స్పీకర్ కోడెలపై అవిశ్వాస తీర్మానం
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం స్పీకర్ కోడెల శివప్రసాద్పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా, పక్షపాతపూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సభలో కనీసం మైక్ కూడా ఇవ్వనందుకు నిరసనగా స్పీకర్పై వైఎస్ఆర్ సీపీ అవిశ్వాస తీర్మాన అస్త్రాన్ని ప్రయోగించింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం 11.00కు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి సత్యనారాయణను కలిసి అవిశాస తీర్మానం నోటీసు అందచేశారు. వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీని కలిశారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన నోటీసును పరిశీలిస్తామని అసెంబ్లీ సెక్రటరీ తెలిపారు.
కాగా గతంలోనూ వైఎస్ఆర్ సీపీ ...స్పీకర్పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. అయితే స్పీకర్ తన వ్యవహారశైలి మార్చుకుంటారని భావించి.. కొందరు పెద్దల సూచనతో అప్పట్లో అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అయినా శీతాకాల సమావేశాల్లో స్పీకర్ వ్యవహరిస్తున్న తీరు శోచనీయంగా ఉండటంతో పాటు అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ఆర్ సీపీ ఈ అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చింది.