
ఏపీలో జోనల్ విధానాల రద్దుకు యోచన!
హైదరాబాద్: విజయవాడ వెళ్లేటప్పుడు స్టార్ హోటళ్లలో బస చేయొద్దని మంత్రులకు సూచించామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. వీలైనంత వరకూ ప్రభుత్వ అతిథి గృహాల్లోనే బస ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తాత్కాలిక రాజధానికి వీలైనంత త్వరగా తరలిస్తామని వెల్లడించారు.
రాజధాని తరలింపునకు ఎంత ఖర్చయినా వెనుకాడబోమని పేర్కొన్నారు. సున్నితంగా ఉద్యోగులకు ఇబ్బందులు లేకున్నా తరలింపు చేపడతామన్నారు. అద్దె భవనాలకు ఎంత చెల్లించాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. త్వరలోనే ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరపనున్నట్టు ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్లో జోనల్ విధానాలను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. 371 డి ఆర్టికల్ సవరించాలని కేంద్రాన్ని ప్రభుత్వం తరఫున కోరుతాం. కొత్త రాజధానిలో అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగాలు వచ్చేలా జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి రాష్ట్రానికి జోనల్ వ్యవస్థ వర్తిస్తుంది. రాష్ట్రం విడిపోయింది. కనుక దీనిపై మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే వారికి కొన్ని వెసులుబాటులు కల్పించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే అందుకోసం జోనల్ వ్యవస్థను రద్దు చేయాలి' అని యనమల రామకృష్ణుడు అన్నారు.