గ్రేటర్ అభివృద్ధి వైఎస్ చలవే..
పరామర్శ యాత్రలో షర్మిల
వైఎస్ హయాంలోనే జీహెచ్‌ఎంసీ ఆవిర్భావం
గ్రేటర్‌ని గ్రేట్‌గా చేసి చూపించారు
ఔటర్ రింగురోడ్డు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు,
పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, మెట్రోరైలు.. ఇలా ఎన్నో చేశారు
ఐటీలోనూ వైఎస్సే మేటి
తొలిరోజు ఎనిమిది కుటుంబాలకు పరామర్శ
సాక్షి, హైదరాబాద్: ‘‘హైదరాబాద్ స్థాయిని పెంచింది వైఎస్సార్.. ఔటర్ రింగ్‌రోడ్డు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే, మెట్రోరైలుకు పచ్చజెండా.. ఇలా నగరాభివృద్ధి కోసం ఎన్నో చేశారు. గ్రేటర్‌ని గ్రేట్‌గా చేసి చూపించారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఉద్ఘాటించారు. హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధి పెంచుతూ నగర శివార్లలోని మున్సిపాలిటీలు, గ్రామాలను విలీనం చేస్తూ జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేశారని చెప్పారు. దీంతో మహానగరాన్ని ఆనుకుని ఉన్న పల్లెలు సైతం అభివృద్ధి పట్టాలెక్కాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని చెప్పారు.
వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను కలుసుకునేందుకు షర్మిల మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ లో పరామర్శ యాత్ర చేపట్టారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల మీదుగా 80 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో షర్మిల ఎనిమిది కుటుంబాలను పరామర్శించారు. ఇంట్లో పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు ధైర్యం చెప్పారు. ‘మీ కోసం మేమున్నాం..’ అంటూ భరోసానిచ్చారు. జగనన్న అందరికీ బాసటగా నిలుస్తాడని చెప్పారు. షర్మిల వెళ్లిన ప్రతిచోట ప్రజలు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. షాపూర్‌నగర్ చౌరస్తాలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రపంచంలోనే మేటిగా..
ప్రపంచంలోనే హైదరాబాద్‌ను గొప్ప మహానగరంగా తీర్చిదిద్దాలని వైఎస్ కలలు కన్నారని షర్మిల చెప్పారు. అందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా 8 లేన్లతో 160 కి.మీ. ఔటర్‌రింగ్ రోడ్డు వేశారన్నారు. ‘‘ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే పూర్తి చేశారు. మెట్రోరైలుకు పచ్చజెండా ఊపారు. వైఎస్ బతికి ఉంటే దాన్ని వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభించేవారు. వైఎస్ హయాంలోనే నగరంలో నీటి సరఫరా పరిస్థితి దశాదిశ మారింది. నగరానికి కృష్ణా, గోదావరి జలాలు తీసువచ్చారు’’ అని అన్నారు. మహానగర ప్రజలకు కావాల్సిన అన్నింటినీ వైఎస్సార్ సమకూర్చితే.. కొందరు మాత్రం అంతా తామే చేశామంటారని షర్మిల విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఏపీలో ఐటీ ఎగుమతులు 2 శాతంగా ఉంటే.. వైఎస్సార్ హయాంలో ఐటీ ఎగుమతులు 9 నుంచి 14 శాతం పెరిగాయన్నారు.
వైఎస్ పథకాలను బతికించుకోవాలి
దేశంలో అన్ని రాష్ట్రాలు 46 లక్షల పక్కా గృహాలు నిర్మిస్తే మన రాష్ట్రంలో వైఎస్సార్ ఒక్కరే 46 లక్షలు కట్టించారని పేర్కొన్నారు. ఆయన బతికి ఉంటే ప్రతి పేదవాడికి రాజీవ్ గృహకల్ప ద్వారా ఇళ్లు దక్కేవన్నారు. సీఎం పదవి చేపట్టగానే వైఎస్ కనీవినీ ఎరుగని రీతిలో పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. మహిళలకు పావలా వడ్డీ, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుపేద రోగులకు ఆరోగ్యశ్రీ, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు 108 పథకాలను ప్రవేశపెట్టారన్నారు. పేదవాడిని భుజాలపై ఎత్తుకున్నారని, రైతును రాజును చేశారని, అందుకే రాజశేఖర్‌రెడ్డి రాజన్న అయ్యారని గుర్తుచేశారు. వైఎస్సార్ పథకాలను బతికించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు.
ఆప్యాయంగా పలకరిస్తూ...
వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను షర్మిల ఆప్యాయంగా పలకరించారు. తొలుత శేరిలింగంపల్లి పరిధిలోని తారానగర్‌లో దిగంబరరావు కుటుం బాన్ని పరామర్శించారు. అక్కడ్నుంచి ఆల్వి న్ కాలనీలోని సన్నిధి క్రిష్ణ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబీకులతో మాట్లాడారు. త ర్వాత కూకట్‌పల్లి రామాలయం సమీపంలో టీకే రణతేజ, ముసాపేట్‌లో నోముల రాజ య్య, కుత్బుల్లాపూర్‌లో సీహెచ్ వెంకటరామరాజు, షాపూర్‌నగర్ ఎన్‌ఎల్‌బీనగర్‌కు చెందిన దామా నాగేశ్వర్‌రావు, దూలపల్లిలో సుర కంటి రమేశ్, మౌలాలిలోని ఉల్ఫత్‌నగర్‌లో అబ్దుల్ రెహ్మాన్ కుటుంబాలను పరామర్శించారు.
పరామర్శ యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేశ్ రెడ్డి, పార్టీ నాయకులు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, నల్లా సూర్యప్రకాశ్, జి.ధనలక్ష్మి, బీష్వ రవీందర్, ఎన్.షర్మిల సంపత్, జయశ్రీ, విష్ణుప్రియ, ఎం.వరలక్ష్మి, బనగాని రఘురామిరెడ్డి, జె.అమర్‌నాథ్ రెడ్డి, బి.సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.