Nampally police station
-
స్టేషన్ అడ్రస్ దొరక్క తికమక..
నాంపల్లి: నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బుధవారం రాత్రి నాంపల్లి శాంతిభద్రతల పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానికంగా నివాసం ఉండే రౌడీషీటర్‌పై ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా నేరుగా పోలీసు స్టేషన్‌కు వచ్చారు. అయితే స్టేషన్ చిరునామా దొరక్క ఆయనతోపాటు సిబ్బంది కూడా కాసేపు తికమక పడ్డారు. తొలుత నిలోఫర్ దగ్గర నిర్మాణంలో ఉన్న పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ స్టేషన్ లేదని తెలుసుకున్నాక కొంతదూరం ముందుకు వెళ్లారు. మార్గమధ్యలో స్థానికులు ఇచ్చిన సమాచారంతో శాంతిభద్రతల పోలీసు స్టేషన్ అనుకుని నాంపల్లి ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ట్రాఫిక్ పోలీసులు నగర కమిషనర్‌ను చూసి అవాక్కయ్యారు. తదుపరి శాంతినగర్ పోలీసు క్వార్టర్స్‌లో ఉన్న నాంపల్లి శాంతిభద్రతల పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. కాన్వాయ్ దిగిన కొత్వాల్ అంజనీకుమార్ నాంపల్లి ఇన్స్పెక్టర్ ఛాంబర్లోకి వెళ్లారు. అక్కడ కాసేపు ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్‌తో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రౌడీ షీటర్ల కదలికలపై దృష్టిసారించడానికి తాను నాంపల్లి పోలీసు స్టేషన్‌కు వచ్చినట్లు వివరించారు. -
జీవితంపై విరక్తి చెంది.. బాత్రూమ్లో..
నాంపల్లి: జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన నాంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లక్ష్మీనగర్‌లో నివాసం ఉండే రాజు,లక్ష్మీలు దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. భార్యాభర్తలు కూలిపని చేసుకుంటూ జీవనం సాగించేవారు. అతడు గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పక్షవాతం వచ్చి కుడికాలు, కుడి చేయి పడిపోయింది. ఇటీవల చికిత్స చేయడంతో కోలుకున్నారు. పక్షవాతం వచ్చినప్పటి నుంచి జీవితంపై రాజు విరక్తి చెందారు. భార్య, పిల్లలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్ రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నా చావుకు ఎవరూ కారణం కాదని, అనారోగ్యంతోనే చనిపోతున్నట్లు లేఖ రాసుకుని జేబులో ఉంచుకున్నాడు. బంధువులు అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ పత్రాలతో యాజమానినే భయపెట్టాడు..
నాంపల్లి: నకిలీ దస్తావేజులు తయారు చేసి ఓ ఇంటి యజమానిని భయభ్రాంతులకు గురిచేసిన కిరాయిదారుడితోపాటు అతని అనుచరులను నాంపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నాంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని బజార్‌ఘాట్‌లో చోటుచేసుకున్న ఈ కేసుకు సంబంధించి ఇన్స్పెక్టర్ మధు మోహన్‌రెడ్డి తెలిపిన వివరాలివీ.. బజార్‌ఘాట్‌లో నివాసం ఉండే గణపతి రావుకు ఎనిమిది పోర్షన్లున్న భవనం ఉంది. దానిని ఎనిమిది మందికి అద్దెకిచ్చారు. షేర్గల్లీకి చెందిన సయీద్ అనే వ్యక్తికి 2009లో అద్దెకు దిగాడు. ఈ ఏడాది మేనెలలో ఇంటి యజమాని గణపతిరావు మరణించారు. హుమాయూన్ నగర్ ఉండే ఆయన కుమారుడు ప్రవీణ్ అద్దె కోసం సయీద్ వద్దకు ఇటీవల వెళ్లారు. అద్దె చెల్లించకుండా ఈ ఇల్లు తనదేనంటూ సయీద్ తిరగబడ్డాడు. ‘అద్దె లేదు.. ఇల్లు లేదు.. దిక్కున్నచోట చెప్పుకో’ అంటూ దబాయించాడు. ‘మీ తండ్రి నాకు అమ్మేశాడం’టూ దొంగ డాక్యుమెంట్లు, దొంగ రసీదులు చూపించారు. అంతటితో ఆగకుండా సిటీ సివిల్ కోర్టులో కేసు పెట్టాడు. మున్సిపల్ ట్యాక్స్ రసీదు, ఇళ్లు కొన్నట్టుగా ఇంటి యజమానికి నగదు చెల్లించిన రసీదు, ఎలక్ట్రిసిటీ, నల్లా కనెక్షన్ రసీదులు నకిలీవి సంపాదించాడు. ఈ రసీదులతో గోల్కొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేసే ముస్తాక్ అనే బ్రోకర్ సాయంతో సయీద్ తన పేరిట ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై కోర్టుకు నివేదించిన తప్పుడు డాక్యుమెంట్లతో ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కూపీ లాగితే డొంక కదిలింది. సయీద్‌ను అతని అనుచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తే నిజాన్ని ఒప్పుకున్నారు. దీంతో సయీద్, ముస్తాక్, ఖలీమ్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సయీద్ తమ్ముడు, భార్య పరారీలో ఉన్నారు. -
అందరి ఉద్యోగాలు పోయేలా కోర్టుకెళ్తా
ఎమ్మెల్యే రోజా అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుబట్టారు. ఆయన స్వయంగా నాంపల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎమ్మెల్యే రోజాను పరామర్శించారు. ఈ సందర్భంలో పోలీసు ఉన్నతాధికారులకు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే విషయంలో సరిగా వ్యవహరించకపోతే అందరి ఉద్యోగాలు పోయేలా కోర్టుకు వెళ్తానని ఆయన హెచ్చరించారు. స్పృహ తప్పిన ఎమ్మెల్యేను... అందునా మహిళా ఎమ్మెల్యేను అంబులెన్సు లేకుండా పోలీసు జీపులో ఎలా తీసుకెళ్తారని ఆయన ప్రశ్నించారు. ఆమెను నిమ్స్‌కు తీసుకెళ్లడానికి అంబులెన్సు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ తర్వాత మాత్రమే పోలీసులు అంబులెన్సు తెప్పించి, రోజాను నిమ్స్‌కు తరలించారు. అంతకుముందు కూడా ''కావాలని మీరు ఈ ప్రాంతమంతా కవర్ చేస్తున్నారు. ఫొటోలు, కెమెరాలను అనుమతించడంలేదు. ఆమె ఏ పరిస్థితిలో ఉన్నారోనని జనం ఆందోళన చెందుతున్నారు'' అని పోలీసులకు వైఎస్ జగన్ చెప్పారు. కాగా రోజా అరెస్టు సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. అరెస్టు విషయంలో పోలీసుల దారుణంగా వ్యవహరించారు. నిరసన వ్యక్తం చేయడానికి రాలేదు, వైఎస్ఆర్సీఎల్పీ కార్యాలయాలనికి వెళ్లేందుకే వచ్చానని చెప్పినా వినలేదు. అరెస్టు సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో ఓ సమయంలో ఆమె స్పృహ కోల్పోయే పరిస్థితి కూడా వచ్చింది. మార్షల్స్ వ్యవహరించిన తీరును ఎమ్మెల్యేలంతా తప్పుబట్టారు. ఇది ప్రజాస్వామ్యమా, నియంత పాలనా అని నిలదీస్తున్నారు. -
ఎమ్మెల్యేల అరెస్టు.. స్టేషన్‌కు తరలింపు
తెలంగాణ అసెంబ్లీని అర్ధాంతరంగా వాయిదా వేయడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. గన్ పార్కు ఎదుట ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. దాంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఏకమొత్తంగా రుణమాఫీ చేయమంటే సభను వాయిదా వేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ప్రతిపక్షాల ఐక్యపోరాటం కొనసాగుతుందని అన్ని పక్షాల నేతలు చెప్పారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రైతు రుణమాఫీపై స్పష్టమైన హామీ ఇవ్వలేదని మండిపడ్డారు. అర్ధాంతరంగా సభను వాయిదా వేయడం నిరంకుశ పాలనకు పరాకాష్ట అని విమర్శించారు. కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, వామపక్షాల సభ్యులు గన్‌పార్కు వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. -
ఫుట్‌బాల్ ఆటగాళ్లపై వ్యక్తి దాడి
నాంపల్లి: ఫుట్‌బాల్ ఆడుతున్న ముగ్గురిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ముగ్గురిలో ఇద్దరు బాలురు ఉన్నారు. ఈ సంఘటన గురువారం నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ మధుమోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... రెడ్‌హిల్స్ గ్రౌండ్ సమీపంలో ఇస్రాఉద్దీన్తో పాటు మరో ఇద్దరు పిల్లలు ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ఈ క్రమంలో బంతి ఖాజా మోహినుద్ధీన్ అనే వ్యక్తి ఇంటి గేటుకు తగిలింది. బంతి గేటుకు తగలగానే ఖాజామోహినుద్ధీన్ బయటకు వచ్చి ఆట ఆడుతున్న ఇస్రాఉద్ధీన్తో పాటు మరో ఇద్దరు చిన్నారులపై కట్టెతో దాడిచేశాడు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ముగ్గురిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.