రాజ్‌భవన్‌ను ‘రాజీ’ భవన్‌గా మార్చొద్దు
- వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ
- అక్కడేం జరుగుతోందో అధికారికంగా వెల్లడించాలి
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ఉండే చోటైన రాజ్‌భవన్‌ను ‘రాజీ’ భవన్‌గా మార్చొద్దని, ఆ వ్యవస్థపై ఉన్న గౌరవాన్ని, పవిత్రతను కాపాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అసలు రాజ్‌భవన్‌లో ఏం జరుగుతోందో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని, అధికార ప్రకటన ద్వారా ఆ విషయాలను బహిర్గతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇంకా ఆయనేమన్నారంటే... ‘‘ఓటుకు కోట్లు’’ కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేసి నెల రోజుల్లోపు నివేదిక సమర్పించాలని తెలంగాణ ఏసీబీని, ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి సమావేశమయ్యారు.
బయటకు వచ్చిన సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పదిసార్లు ఫోన్లు చేసినట్లు, ప్రత్యేక హోదాపైనా, విభజన చట్టంలోని హామీల అమలుపైనా చర్చించినట్లు వెల్లడించారు. ఈ సమావేశం తరువాత హుటాహుటిన ఢిల్లీ నుంచి బుధవారం నేరుగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసిన సుజనా అక్కడ కూడా మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా గురించి చర్చించడానికే వచ్చానని చెప్పారు. ఎవరి చెవిలో పూలు పెడదామని ఇలా మాట్లాడుతున్నారు? ఓటుకు కోట్లు వ్యవహారంపై మంగళవారం గవర్నర్‌తో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఏసీబీ డీజీపీ ఏ.కె.ఖాన్ చర్చించారు. అదే రోజు ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు, సుజనా చౌదరి మంతనాలు జరిపారు. సుజనా అక్కడి నుంచి వచ్చి గవర్నర్‌ను కలిశారు.
ఇదంతా చోద్యం గా ఉంది. నిజంగా ప్రత్యేక హోదా అంశమే అయితే ఢిల్లీ సమావేశం తరువాత తదుపరి చర్చల కోసం కేంద్రంలో ప్రధానితో కలవాలి గాని, హైదరాబాద్‌లో గవర్నర్‌ను కలవడానికి వస్తారా? అది కూడా చంద్రబాబును కలవకుండా ఆయనకు ఏమీ చెప్పకుండా వస్తారా? ఓటుకు కోట్లు కేసును నీరు గార్చి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చంద్రబాబును బయట పడేయడానికి తాము ప్రయత్నిస్తున్నామని.. బీజేపీ స్పష్టం చేయాలి. స్వీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మేం గతంలోనే చెప్పాం. ఇపుడది నిజమవుతోంది.
ఇది లాలూచీ కాదా?
తల్లో జేజెమ్మ దిగొచ్చినా బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబును కాపాడలేరని కేసీఆర్ చెప్పారు కదా... ఆధారాలున్నాయన్నారు కదా... రేవంత్‌రెడ్డిని ప్రాసిక్యూట్ చేయడానికి స్పీకర్ వద్ద పర్మిషన్ కూడా తీసుకున్నారు కదా మరి చంద్రబాబుపై విచారణ ఎందుకు జరపడం లేదు? తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో విచారణ జరిపించాలి.