ఇంటికో ఉద్యోగం ఏదీ? | YS Jagan open letter to Cm chandrababu | Sakshi
Sakshi News home page

ఇంటికో ఉద్యోగం ఏదీ?

Published Thu, Feb 23 2017 1:49 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

ఇంటికో ఉద్యోగం ఏదీ? - Sakshi

ఇంటికో ఉద్యోగం ఏదీ?

చంద్రబాబుకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ బహిరంగ లేఖ
నిరుద్యోగ భృతిని బకాయిలతో సహా చెల్లించండి
1.75 కోట్ల ఇళ్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1.15 లక్షల కోట్లు
2017–18 బడ్జెట్‌లో నిధులు కేటాయించండి
మీరు చెబుతున్న పెట్టుబడులు, ఉద్యోగాలు కేవలం ఒక మిథ్య
అవి మీకు తప్ప ప్రజలకు కనిపించని దేవతా వస్త్రాలు
లక్షల ఉద్యోగావకాశాలు కల్పించే ప్రత్యేక హోదాను మీరే అడ్డుకుంటున్నారు
నిరుద్యోగ భృతి చెల్లించకపోతే మా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం


సాక్షి, హైదరాబాద్‌: ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని, ఉద్యోగం కల్పించేంత వరకు ప్రతి నిరుద్యోగికీ నెలనెలా రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఎక్కడిచ్చారో చెప్పాలన్నారు. ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైన ముఖ్య మంత్రి చంద్రబాబు వారికి నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు వైఎస్‌ జగన్‌ బుధవారం ముఖ్యమం త్రికి బహిరంగ లేఖ రాశారు. 33 నెలల బకాయిలతో సహా ఇకపై నిరుద్యోగ భృతిని అర్హులైన వారందరికీ చెల్లించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇంటింటికీ పంచిన టీడీపీ కరపత్రాన్ని కూడా ఈ లేఖతోపాటు జతచేశారు. జగన్‌ రాసిన లేఖను వైఎస్సా ర్‌సీపీ రాజకీయ వ్యవహారాల మండలి (పీఏసీ) సభ్యుడు అంబటి రాంబాబు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో విడుదల చేశారు. లేఖ పూర్తి పాఠం....

గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి,
ఇంటికో ఉద్యోగం/ఉపాధి కల్పిస్తానని, అది దొరికేంత వరకూ ప్రతి ఇంటికీ రూ.2,000 నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల సమయంలో మీరు వాగ్దానం చేశారు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలంటూ మీరే ఊరూరా ఊదరగొట్టారు. నరేంద్రమోదీ, పవన్‌కల్యాణ్‌ మీ వాగ్దానాలను బలపర్చినట్లుగా స్వయంగా మీరు సంతకం చేసి ఇంటింటికీ పంచిన కరపత్రం కాపీని కూడా ఈ ఉత్తరంతోపాటు మీ సందేహ నివృత్తి కోసం పంపుతున్నాను. 2014 జూన్‌లో మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ఫిబ్రవరి 2017 వరకూ 33 నెలలు గడిచిపోయాయి.

► మీరు నిరుద్యోగులకు ఇచ్చిన మాటను గత రెండున్నరేళ్లకు పైగా వివిధ వేదికల ద్వారా పదేపదే గుర్తు చేస్తూనే ఉన్నాం. ప్రజలకు మీరు ఇచ్చి, తప్పిన వాగ్దానాల విషయంలో వారికి కలిగిన కష్టనష్టాలు కొండంత ఉంటే మీకు చీమకుట్టినట్లు కూడా అనిపించడం లేదని అర్థమైంది. నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాన్ని మీకు గుర్తు చేస్తే ఏమన్నా స్పందన ఉంటుందేమోనన్న అభిప్రాయంతో ఈ లేఖ రాస్తున్నాను. ఈ 33 నెలల కాలంలో నిరుద్యోగులకు మీరు పడిన బకాయి ఇంటింటికీ ఇప్పటికే రూ.66 వేల మేరకు ఉంది. ఆ బకాయిని వెంటనే చెల్లించడంతో పాటుగా రాష్ట్రంలోని మొత్తం 1 కోటి 75 లక్షల ఇళ్ల వారికి కుల, మత, ప్రాంత, పార్టీ భేదాలకు అతీతంగా నిరుద్యోగ భృతి చెల్లించండి. 33 నెలలుగా 1 కోటి 75 లక్షల ఇళ్లకు రూ.2,000 మేరకు మీరు చెల్లించాల్సిన బకాయి రూ.1.15 లక్షల కోట్ల మేరకు ఉంది. మీరు ఇస్తానన్న నిరుద్యోగ భృతిలో గానీ, ఇళ్ల సంఖ్యలో గానీ కోతలు పెట్టకుండా భృతి ఇవ్వండి. కోటయ్య కమిటీని అడ్డు పెట్టుకుని రైతులకు అన్యాయం చేసినట్లుగా... జన్మభూమి కమిటీలు అనే రాజ్యాంగేతర ముఠాల ద్వారా పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఇతర సంక్షేమ పథకాల్లో అన్యాయం చేసిన విధంగా కాకుండా సాచ్యురేషన్‌(సంతృప్తికర స్థాయిలో) పద్ధతిలో ప్రతి ఇంటికీ నెలకు రూ.2,000 నిరుద్యోగ భృతిని చెల్లించండి. రాష్ట్రంలో, దేశంలో గత కొన్నేళ్లుగా పారిశ్రామిక, ఐటీ రంగాల్లో, ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. మీరు చెబుతున్న పెట్టుబడులు, మీరు తీసుకొచ్చామంటున్న ఉద్యోగాలు కేవలం మిథ్య. అవి మీకు తప్ప ప్రజలకు ఎవరికీ కనిపించని దేవతా వస్త్రాల మాదిరిగా తయారయ్యాయి. దానికి తోడు లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించే ప్రత్యేక హోదాను దగ్గరుండి మరీ మీరే అడ్డుకుంటున్నారు.

► 2017–18 బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్న ఈ తరుణంలో, రాష్ట్రంలోని ప్రతి ఇంటా నిరాశలో ఉన్న యువతకు మీరు ఇచ్చిన వాగ్దానం మేరకు గత 33 నెలల బకాయితోపాటు, రూ.2,000 మేరకు ప్రతి ఒక్కరికీ ఇక మీదట నెలనెలా చెల్లించేలా వెంటనే ప్రకటన చేయండి. ఈ బడ్జెట్‌లోనే ఇందుకు సంబంధించి నిధులు కేటాయించండి.
► తీవ్ర నిరుద్యోగం, నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఏ సమాజానికీ మంచివి కాదు. ఉపాధి లభించక ప్రజలు భారీ సంఖ్యలో వేరు రాష్ట్రాలకు వలస పోతున్న పరిస్థితి రాష్ట్రమంతటా కనిపిస్తోంది. ఈ లేఖలో గొంతెమ్మ కోర్కెలు లేవు. మీరు ఇచ్చిన మాటనే మీరు మూడేళ్లుగా మరచిపోవడం వల్ల ఈ ఉత్తరం రాస్తున్నాను. మీరు మరచిపోయిన మరికొన్ని ప్రధాన వాగ్దానాలు, ఆ వాగ్దానాల మేరకు మీరు ప్రజలకు ఏ మేరకు బకాయి పడిందీ గుర్తు చేయడానికి మరో లేఖ రాస్తాను.
► ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం మేరకు నిరుద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాన్ని బకాయిలతోసహా 2017–18 బడ్జెట్‌లో కేటాయించాలని కోరుకుంటున్నాను. లేని పక్షంలో మా తదుపరి కార్యాచరణను ప్రకటిస్తాం....
    అభినందనలతో....
        వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement