ఓటుకు కోట్లు, నయీం కేసుల్ని సీబీఐకి అప్పగించాలి
వైఎస్సార్‌సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు, హత్యలు, అక్రమాలకు పాల్పడిన నయీం కేసు... రెండింటినీ సీబీఐ విచారణకు అప్పగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితుడైన జెరూసలేం మత్తయ్య తాజాగా ఇందులో చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపణలు చేశారని, అలాగే క్రూరమైన దారుణాలకు పాల్పడిన నయీంను పెంచిపోషించింది చంద్రబాబేనని సర్వత్రా వినిపిస్తోందని, కీలకమైన ఈ అంశాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. బాబు ముఖ్యమైన ఈ రెండంశాలపై మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. ‘‘ఆంధ్రాప్రాంతంలోని థియేటర్లన్నింటి పైనా నయీం పట్టుందని సినీ నిర్మాత ఒకరు వెల్లడించారు. తనను నయీం బెదిరిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు వద్దకెళితే ‘అతను ప్రమాదకారి సెటిల్ చేసుకో..’ అని చెప్పారంటూ వచ్చిన వార్తలకూ సమాధానమివ్వాలి’’ అని శ్రీకాంత్‌రెడ్డి కోరారు.
సింధు కష్టం చంద్రబాబు ఘనతా!
సింధు కష్టపడి, తన కృషి, పట్టుదలతో ఒలింపిక్స్‌లో వెండిపతకాన్ని గెలిస్తే ఆ ఘనతను చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రతి పన్నెండేళ్లకు పుష్కరాలు రావడం సర్వసాధారణమని, వాటినీ తానే తెచ్చానని సీఎం చెప్పుకోవడం వింతగా ఉందని శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గోదావరి, కృష్ణా పుష్కరాల పేరిట చంద్రబాబు, ఆయన పార్టీవారు కోట్లాది రూపాయలు దోచేసుకున్నారని దుయ్యబట్టారు.