
చంద్రబాబే సూత్రధారి
ఆయన్ను జైలుకు పంపించండి: గవర్నర్ నరసింహన్‌కు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విజ్ఞప్తి
నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ పాత్రధారి
- ఆయుధం రెన్యువల్ చేయలేదు.. రక్షణ కల్పించలేదు
- పథకం ప్రకారం నిస్సహాయుడ్ని చేసి చంపారు
- రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
- ప్రలోభాలకు లొంగని నేతలను హత్య చేస్తున్నారు
- టీడీపీ వారిపై కేసులు తొలగిస్తూ 132 జీవోలిచ్చారు
- మూడేళ్లలో ఎన్నో రాజకీయ హత్యలు
- గవర్నర్ గారూ... ఇప్పటికైనా జోక్యం చేసుకోండి
సాక్షి, హైదరాబాద్ : కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డి దారుణ హత్య వెనుక టీడీపీ ప్రభుత్వం కుట్ర ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ హత్యకు పరోక్షంగా సహకరించిన కుట్రదారుడని, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పాత్రధారుడని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు ఆర్.కె.రోజా, చిర్ల జగ్గిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణలతో కలిసి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో జగన్ చంద్రబాబు ప్రభుత్వ హత్యా రాజకీయాలను, రాష్ట్రంలో జరుగుతున్న హత్యలపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు రాక్షసపాలన పూర్వాపరాలపై ఒక వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. రాజకీయ వ్యవస్థలను హింసాయుతం చేస్తున్న చంద్రబాబు విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని, తన విచక్షణను ఉపయోగించి ఆయన్ను జైలుకు పంపాలని జగన్ విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ను కలిశాక తమ పార్టీ నేతలతో కలసి జగన్ రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, నేతలను ప్రలోభాలు పెట్టి లోబర్చుకుంటోందని అలా లొంగని వారిని హతమారుస్తూ ఉందని ధ్వజమెత్తారు. వివరాలు ఆయన మాటల్లోనే...
ప్రజాస్వామ్యం ఖూనీ..
‘‘కర్నూలులో నెలకొన్న హింసాత్మక పరిణామాలపై గవర్నర్‌కు ఇవాళ వివరంగా చెప్పాం. అధికారపక్షం ఎంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందో... ఎంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తా ఉందో... ప్రత్యర్థులను ఎంత దారుణంగా హతమారుస్తోందో... వివరించాం. ఎన్నికల్లో గెలవని పరిస్థితులు నెలకొంటున్నపుడు, ప్రత్యర్థులు కొనుగోళ ్లకు, ప్రలోభాలకు లొంగక పోతే చివరికి వారిని చంపేసేంత వరకూ టీడీపీ పాలనలో పరిస్థితులు పోతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లి... ఇది న్యాయమేనా? ధర్మమేనా? అని గట్టిగా అడిగాం.
వారిపై కేసులెత్తేయడానికి 132 జీవోలు
టీడీపీ నేతలపై నమోదై ఉన్న కేసులను ఎత్తేయడానికి వాటి నుంచి వారందరినీ విముక్తి చేయడానికి ఒకటి కాదు, రెండు కాదు దాదాపుగా 132 జీవోలను చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవోల జారీతో టీడీపీ వారిపై ఉన్న కేసులన్నింటినీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పత్తికొండలో మా పార్టీ అభ్యర్థి చెరుకులపాడు నారాయణరెడ్డి గెలిచే పరిస్థితి ఉంది. టీడీపీ అక్కడ గెలవలేదు. నారాయణరెడ్డి ఉంటే వారి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని భావించి ఆయనను కిరాతకంగా హత్య చేశారు. తన వద్ద ఉన్న ఆయుధాన్ని (గన్)ను రెన్యువల్ (పునరుద్ధరించాలని)చేయాలని నారాయణరెడ్డి పోలీసులను కోరితే వారు ఆయన ఆయుధాన్ని తీసేసుకున్నారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆయుధాన్ని స్వాధీనం చేయండని చెప్పి పోలీసులు ఆయన నుంచి తీసుకుని ఆ తరువాత దానిని తిరిగి ఇవ్వలేదు. అంటే ఒక పథకం ప్రకారం ఆయన వద్ద లైసెన్సు కలిగిన ఆయుధాన్ని లేకుండా చేసే కుట్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పత్తికొండ ప్రాంతంలో ఇసుక మాఫియా ఆగడాలను నారాయణరెడ్డి వెలుగులోకి తెచ్చారు.
అక్కడ కోర్టులు కూడా జోక్యం చేసుకుని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడిపై దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చేదాకా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియాల మీద ఆయన పోరాటం చేశారు. టీడీపీ వారి ఆగడాలను అడ్డుకుంటున్నాను కనుక తన ప్రాణాలకు హాని ఉందని, భద్రత కల్పించాలని ప్రభుత్వానికి, పోలీసులకు కూడా ఆయన పదే పదే విజ్ఞప్తి చేశారు. ఎన్ని విజ్జప్తులు చేసినా నారాయణరెడ్డికి కావాలనే సెక్యూరిటీ ఇవ్వలేదు. ఇవాళ టీడీపీ మండల స్థాయి నేతకు కూడా ఇద్దరేసి, ముగ్గురేసి గన్‌మెన్‌లను ఇస్తున్నారు. అలాంటిది ప్రత్తికొండ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడబోతూ ఉన్న వ్యక్తికి ఆయుధ లైసెన్సును కూడా పునరుద్ధరించలేదు. ఒక పథకం, పద్ధతి ప్రకారం కుట్ర పన్ని కల్వర్టును ఉపయోగించుకుని ట్రాకర్లు అడ్డం పెట్టి అతి కిరాతకంగా హతమార్చారు.
సాక్ష్యాలు చెరిపేయాలనే...
హత్యకు సంబంధించిన సాక్ష్యాధారాలు చెరిగి పోవాలనే ఉద్దేశంతోనే పోలీసులు హత్యాస్థలికి మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలస్యంగా చేరుకున్నారు. చుట్టు పక్కల నుంచి జనం వచ్చి ఏం జరిగిందోనని చూడ్డానికి ప్రయత్నించినపుడు హత్యాస్థలి వద్ద సాక్ష్యాధారాలు చెరిగిపోతాయి. అలా చెరిగిపోవాలనే ఒక పథకం ప్రకారం అక్కడికి పోలీసులు రాలేదు. ఓవైపు అప్రజాస్వామికంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారు అనర్హతకు గురికాకుండా కాపాడతారు. ఓ అడుగు ముందుకేసి మంత్రి పదవులు ఇస్తారు. అప్పటికీ లొంగకపోతే ఏకంగా మనుషులనే హతమార్చే స్థాయికి ఈ రాజకీయ వ్యవస్థను చంద్రబాబు దిగజారుస్తున్నారు.
ఇంతకన్నా కిరాతకం, దారుణం ఇంకేమీ ఉండదు. ఆయనపై చర్య తీసుకోవాలి. ఈ హత్యలో చంద్రబాబు కుట్రదారుడు, హత్య చేసింది కేఈ కృష్ణమూర్తి నియోజకవర్గంలో... ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పాత్రధారుడైతే అందుకు పరోక్షంగా సహకరించిన కుట్రదారుడు చంద్రబాబు. ఇంత దారుణంగా హత్యలు జరిగితే ప్రజాస్వామ్యం బతకదు. ఇవే విషయాలను మేం గవర్నర్‌కు వివరిస్తూ చంద్రబాబు పాలనలో ఈ మూడేళ్లలో ఎన్ని రాజకీయ హత్యలు జరిగాయో వినతిపత్రంలో పొందు పర్చి ఇచ్చాం. మా పార్టీలో చేరిన గంగుల ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గమైన ఆళ్లగడ్డలో ఆయన ముఖ్య అనుచరుడొకరిని ఇటీవలే చంపించేశారు. నా నియోజకవర్గంలోని వేంపల్లెలో గజ్జెల రామిరెడ్డి అనే నేతను కూడా చంపేశారు. ఇలా ఎన్నో హత్యలు చేయించారు.
ప్రభుత్వ ప్రమేయం స్పష్టం...
తాను ఉపముఖ్యమంత్రి అయ్యాక పత్తికొండలో చాలా వరకూ హత్యలు తగ్గాయని, తనకు నారాయణరెడ్డి హత్యతో ఎలాంటి సంబంధం లేదని కేఈ కృష్ణమూర్తి చెప్పారని విలేకరులు ప్రస్తావించగా... ‘‘20 నుంచి 25 మంది ఏకమై ట్రాక్టర్లు అడ్డు పెట్టి కిరాతకంగా చంపారు. నారాయణరెడ్డికి ఆయుధ లైసెన్సు రెన్యూవల్ చేయలేదు. ఉన్న ఆయుధమూ తీసుకున్నారు. గన్‌మెన్‌ల కోసం విజ్ఞప్తి చేసినా ఇవ్వలేదు. ఇన్ని సంఘటనలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఇంకా ఈ హత్యలో ప్రభుత్వ ప్రమేయం లేదని చెప్పడానికి ఎవరికైనా నోరు ఎలా వస్తుంది? .’’ అని జగన్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబును జైలుకు పంపాల్సిన కేసులున్నాయి..
గోదావరి పుష్కరాలలో తన సినిమా షూటింగ్ కోసం చంద్రబాబు 29 మందిని చంపేశారు. దీనిపై ఇంత వరకూ కేసే లేదు. చిత్తూరులో 26 మంది కూలీలను కాల్చి చంపారు. కేసుల్లేవు. ఇసుకమాఫియా, మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, కాంట్రాక్టు మాఫియా నుంచి తీసుకున్న అవినీతి సొమ్ముతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో సహా దొరికిపోతే కేసులు లేవు. ఇవన్నీ చంద్రబాబు జైలుకు పోవాల్సిన కేసులే... చివరకు రాజధానిలో స్విస్ చాలెంజ్ పేరుతో చంద్రబాబు మరో దారుణం చేస్తున్నారు. ఇదీ జైలుకు పోవాల్సిన కేసే.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఈ వ్యక్తి సీఎంగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టం. తనకు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో రాసిన వాళ్లపైకి పోలీసులను పంపి మరీ చర్యలు తీసుకుంటున్నారు. ‘రాష్ట్రంలో చంద్రబాబు పాలనను అంతం చేయండి. 356 ఆర్టికల్‌ను ప్రయో గించండి. రాష్ట్రపతి పాలనను విధించండి’ అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ మార్కండేయ కాట్జూ కూడా రాష్ట్రపతి, ప్రధానిలకు లేఖ రాసేంతటి దారుణ పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. కనుక గవర్నర్ జోక్యం చేసుకుని చంద్రబాబు లాంటి వ్యక్తులను జైలుకు పంపితే తప్ప ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడదు.’’అని జగన్ పేర్కొన్నారు.