నాంపల్లి: నకిలీ దస్తావేజులు తయారు చేసి ఓ ఇంటి యజమానిని భయభ్రాంతులకు గురిచేసిన కిరాయిదారుడితోపాటు అతని అనుచరులను నాంపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నాంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని బజార్‌ఘాట్‌లో చోటుచేసుకున్న ఈ కేసుకు సంబంధించి ఇన్‌స్పెక్టర్ మధు మోహన్‌రెడ్డి తెలిపిన వివరాలివీ.. బజార్‌ఘాట్‌లో నివాసం ఉండే గణపతి రావుకు ఎనిమిది పోర్షన్లున్న భవనం ఉంది. దానిని ఎనిమిది మందికి అద్దెకిచ్చారు. షేర్‌గల్లీకి చెందిన సయీద్ అనే వ్యక్తికి 2009లో అద్దెకు దిగాడు. ఈ ఏడాది మేనెలలో ఇంటి యజమాని గణపతిరావు మరణించారు. హుమాయూన్ నగర్ ఉండే ఆయన కుమారుడు ప్రవీణ్ అద్దె కోసం సయీద్ వద్దకు ఇటీవల వెళ్లారు. అద్దె చెల్లించకుండా ఈ ఇల్లు తనదేనంటూ సయీద్ తిరగబడ్డాడు. ‘అద్దె లేదు.. ఇల్లు లేదు.. దిక్కున్నచోట చెప్పుకో’ అంటూ దబాయించాడు. ‘మీ తండ్రి నాకు అమ్మేశాడం’టూ దొంగ డాక్యుమెంట్లు, దొంగ రసీదులు చూపించారు.
అంతటితో ఆగకుండా సిటీ సివిల్ కోర్టులో కేసు పెట్టాడు. మున్సిపల్ ట్యాక్స్ రసీదు, ఇళ్లు కొన్నట్టుగా ఇంటి యజమానికి నగదు చెల్లించిన రసీదు, ఎలక్ట్రిసిటీ, నల్లా కనెక్షన్ రసీదులు నకిలీవి సంపాదించాడు. ఈ రసీదులతో గోల్కొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేసే ముస్తాక్ అనే బ్రోకర్ సాయంతో సయీద్ తన పేరిట ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై కోర్టుకు నివేదించిన తప్పుడు డాక్యుమెంట్లతో ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కూపీ లాగితే డొంక కదిలింది. సయీద్‌ను అతని అనుచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తే నిజాన్ని ఒప్పుకున్నారు. దీంతో సయీద్, ముస్తాక్, ఖలీమ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సయీద్ తమ్ముడు, భార్య పరారీలో ఉన్నారు.
నకిలీ పత్రాలతో యాజమానినే భయపెట్టాడు..
Published Mon, Jun 6 2016 8:44 PM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM
Advertisement