దొంగ దొరికాడు
హార్లీ డేవిడ్‌సన్ బైక్‌తో ముంబైలో చిక్కిన యువకుడు
హైదరాబాద్: చదివింది ఐఐటీ.. ఓఎన్‌జీసీలో ఉద్యోగం.. నెలకు రూ. 1.50 లక్షల జీతం.. వీటిని చూస్తే ఇలాంటి జీవితమే కావాలని అందరికీ అనిపిస్తుంది. కానీ.. ఇవన్నీ ఉన్న వ్యక్తి మాత్రం బైక్ దొంగతనం చేసి పోలీసులకు చిక్కాడు. టిప్‌టాప్‌గా తయారై వచ్చి ట్రయల్ రన్ పేరుతో హార్లీ డేవిడ్‌సన్ బైక్ తీసుకుని పరారైన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌లోని హార్లీడేవిడ్‌సన్ షోరూమ్‌కు ఈ నెల 1న మధ్యాహ్నం వచ్చిన ఓ యువకుడు తన పేరు సయ్యద్ తాహిర్ అని పరిచయం చేసుకుని రూ. 6 లక్షల విలువ చేసే స్ట్రీట్ 750 మోడల్ బైక్‌ను ట్రయల్ వేస్తానని తీసుకెళ్లి ఉడాయించాడు. అదే రోజు షోరూం మేనేజర్ షీలా పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు నింది తుడి కోసం జల్లెడ పట్టాయి. చివరకు బైక్‌తో పరారైన యువకుడు ముంబైలో పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని తొర్లపాటి కిరణ్ (27) గా గుర్తించారు. మద్రాస్ ఐఐటీలో చది విన కిరణ్ ముంబైలో ఓఎన్‌జీసీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతని నెల జీతం రూ. 1.50 లక్షలు. మల్కాజ్‌గిరిలో నివసిస్తున్న కిరణ్ తండ్రి ప్రకాశ్ పోలీస్ శాఖలో స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఏడాది క్రితమే కిరణ్‌కు వివాహమయ్యింది. జల్సాలకు అలవాటుపడిన కిరణ్ స్నేహితులతో బలాదూర్‌గా తిరుగుతున్నట్లు తండ్రి ప్రకాశ్ తెలిపాడు.
ఎలా పట్టుబడ్డాడంటే: హార్లీ డేవిడ్‌సన్ బైక్‌తో ఉడాయించిన కిరణ్ ఈ నెల 1న మధ్యాహ్నం తన సెల్‌ఫోన్ నుంచి షోరూం ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేసి తాను 2.30కి షోరూమ్‌కు వస్తున్నానని, టెస్ట్ డ్రైవ్ చేస్తానని చెప్పడంతో షోరూమ్ నిర్వాహకులు ఒప్పుకున్నారు. అనుకున్న ప్రకారం కిరణ్ రావడం బైక్‌తో ఉడాయించడం జరిగింది. షోరూమ్ నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ల్యాండ్‌లైన్‌కు ఆ రోజు మధ్యాహ్నం ఎంత మంది ఫోన్ చేశారనే కాల్‌డేటాను సేకరించారు. మొత్తం 8 మంది ఫోన్లు చేయగా ఒక ఫోన్ మాత్రమే స్విచ్చాఫ్‌లో ఉంది. దాని లొకేషన్ ముంబైలో ఉన్నట్లు తేలింది. ఆ ఫోన్ నంబర్ కాల్‌డేటాను తీయగా మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎంత మందితో మాట్లాడాడో వివరాలు సేకరించారు. అందులో నాలుగైదు సార్లు తండ్రి ప్రకాశ్‌తో, ఆరుసార్లు భార్యతో మాట్లాడాడు. పోలీసులు ఆ నంబర్లను ఆరా తీయగా మల్కాజ్‌గిరి అడ్రస్‌తోపాటు తండ్రి ప్రకాశ్ ద్వారా పూర్తి వివరాలు తెలిశాయి. బుధవారం రాత్రి ప్రకాశ్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తండ్రి ఫోన్‌పై నిఘా వేసిన పోలీసులకు గురువారం తెల్లవారుజామున కిరణ్ తండ్రి ప్రకాశ్‌కు ఫోన్ చేయడంతో అతను ముంబైలో ఉన్నట్లు గుర్తించారు. బైక్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కిరణ్‌ను ముంబై నుంచి నగరానికి తీసుకొస్తున్నారు.