బాబు వచ్చారు.. జాబు పోతోంది
యర్రగొండపాలెం: ఇంటికో ఉద్యోగం ఇస్తామని తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మాట తప్పుతున్నారని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. స్థానిక రోడ్లు, భవనాలశాఖ అతిథి గృహం ఆవరణలో శుక్రవారం నిర్వహించిన యర్రగొండపాలెం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సమావేశానికి ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు అధ్యక్షత వహించారు. వైవీ మాట్లాడుతూ అధికారంలోకి బాబు వచ్చారు.. జాబ్ పోతోందన్న ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారన్నారు. రేషన్‌షాపు డీలర్లు, జాతీయ ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శరైతులు, కాంట్రాక్ట్ బేసిక్‌పై పనిచేస్తున్న చిరుద్యోగులపై టీడీపీ నాయకులు వేటు వేయడానికి సిద్ధమయ్యారని అన్నారు. రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 40 రోజులైనా కమిటీలు వేసి సంతకాలతోనే సరిపెట్టుకుంటున్నారని విమర్శించారు.
రైతు రుణమాఫీతోపాటు డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఆ ఊసేఎత్తడం లేదన్నారు. రైతుల రుణాలను మాఫీ చేస్తామని తమ మేనిఫెస్టోలో పెడితే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని రాజకీయ నిపుణులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లారన్నారు. ఆచరణలో సాధ్యంకానీ వాగ్దానాలు చేసి ప్రజలను మోసగించడం సరైన చర్యకాదని, 2004లో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే తన తొలిసంతకం ఉచిత విద్యుత్‌పై పెట్టారని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారన్నారు. అటువంటి నేతను ఆదర్శంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్లాలని, తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడం సరైన చర్య కాదన్న ఉద్దేశంతో జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పేర్కొనలేదన్నారు. దురదృష్టవశాత్తు ఆచరణలో సాధ్యంకానీ వాగ్దానాలను ప్రజలు నమ్మి మోసపోయారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో తాము ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామని చెప్పారు.
కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కృషి
పశ్చిమ ప్రకాశంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తానన్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని మంచినీటి పథకాలను ఆరు నెలల్లో మరమ్మతులు చేయిస్తామన్నారు. గ్రామాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల దాడులు ఎక్కువయ్యాయని, ఈ దాడులను ఆపకుంటే తాము ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎనలేని కృషి చేశారని వారికి వైవీ ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో కనీస మౌలిక వసతులు లేవని, ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిపెట్టి అభివృద్ధి పరచాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కోరారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పశ్చిమ ప్రాంతానికి ఇచ్చిన వరం వెలిగొండ ప్రాజెక్టు అని, ఆ ప్రాజెక్టు నిధులు విడుదల కాకపోవడం వలన పనులు సక్రమంగా జరగడం లేదన్నారు. ఈ విషయంపై తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే అసెంబ్లీలో చర్చించానని చెప్పారు. అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షం ఉందని టీడీపీ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నిస్తున్న తీరు వారికి ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, బాబు నిజస్వరూపం బయటపడి ప్రజలు ఛీత్కరించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి భార్య టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారని, ఆమెను ఆడపడుచు కింద గౌరవిద్దామన్నారు. ఆమె భర్త ఒక ఉద్యోగి అయిఉండి సాటి ఉద్యోగులను ఫోను చేసి బెదిరిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కేవీ రమణారెడ్డి, రాష్ట్ర నాయకుడు వై వెంకటేశ్వరరావు, మార్కెట్‌యార్డు చైర్మన్ కోట్లా సుబ్బారెడ్డి, వైస్ చైర్మన్ కంచర్ల వీరయ్య, యర్రగొండపాలెం, పెద్దదోర్నాల జెడ్పీటీసీ సభ్యులు ఎం మంత్రూనాయక్, అమిరెడ్డి రామిరెడ్డి, శ్రీశైలం దేవస్థానం కమిటీ సభ్యులు ఇమ్మడిశెట్టి వెంకటసుబ్బారావు, కేంద్ర సెన్సార్ కమిటీ సభ్యులు కందూరి గురుప్రసాద్, కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు గూడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.