు గడువు
సాక్షి, హైదరాబాద్: మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం రిటైల్ దుకాణాల కోసం వచ్చిన దరఖాస్తులను బుధవారం జిల్లా కలెక్టర్ల సమక్షంలో రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఒకే దరఖాస్తు దాఖలైన మద్యం దుకాణాల వివరాలను తొలుత ప్రకటించిన అధికారులు... ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చిన దుకాణాలకు వ్యాపారుల సమక్షంలోనే డ్రా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం 30,987 దరఖాస్తులు రాగా, ఖమ్మంలో 148 దుకాణాల కోసం అత్యధికంగా 6,615 దరఖాస్తులు వచ్చాయి. అతి తక్కువగా హైదరాబాద్ జిల్లాలో 160 దుకాణాల కోసం 316 దరఖాస్తులు అందాయి.
హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో డ్రా సాయంత్రం కల్లా ముగిసింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో రాత్రి వరకు కొనసాగింది. అత్యధిక దరఖాస్తులు వచ్చిన ఖమ్మం జిల్లాలో మాత్రం ఆలస్యంగా ప్రారంభమైన డ్రా పద్ధతి మందకొడిగా సాగుతోంది. గురువారం ఉదయం వరకు ఈ డ్రా ప్రక్రియ జరిగే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.
దరఖాస్తులు రాని దుకాణాలకు రీ నోటిఫికేషన్
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నా చాలా చోట్ల సరైన స్పందన రాలేదు. ఫలితంగా హైదరాబాద్ జిల్లాలో 52, రంగారెడ్డిలో 32, మెదక్‌లో 11, నిజామాబాద్‌లో 5, వరంగల్‌లో 3, ఆదిలాబాద్‌లో 2 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో ఈ 105 దుకాణాలకు తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాలని ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ నిర్ణయించారు.
ఈ మేరకు ఈనెల 29న ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అక్టోబర్ 5 వరకు దరఖాస్తుకు గడువు ఉంటుంది. 6న డ్రా తీసి, 7న లెసైన్సులు జారీ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్‌కు కూడా వ్యాపారుల నుంచి స్పందన రానిపక్షంలో తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఈ దుకాణాలను నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది.