
వ్యవసాయం సంక్షోభంలో ఉంటే ప్రగల్భాలా?
వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగం గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత సంక్షోభంలో కూరుకుపోయి ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌కు వెళ్లి ఇక్కడ వ్యవసాయం గొప్పగా ఉందని ప్రగల్భాలు పలకడం దారుణమని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 42.5 లక్షల హెక్టార్లలో పంటలు సాగయితే అందులో 16.5 నుంచి 17 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తారని తెలిపారు. అలాంటిది ఈ ఏడాది 2 ల క్షల హెక్టార్లలో నీరు లేక సాగు చేయలేదని, మరో 2 లక్షల హెక్టార్లలో పంట ఎండిపోయి పాక్షిక దిగుబడులు వచ్చాయని, ఇంకో 2 లక్షల హెక్టార్లలో పంట తుఫాను వల్ల దెబ్బతిన్నదని పేర్కొన్నారు.
సాగునీటి సరఫరాలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పంటల సాగులేక రైతులు, వ్యవసాయ కార్మికులు వలసవెళ్తున్నారని నాగిరెడ్డి వివరించారు. రాష్ట్రంలో ఇంత దారుణంగా ఉంటే బ్రహ్మాండంగా ఉందని దావోస్‌లో ముఖ్యమంత్రి ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పటికైనా తన ఆలోచనా విధానాన్ని మార్చుకుని రైతులను ఆదుకునేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.