
1.75 కోట్ల ఇళ్లు ఎదురు చూస్తున్నాయి..
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించడంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రతి ఇంటికో ఉద్యోగం లేదా ఉపాధి కల్పిస్తామని, కల్పించకపోతే నిరుద్యోగులకు నెలకు 2 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని.. రాష్ట్రంలో 1.75 కోట్లు ఇళ్లు ఉన్నాయని, ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నాయని వైఎస్ జగన్ చెప్పారు. ప్రతి ఇంటికీ ఉద్యోగం లేదా ఉపాధి అయినా కల్పించాలని లేకుంటే నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నాలుగోరోజు గురువారం వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి కల్పించనందుకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందు సభలో వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే..
- ప్రతి ఇంటికో ఉద్యోగం లేదా ఉపాధి కల్పిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు
- కల్పించకపోతే నిరుద్యోగులకు నెలకు 2 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు
- జాబు రావాలంటే బాబు రావాలని ఊదరగొట్టారు
- 1.75 కోట్లు ఇళ్లు ఉన్నాయి, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాయి
- చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు
- ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో తెలియక డీఎస్సీ పరీక్షలు రాసిన విద్యార్థులు ఎదురు చూస్తున్నారు
- కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారు
- విభజన సమయంలో లక్షా 42 వేల 800 ఉద్యోగాలు ఉన్నాయన్నారు
- ఇప్పటి వరకు ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు
- రెగ్యులరైజేషన్ కోసం వీఆర్ఏలు పోరాటం చేస్తున్నారు
- హాస్టళ్లు, స్కూళ్లు, కాలేజీలు మూసివేస్తున్నారు
- 7 వేల ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తున్నారు
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తామని చెప్పారు
- ఇప్పుడు పరిశీలన మాత్రమే చేస్తామని బుకాయిస్తున్నారు
- గోపాలమిత్ర, ఆరోగ్యమిత్ర, ఆదర్శ రైతులను తొలగించారు