అందరి ఉద్యోగాలు పోయేలా కోర్టుకెళ్తా
ఎమ్మెల్యే రోజా అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుబట్టారు. ఆయన స్వయంగా నాంపల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎమ్మెల్యే రోజాను పరామర్శించారు. ఈ సందర్భంలో పోలీసు ఉన్నతాధికారులకు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే విషయంలో సరిగా వ్యవహరించకపోతే అందరి ఉద్యోగాలు పోయేలా కోర్టుకు వెళ్తానని ఆయన హెచ్చరించారు. స్పృహ తప్పిన ఎమ్మెల్యేను... అందునా మహిళా ఎమ్మెల్యేను అంబులెన్సు లేకుండా పోలీసు జీపులో ఎలా తీసుకెళ్తారని ఆయన ప్రశ్నించారు. ఆమెను నిమ్స్‌కు తీసుకెళ్లడానికి అంబులెన్సు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ తర్వాత మాత్రమే పోలీసులు అంబులెన్సు తెప్పించి, రోజాను నిమ్స్‌కు తరలించారు. అంతకుముందు కూడా ''కావాలని మీరు ఈ ప్రాంతమంతా కవర్ చేస్తున్నారు. ఫొటోలు, కెమెరాలను అనుమతించడంలేదు. ఆమె ఏ పరిస్థితిలో ఉన్నారోనని జనం ఆందోళన చెందుతున్నారు'' అని పోలీసులకు వైఎస్ జగన్ చెప్పారు.
కాగా రోజా అరెస్టు సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. అరెస్టు విషయంలో పోలీసుల దారుణంగా వ్యవహరించారు. నిరసన వ్యక్తం చేయడానికి రాలేదు, వైఎస్ఆర్‌సీఎల్పీ కార్యాలయాలనికి వెళ్లేందుకే వచ్చానని చెప్పినా వినలేదు. అరెస్టు సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో ఓ సమయంలో ఆమె స్పృహ కోల్పోయే పరిస్థితి కూడా వచ్చింది. మార్షల్స్ వ్యవహరించిన తీరును ఎమ్మెల్యేలంతా తప్పుబట్టారు. ఇది ప్రజాస్వామ్యమా, నియంత పాలనా అని నిలదీస్తున్నారు.