
సంక్షేమానికి చిరునామా వైఎస్సార్
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమానికి, సామాజిక మార్పునకు చిరునామాగా నిలిచారని, అందుకే నేటికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రాన్ని 18 మంది ముఖ్యమంత్రులు పాలించారని, వారెవరికీ సాధ్యంకాని రీతిలో.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అని కొనియాడారు. వైఎస్ వర్ధంతి రోజును ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు సంకల్పదినంగా పాటించాలని పిలుపునిచ్చారు.
అపర బ్రహ్మ.. వైఎస్సార్..
మొండి రోగాలకు గురై ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు వైఎస్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని సూర్యప్రకాశ్ గుర్తు చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో వైద్యం అందించేందుకు 104, 108 అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించి లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన అపర బ్రహ్మ వైఎస్ అని కొనియాడారు. దేశంలో దళితులు, పేదల కోసం కేంద్ర ప్రభుత్వాలు 49 లక్షల గృహాలు నిర్మిస్తే, తన హయాంలో ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 48 లక్షల కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మించి పేదలకు గూడు కల్పించారని గుర్తు చేశారు.
రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను ఇవ్వడమే కాక సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించి.. వారు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించిన రైతు పక్షపాతి వైఎస్ అని చెప్పారు. భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తలపెట్టి, సుమారు 80 శాతం ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి అపర భగీరధుడిగా వెలుగొందుతున్నారన్నారు.
టెన్త్, ఇంటర్‌తో చదువు ఆపేసే పరిస్థితుల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలాది మంది ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పించడంతో పాటు ఇంజనీర్లు, డాక్టర్లు కావడానికి అవకాశం కల్పించిన విద్యాప్రదాత రాజశేఖరరెడ్డి అని శ్లాఘించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొనసాగించడంలో తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు. మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించే శక్తిసామర్థ్యాలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే ఉన్నాయని తెలిపారు.