క్రైమ్ స్క్రీన్‌ప్లే!
అబ్బాయిని క్రూరంగా చంపేసిన బాబాయ్
రాకేశ్ రెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు
నేరేడ్‌మెట్(సికింద్రాబాద్): అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన ఓ బాబాయ్ తనతో చనువుగా ఉండే అబ్బాయ్‌ని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించాలని భావించాడు... తన గదికి వచ్చిన ఆ అబ్బాయ్ కిడ్నాప్‌కు గురైనట్లు నాటకానికి తెరలేపాడు.... పథకం పారదని తెలిసి క్రూరంగా హత్య చేసి... ఆ అబ్బాయ్ బావ మీద అనుమానం వచ్చేలా చేశాడు... ఇంత కథనడిపించినా... పోలీసుల చాకచక్యంగా వ్యవహరించడంతో ఎట్టకేలకు చిక్కి కటకటాల్లోకి చేరాడు... జవహర్‌నగర్ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన పూర్వాపరాలు మల్కాజిగిరి డీసీపీ రమారాజేశ్వరి కథనం ప్రకారం...
* నాగారం శ్రీశ్రీనివాసనగర్ కాలనీకి చెందిన కె. బాల్‌రెడ్డి కుమారుడు రాకేష్‌రెడ్డి (29) విదేశాల్లో విద్యనభ్యసించి వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడం, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. రాకేష్‌రెడ్డి సోదరి, బావల మధ్య గొడవలతో మానసికంగా కుంగిపోయాడు.
* కరీంనగర్ జిల్లాకు చెందిన కె.శ్రీధర్‌రెడ్డి (40) రాకేష్‌కు బాబాయి. చిన్నతనం నుంచి ఇతడితో చనువుగా ఉండేవాడు. శ్రీధర్‌రెడ్డి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి పలువురి వద్ద నుండి డబ్బులు తీసుకుని మోసం చేశాడు. ఈ బాధితుల్లో రాకేష్‌రెడ్డి ద్వారా వచ్చిన అతడి మిత్రులూ ఉన్నారు. ఈ డబ్బులు తిరిగి ఇవ్వమని ఒత్తిడి రావడంతో అక్టోబర్ మొదటి వారంలో ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు.
* శ్రీధర్‌రెడ్డి ఈ నెల 21న కరీంనగర్ నుంచి కాప్రా సాకేత్‌లో ఉండే బంధువు హరీష్‌రెడ్డి ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న రాకేష్ కూడా అక్కడకు వచ్చాడు. 22న హరీష్‌రెడ్డి అనంతపూర్ వెళ్ళగా... రాకేష్ 23న తన ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేశాడు.
* ఇంట్లో సమస్యల నేపథ్యంలో మనశ్శాంతి కోసం వచ్చానని శ్రీధర్‌రెడ్డితో చెప్పాడు. రాకేష్‌రెడ్డిని కిడ్నాప్ చేసినట్లు అతని కుటుంబీకులకు మేసేజ్ పంపితే... సోదరి భర్తతో ఉన్న వైరం కారణంగా అతడి పైనే అనుమానం వస్తుందని పథకం వేశాడు. అలా వచ్చే డబ్బుతో కొన్ని అప్పులు తీర్చుకోవచ్చని భావించాడు. మధ్యాహ్నం రాకేష్ నిద్రపోతున్నప్పుడు అతడి ఫోన్‌తోనే తండ్రి బాల్‌రెడ్డికి రూ.8 లక్షలు డిమాండ్ చేస్తూ మెసెజ్ పంపాడు.
* ఈ ఎస్సెమ్మెస్ అందుకుని తీవ్ర ఆందోళనకు గురైన రాకేష్ కుటుంబ సభ్యులు పదేపదే రాకేష్‌ఫోన్‌కు కాల్స్ చేశారు. రాకేష్ నిద్రలేస్తే కిడ్నాప్ నాటకం బయటపడి, పరువుపోతుందని భావించిన శ్రీధర్... ఇంట్లోని కత్తితో నిద్రతో ఉన్న రాకేష్ మెడపై పొడవటంతో పాటు కడుపులో పలుమార్లు పొడిచి చంపేశాడు. కొద్దిసేపటికి బాల్‌రెడ్డి ఫోన్‌కు ‘రాత్ 9 బజే 8 లాక్స్ చాహియే గాడి ఐసిఐసిఐకే ఆగె గడ్‌బడ్ మత్‌కర్‌నా ఆప్‌కి ఇచ్చా’ (రాత్రి 9 గంటలకు 8 లక్షలు కావాలి ఎవరి ముందు గడబిడ చేయవద్దు) అని మరో సందేశం పంపాడు.
* రాకేష్ మృతదేహాన్ని మాయం చేసేందుకు ఓ మిత్రుడి సహాయం కోరి భంగపడిన శ్రీధర్ గత్యంతరం లేక అదే రోజు రాత్రి బాల్‌రెడ్డికి ఫోన్ చేసి మీ కుమారుడు హరీష్‌రెడ్డి ఇంట్లో చనిపోయి పడి ఉన్నాడని చెప్పాడు. అప్పటికే బాల్‌రెడ్డి కీసర పోలీసులకు కుమారుడి అదృశ్యం, ఎస్సెమ్మెస్‌లపై ఫిర్యాదు చేశారు. శ్రీధర్ నుంచి ఫోన్ రావడంతో జవహర్‌నగర్ పోలీసులకూ సమాచారం ఇచ్చారు.
* దర్యాప్తు చేపట్టిన జవహర్‌నగర్ పోలీసులు హత్యాస్థలికి వచ్చిన దగ్గర నుంచి శ్రీధర్ ప్రవర్తన అసాధారణంగా మారిపోయింది. పోలీసు జాగిలాలు వస్తున్నాయని తెలిసి అనారోగ్యమంటూ అక్కడి నుంచి జారుకుని ఓ ఆస్పత్రిలో చేరాడు. తరచు హత్యాస్థలిలో ఉన్న రాకేష్ కుటుంబీకులకు ఫోన్లు చేస్తూ పోలీసులు వెళ్ళారా? జాగిలాలు ఏం చేశాయి? అంటూ అడిగాడు.
* హత్యాస్థలిలో ప్రవర్తన, జాగిలాలు ఏం చేస్తున్నాయంటూ అత్యుత్సాహం ప్రదర్శించడం తదితర చర్యలతో పోలీసులకు శ్రీధర్‌పై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతని వద్ద నుండి రాకేష్‌కు చెందిన సెల్‌ఫోన్‌లు, బైక్, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకుని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన ఏసీపీ సయ్యద్ రఫీక్, జవహర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ పి.వెంకటగిరి, సిబ్బందిని డీసీపీ రమారాజేశ్వరి అభినందించారు.