హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా బోగస్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఒకేలా ఉన్నాయన్నారు. ఇది యనమల బడ్జెట్ కాదని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విజయ్ మాల్యా బడ్జెట్ లాంటిదని ఎద్దేవా చేశారు. బోగస్ అంకెలతో మోసం చేశారని అన్నారు. ఎన్నికల హామీల గురించి పట్టించుకోలేదని, రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ ప్రస్తావనే లేదన్నారు.
రుణమాఫీకి అరాకొరా నిధులు కేటాయించారని ఆయన మండిపడ్డారు. ఇక డ్వాక్రా మహిళలను పట్టించుకోలేదని, నిరుద్యోగ భృతి అని ఊదరగొట్టి, చివరకు నిధులివ్వలేదని...అలాగే గ్యాస్ సిలిండర్కు రూ.100 సబ్సిడీ ఏమైందని, అన్న క్యాంటీన్లని హడావుడి చేశారని, ఆ తర్వాత దాని ఊసే లేదన్నారు. రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటరన్నారు, అదెక్కడా అని ఎమ్మెల్యే కాకాని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు.