jawahar nagar police station
-
ఇంకుడు గుంతలో పడి బాలుడు మృతి
జవహర్‌నగర్: రంగారెడ్డి జిల్లా జవహర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. స్ధానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో తీసిన ఇంకుడుగుంతలో పడి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఇటీవల ఇంకుడుగుంతను తవ్వి వదిలేశారు. ఆపక్కనే నివాసం ఉండే బషీరుల్లా, సమీనా బేగం దంపతుల కుమారుడు ఇబ్రహీం(11) మంగళవారం సాయంత్రం ఆడుకుంటూ వచ్చి ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. కుమారుడు కనిపించకుండా పోయేసరికి దంపతులు గ్రామంలో వెదికినా ఫలితం కనిపించలేదు. దీంతో వారు బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం సమయంలో ఇంకుడు గుంత వద్దకు వెళ్లిన స్థానికులకు బాలుడి మృతదేహం కనిపించింది. వెలికి తీయగా అతడు ఇబ్రహీం అని తేలింది. బాలుడి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. -
క్రైమ్ స్క్రీన్‌ప్లే!
అబ్బాయిని క్రూరంగా చంపేసిన బాబాయ్ రాకేశ్ రెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు నేరేడ్మెట్(సికింద్రాబాద్): అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన ఓ బాబాయ్ తనతో చనువుగా ఉండే అబ్బాయ్‌ని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించాలని భావించాడు... తన గదికి వచ్చిన ఆ అబ్బాయ్ కిడ్నాప్‌కు గురైనట్లు నాటకానికి తెరలేపాడు.... పథకం పారదని తెలిసి క్రూరంగా హత్య చేసి... ఆ అబ్బాయ్ బావ మీద అనుమానం వచ్చేలా చేశాడు... ఇంత కథనడిపించినా... పోలీసుల చాకచక్యంగా వ్యవహరించడంతో ఎట్టకేలకు చిక్కి కటకటాల్లోకి చేరాడు... జవహర్‌నగర్ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన పూర్వాపరాలు మల్కాజిగిరి డీసీపీ రమారాజేశ్వరి కథనం ప్రకారం... * నాగారం శ్రీశ్రీనివాసనగర్ కాలనీకి చెందిన కె. బాల్‌రెడ్డి కుమారుడు రాకేష్‌రెడ్డి (29) విదేశాల్లో విద్యనభ్యసించి వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడం, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. రాకేష్‌రెడ్డి సోదరి, బావల మధ్య గొడవలతో మానసికంగా కుంగిపోయాడు. * కరీంనగర్ జిల్లాకు చెందిన కె.శ్రీధర్‌రెడ్డి (40) రాకేష్‌కు బాబాయి. చిన్నతనం నుంచి ఇతడితో చనువుగా ఉండేవాడు. శ్రీధర్‌రెడ్డి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి పలువురి వద్ద నుండి డబ్బులు తీసుకుని మోసం చేశాడు. ఈ బాధితుల్లో రాకేష్‌రెడ్డి ద్వారా వచ్చిన అతడి మిత్రులూ ఉన్నారు. ఈ డబ్బులు తిరిగి ఇవ్వమని ఒత్తిడి రావడంతో అక్టోబర్ మొదటి వారంలో ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. * శ్రీధర్‌రెడ్డి ఈ నెల 21న కరీంనగర్ నుంచి కాప్రా సాకేత్‌లో ఉండే బంధువు హరీష్‌రెడ్డి ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న రాకేష్ కూడా అక్కడకు వచ్చాడు. 22న హరీష్‌రెడ్డి అనంతపూర్ వెళ్ళగా... రాకేష్ 23న తన ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేశాడు. * ఇంట్లో సమస్యల నేపథ్యంలో మనశ్శాంతి కోసం వచ్చానని శ్రీధర్‌రెడ్డితో చెప్పాడు. రాకేష్‌రెడ్డిని కిడ్నాప్ చేసినట్లు అతని కుటుంబీకులకు మేసేజ్ పంపితే... సోదరి భర్తతో ఉన్న వైరం కారణంగా అతడి పైనే అనుమానం వస్తుందని పథకం వేశాడు. అలా వచ్చే డబ్బుతో కొన్ని అప్పులు తీర్చుకోవచ్చని భావించాడు. మధ్యాహ్నం రాకేష్ నిద్రపోతున్నప్పుడు అతడి ఫోన్‌తోనే తండ్రి బాల్రెడ్డికి రూ.8 లక్షలు డిమాండ్ చేస్తూ మెసెజ్ పంపాడు. * ఈ ఎస్సెమ్మెస్ అందుకుని తీవ్ర ఆందోళనకు గురైన రాకేష్ కుటుంబ సభ్యులు పదేపదే రాకేష్ఫోన్కు కాల్స్ చేశారు. రాకేష్ నిద్రలేస్తే కిడ్నాప్ నాటకం బయటపడి, పరువుపోతుందని భావించిన శ్రీధర్... ఇంట్లోని కత్తితో నిద్రతో ఉన్న రాకేష్ మెడపై పొడవటంతో పాటు కడుపులో పలుమార్లు పొడిచి చంపేశాడు. కొద్దిసేపటికి బాల్‌రెడ్డి ఫోన్‌కు ‘రాత్ 9 బజే 8 లాక్స్ చాహియే గాడి ఐసిఐసిఐకే ఆగె గడ్బడ్ మత్కర్నా ఆప్‌కి ఇచ్చా’ (రాత్రి 9 గంటలకు 8 లక్షలు కావాలి ఎవరి ముందు గడబిడ చేయవద్దు) అని మరో సందేశం పంపాడు. * రాకేష్ మృతదేహాన్ని మాయం చేసేందుకు ఓ మిత్రుడి సహాయం కోరి భంగపడిన శ్రీధర్ గత్యంతరం లేక అదే రోజు రాత్రి బాల్రెడ్డికి ఫోన్ చేసి మీ కుమారుడు హరీష్‌రెడ్డి ఇంట్లో చనిపోయి పడి ఉన్నాడని చెప్పాడు. అప్పటికే బాల్‌రెడ్డి కీసర పోలీసులకు కుమారుడి అదృశ్యం, ఎస్సెమ్మెస్‌లపై ఫిర్యాదు చేశారు. శ్రీధర్ నుంచి ఫోన్ రావడంతో జవహర్‌నగర్ పోలీసులకూ సమాచారం ఇచ్చారు. * దర్యాప్తు చేపట్టిన జవహర్‌నగర్ పోలీసులు హత్యాస్థలికి వచ్చిన దగ్గర నుంచి శ్రీధర్ ప్రవర్తన అసాధారణంగా మారిపోయింది. పోలీసు జాగిలాలు వస్తున్నాయని తెలిసి అనారోగ్యమంటూ అక్కడి నుంచి జారుకుని ఓ ఆస్పత్రిలో చేరాడు. తరచు హత్యాస్థలిలో ఉన్న రాకేష్ కుటుంబీకులకు ఫోన్లు చేస్తూ పోలీసులు వెళ్ళారా? జాగిలాలు ఏం చేశాయి? అంటూ అడిగాడు. * హత్యాస్థలిలో ప్రవర్తన, జాగిలాలు ఏం చేస్తున్నాయంటూ అత్యుత్సాహం ప్రదర్శించడం తదితర చర్యలతో పోలీసులకు శ్రీధర్‌పై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతని వద్ద నుండి రాకేష్‌కు చెందిన సెల్ఫోన్లు, బైక్, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకుని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన ఏసీపీ సయ్యద్ రఫీక్, జవహర్‌నగర్ ఇన్స్పెక్టర్ పి.వెంకటగిరి, సిబ్బందిని డీసీపీ రమారాజేశ్వరి అభినందించారు. -
సొరంగం చేసి బంగారం దుకాణంలో చోరీ
ఆరు కిలోల వెండి, విలువైన వస్తువుల అపహరణ జవహర్‌నగర్: బంగారం దుకాణంలోకి సొరంగం ఏర్పాటు చేసి కొందరు దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. కాప్రా సర్కిల్ పరిధిలోని జమ్మిగడ్డ జైజవాన్‌కాలనీలో సిరివి జువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ పేరుతో బంగారు ఆభరణాల దుకాణాన్ని చంద్రప్రకాశ్ నిర్వహిస్తున్నా రు. సోమవారం రాత్రి పది గంటలకు దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లారు. అదేరోజు అర్ధరాత్రి దొంగలు దుకాణం వెనకున్న గోడ కింది నుంచి సొరంగం తవ్వి లోపలికి ప్రవేశించారు. లాకర్లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకునే ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. చివరకు ర్యాక్‌లో ఉన్న ఆరు కిలోల వెండి ఆభరణాలతోపాటు విలువైన వస్తువులను తీసుకెళ్లారు. మంగళవారం ఉద యం దుకాణం తెరిచి చోరీ విషయం గుర్తించిన చంద్రప్రకాశ్.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. చోరీ సొత్తు విలువ సుమారు రూ.నాలుగు లక్షలు ఉంటుందన్నారు. పోలీసులు సీసీ కెమెరాల్లోని పుటేజీలను పరిశీలిస్తున్నారు. -
గర్భవతి.. వ్యభిచారానికి పనికిరాదని..
- ఇద్దరు భార్యలతో కలిసి చంపిన భర్త - నిందితుల అరెస్టు - కేసు వివరాలు వెల్లడించిన సీఐ వెంకటగిరి జవహర్‌నగర్: గర్భవతి అయిన భార్య వ్యభిచారానికి పనికిరాదని భావించిన భర్త మరో ఇద్దరు భార్యలతో కలిసి ఆమెను చంపేశాడు. గతనెల జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగుచూసింది. సీఐ వెంకటగిరి తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన మున్నా అలియాస్ మోహన్(40) తన ముగ్గురు భార్యలతో కలిసి గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం వరంగల్ జిల్లా పస్రా ప్రాంతానికి చెందిన మమత(24)ను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఆమె కీసర మండలం దమ్మాయిగూడలోని సాయిరాం కాలనీలో ఉంటోంది. గతనెల 12న అదే ప్రాంతంలో నివసించే అన్న కూతురు వివాహానికి మోహన్ తన నలుగురు భార్యలతో కలిసి హాజరయ్యాడు. ఆరునెలల గర్భవతి అయిన మమతను మోహన్ ప్రేమగా చూసుకుంటున్నాడు. తమను పట్టించుకోకపోవడంతో మిగతా ముగ్గురు భార్యలు కక్షగట్టారు. గర్భవతి కావడంతో వేశ్యవృత్తికి పనికిరాదని, ముగ్గురు భార్యలు భర్త మోహన్‌తో గొడవపడ్డారు. ఈక్రమంలో అదే రోజు మోహన్ పథకం ప్రకారం ఇద్దరు భార్యలతో కలిసి మమతకు బాగా మద్యం తాగించారు. అనంతరం ఆమె చీరకొంగుతో మెడకు బిగించి శివ ఇంట్లో ఉరివేసి చంపేశారు. మృతదేహాన్ని ఫ్యాన్‌కు వేలాడదీసి మమత ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులను నమ్మించారు. మృతదేహాన్ని కిందికి దించి మమత ఆత్మహత్యకు పాల్పడిందని పెళ్లికి వచ్చిన బంధువులకు నమ్మబలికి మల్కాజిగిరిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉండగా, వారం రోజుల క్రితం సికింద్రాబాద్‌లో ఓ వేశ్యతో మోహన్ ముగ్గురు భార్యల్లో ఒకరు మమతను హత్య చేసిన విషయం చెప్పింది. సదరు వేశ్య జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన సీఐ వెంకటగిరి మోహన్‌తో పాటు ఆయన ఇద్దరు భార్యలను అదుపులోకి తీసుకొని విచారించగా మమతను చంపిన నేరం అంగీకరించారు. వారితో పాటు హత్యకు సహకరించిన మోహన్ అన్నపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
చిన్నారి అపహరణ...విడుదల
హైదరాబాద్: బాలికను కిడ్నాప్ చేసి... చెవి పోగులు, కాళ్ల పట్టాలు తీసుకొని వదిలేసిన ఘటన కాప్రా జమ్మిగడ్డలో కలకలం సృష్టించింది. జవహర్ నగర్ సీఐ వెంకటగిరి కథనం ప్రకారం.... జమ్మిగడ్డ భరత్ నగర్ లో ఉండే దారావత్ రాజు, స్వరూప దంపతుల కుమార్తె ధృతి (5). స్థానిక హిందూ బ్రిలియంట్ స్కూల్ లో ఎల్కేజీ చదువుతోంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు తన ఇంటి ముందు ఆడుకుంటున్న ధృతి వద్దకు ఓ మహిళ వచ్చి తనతో వస్తే చాక్లెట్ కొనిస్తానని చెప్పి...ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోని సాకేత్ సమీపంలోని రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ వద్దకు తీసుకు వెళ్లింది. అక్కడ ఓ గల్లిలో బాలిక చెవులకు ఉన్న 2 గ్రాముల బంగారు పోగులు, 5 తులాల కాళ్లపట్టీలను తీసుకుని పారిపోయింది. చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు సమీప ఠాణాలకు సమాచారం ఇచ్చారు. రాత్రి 7.20కి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కుషాయిగూడ పోలీసులకు సాకెత్ వద్ద చిన్నారి ధృతి ఏడుస్తూ కనిపించగా వారు జవహర్ నగర్ పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా బాలికను అపహరించిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.