
'విశ్వసనీయత లేకుంటే భార్య కూడా నమ్మదు'
హైదరాబాద్:
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి తిరిగి ప్రజల్లోకి వెళ్లాలని వైెస్సార్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాలు విసిరారు. అయితే అంత ధైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు. మంగళవారం శాసనసభ వాయిదా పడిన తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానమిచ్చారు. పార్టీ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరనున్న జ్యోతుల నెహ్రూ విషయం ప్రశ్నించినప్పుడు పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి ప్రజల్లోకి వెళ్లాలన్నారు.
రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత కలిగి ఉండటం ముఖ్యమని తానెప్పుడూ చెబుతుంటాననీ, అవి రెండూ చంద్రబాబుకు లేవని ఆయన మండిపడ్డారు. విశ్వసనీయత లేకుంటే భార్య కూడా ఆ వ్యక్తిని నమ్మదని పేర్కొన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఇస్తానంటూ చంద్రబాబు ప్రలోభాలకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. వ్యక్తిత్వం, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తే ఎక్కువ కాలం నిలబడరని ఆయన అన్నారు.