Harley-Davidson bike
-
హార్లే డేవిడ్సన్ ఎక్స్440 బుకింగ్స్ షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హార్లే డేవిడ్సన్ ఎక్స్440 బైక్ బుకింగ్స్‌ను ప్రారంభించినట్టు హీరో మోటోకార్ప్ మంగళవారం ప్రకటించింది. అక్టోబర్ నుంచి డెలివరీలు ఉంటాయి. హార్లే డేవిడ్సన్ షోరూంలు, ఎంపిక చేసిన హీరో మోటోకార్ప్ ఔట్లెట్స్, ఆన్లైన్లో రూ.5,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. 440 సీసీ ఇంజిన్‌తో కూడిన ఈ బైక్స్‌ను నీమ్రానా ప్లాంటులో హీరో మోటోకార్ప్ తయారు చేస్తోంది. 440 సీసీ విభాగంలోకి ఇరు కంపెనీలు ఎంట్రీ ఇవ్వడం ఇదే తొలిసారి. మూడు వేరియంట్లలో ఎక్స్440 లభిస్తుంది. ఎక్స్‌షోరూం ధర రూ.2.29 లక్షల నుంచి ప్రారంభం. 2020 అక్టోబర్‌లో హీరో మోటోకార్ప్, హార్లే డేవిడ్సన్ చేతులు కలిపాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌లో హార్లే డేవిడ్సన్ బ్రాండ్ ప్రీమియం మోటార్‌సైకిళ్లను హీరో మోటోకార్ప్ అభివృద్ధి చేయడంతోపాటు విక్రయిస్తుంది. (తప్పుదోవ పట్టించే ప్రకటనలు బీమా బ్రోకరేజీలపై ఫిర్యాదు) -
నువ్వు తోపు సామీ.. పాలు అమ్మేందుకు అన్ని లక్షల బైకా భయ్యా!
సోషల్ మీడియా అనగానే ఎన్నో స్పెషల్, ఫన్నీ వీడియోలు దర్శనమిస్తుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే అబ్బా ఏముంది అని అనుకుంటాము. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్యర్యానికి గురవుతున్నారు. ఇంతకీ ఏమైందంటే.. ప్రతీరోజు మనం చూస్తూనే ఉంటాం కదా.. పాలు అమ్మే వాళ్లు ఏదో ఒక చిన్న బైక్ లేదా సైకిల్‌పై వచ్చి పాలు పోసి వెళ్తుంటారు. దాదాపు చాలా మంది చిన్న బైకులనే ఉపయోగించి పాలు అమ్ముతుంటారు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం పాలు అమ్మేందుకు ఏకంగా లక్షలు విలువచేసే హార్లే డేవిడ్సన్ బైక్‌ను ఉపయోగించాడు. ఆ బైక్‌కు రెండు వైపులా పాల క్యాన్లను తగిలించుకుని పాలు పోసేందుకు వీధుల్లోకి వెళ్లి వారికి పాలను అందిస్తున్నాడు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. అమిత్ బదనా అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్టు చేయగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. పాలు అమ్మేందుకు రూ.11 లక్షలకు పైనే విలువ చేసే బైక్‌ను వాడుతున్నావా అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశాడు. View this post on Instagram A post shared by Amit Bhadana (@amit_bhadana_3000) -
దొంగ దొరికాడు
హార్లీ డేవిడ్సన్ బైక్‌తో ముంబైలో చిక్కిన యువకుడు హైదరాబాద్: చదివింది ఐఐటీ.. ఓఎన్జీసీలో ఉద్యోగం.. నెలకు రూ. 1.50 లక్షల జీతం.. వీటిని చూస్తే ఇలాంటి జీవితమే కావాలని అందరికీ అనిపిస్తుంది. కానీ.. ఇవన్నీ ఉన్న వ్యక్తి మాత్రం బైక్ దొంగతనం చేసి పోలీసులకు చిక్కాడు. టిప్‌టాప్‌గా తయారై వచ్చి ట్రయల్ రన్ పేరుతో హార్లీ డేవిడ్సన్ బైక్ తీసుకుని పరారైన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌లోని హార్లీడేవిడ్సన్ షోరూమ్‌కు ఈ నెల 1న మధ్యాహ్నం వచ్చిన ఓ యువకుడు తన పేరు సయ్యద్ తాహిర్ అని పరిచయం చేసుకుని రూ. 6 లక్షల విలువ చేసే స్ట్రీట్ 750 మోడల్ బైక్‌ను ట్రయల్ వేస్తానని తీసుకెళ్లి ఉడాయించాడు. అదే రోజు షోరూం మేనేజర్ షీలా పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు నింది తుడి కోసం జల్లెడ పట్టాయి. చివరకు బైక్‌తో పరారైన యువకుడు ముంబైలో పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని తొర్లపాటి కిరణ్ (27) గా గుర్తించారు. మద్రాస్ ఐఐటీలో చది విన కిరణ్ ముంబైలో ఓఎన్జీసీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతని నెల జీతం రూ. 1.50 లక్షలు. మల్కాజ్‌గిరిలో నివసిస్తున్న కిరణ్ తండ్రి ప్రకాశ్ పోలీస్ శాఖలో స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఏడాది క్రితమే కిరణ్‌కు వివాహమయ్యింది. జల్సాలకు అలవాటుపడిన కిరణ్ స్నేహితులతో బలాదూర్‌గా తిరుగుతున్నట్లు తండ్రి ప్రకాశ్ తెలిపాడు. ఎలా పట్టుబడ్డాడంటే: హార్లీ డేవిడ్సన్ బైక్‌తో ఉడాయించిన కిరణ్ ఈ నెల 1న మధ్యాహ్నం తన సెల్‌ఫోన్ నుంచి షోరూం ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేసి తాను 2.30కి షోరూమ్‌కు వస్తున్నానని, టెస్ట్ డ్రైవ్ చేస్తానని చెప్పడంతో షోరూమ్ నిర్వాహకులు ఒప్పుకున్నారు. అనుకున్న ప్రకారం కిరణ్ రావడం బైక్‌తో ఉడాయించడం జరిగింది. షోరూమ్ నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ల్యాండ్‌లైన్‌కు ఆ రోజు మధ్యాహ్నం ఎంత మంది ఫోన్ చేశారనే కాల్‌డేటాను సేకరించారు. మొత్తం 8 మంది ఫోన్లు చేయగా ఒక ఫోన్ మాత్రమే స్విచ్చాఫ్‌లో ఉంది. దాని లొకేషన్ ముంబైలో ఉన్నట్లు తేలింది. ఆ ఫోన్ నంబర్ కాల్‌డేటాను తీయగా మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎంత మందితో మాట్లాడాడో వివరాలు సేకరించారు. అందులో నాలుగైదు సార్లు తండ్రి ప్రకాశ్‌తో, ఆరుసార్లు భార్యతో మాట్లాడాడు. పోలీసులు ఆ నంబర్లను ఆరా తీయగా మల్కాజ్గిరి అడ్రస్‌తోపాటు తండ్రి ప్రకాశ్ ద్వారా పూర్తి వివరాలు తెలిశాయి. బుధవారం రాత్రి ప్రకాశ్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తండ్రి ఫోన్‌పై నిఘా వేసిన పోలీసులకు గురువారం తెల్లవారుజామున కిరణ్ తండ్రి ప్రకాశ్‌కు ఫోన్ చేయడంతో అతను ముంబైలో ఉన్నట్లు గుర్తించారు. బైక్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కిరణ్‌ను ముంబై నుంచి నగరానికి తీసుకొస్తున్నారు. -
ట్రయల్ అంటూ హార్లేడేవిడ్సన్ బైక్ తో జంప్
-
ట్రయల్ అంటూ హార్లేడేవిడ్సన్ బైక్ తో జంప్
బంజారాహిల్స్ (హైదరాబాద్) : ట్రయల్ రన్ అని చెప్పి ఖరీదైన హార్లేడేవిడ్సన్ బైక్ తో ఉడాయించాడో ఘనుడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే .. బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని సాగర్ సొసైటీ చౌరస్తాలో ఉన్న హార్లే డేవిడ్సన్ షోరూంకు మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో టిప్‌టాప్ డ్రెస్‌తో హీరోలా ఉన్న ఓ యువకుడు(25) వచ్చాడు. తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్‌నని, నెలకు లక్షన్నర వేతనం ఉంటుందని బడాయిలు చెప్పుకున్నాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-23లో తన నివాసమని నమ్మబలికాడు. పేరు సయ్యద్ తాహెర్ అని పరిచయం చేసుకున్నాడు. కొత్తగా వచ్చిన రూ.6 లక్షల విలువైన హార్లే డేవిడ్సన్ స్ట్రీట్-750 మోడల్ బైక్ కావాలంటూ బేరమాడాడు. తనతోపాటు తెచ్చిన క్రెడిట్ కార్డులను చూపించాడు. ట్రయల్ వేస్తానని బైక్‌తో బయటకు వెళ్లిన తాహెర్ మూడు గంటలు గడిచినా తిరిగి రాకపోయేసరికి అనుమానం వచ్చిన షోరూం నిర్వాహకులు అతడు ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో షోరూం మేనేజర్ షీలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ సీఐ పి.మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజీలు పరిశీలించారు. యువకుడి ఊహాచిత్రాన్ని తయారు చేస్తున్నారు.