రియాల్టీ షోను అనుకరించబోయి..
చాంద్రాయణగుట్ట: పాతబస్తీ యువతలో మార్పు తీసుకొచ్చేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొందరు యువకుల్లో మార్పు రావడం లేదు. టీవీలలో డబ్ల్యూ డబ్ల్యూ ఫైట్‌ను చూసి ఆకర్షితులై గతేడాది మే నెలలో యువకులు స్ట్రీట్ ఫైట్‌కు దిగిన ఘటనలో నబీల్ అనే యువకుడు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. తాజాగా ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో సైతం ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి టీవీలలో ప్రసారమయ్యే అగ్నికి సంబంధించిన విన్యాసాలను స్పూర్తిగా తీసుకొనే ప్రయత్నంలో ప్రాణాలుకోల్పోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్కాస్ ప్రాంతానికి చెందిన బషీరుద్దీన్ కుమారుడు జలాలుద్దీన్(19) శాలిబండలోని గౌతం జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యనభ్యసిస్తున్నాడు. కాగా గత కొన్నాళ్ల నుంచి జలాలుద్దీన్ టీవీలలో వచ్చే ఇండియా గాట్ ట్యాలెంట్ షో లాంటి రియాల్టీ షో లను స్పూర్తిగా తీసుకొని తాను కూడా అలా చేయాలని...విన్యాసాలు చేస్తూ వీడియోలలో చిత్రీకరించి సదరు ఛానల్‌లకు పంపాలని ప్రయత్నిస్తున్నాడు. ఇలా చేసే క్రమంలో పలుమార్లు తల్లిదండ్రులు హెచ్చరించారు.
ఇంట్లో తల్లిదండ్రులు తనపై నిఘా ఉంచారని తెలుసుకున్న జలాలుద్దీన్ బయట స్నేహితులతో తన ప్రయోగాలు చేయడం ఆరంభించాడు. ఓ ప్రముఖ హిందీ ఛానల్‌లో ప్రసారమయ్యే అగ్నితో చెలగాటమాడే కార్యక్రమం చూసి తాను కూడా అలా చేసి సెలబ్రిటీ కావాలని ఊహించాడు. తన బంధువులలోని ఐదుగురు యువకులతో కలిసి ఫలక్‌నుమా జహనుమా వాటర్ ట్యాంక్ ప్రాంతానికి వెళ్లి టీవీలలో వచ్చే షో మాదిరిగా జలాలుద్దీన్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
వెంటనే విప్పి పడేసేందుకు యత్నించినప్పటికీ...అది టీ షర్ట్ కావడంతో త్వరగా రాకపోవడంతో తీవ్ర గాయాలకు గురయ్యాడు. వెంటనే అతన్ని స్నేహితులు కుటంబ సభ్యుల సహకారంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందిన జలాలుద్దీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.