రోజాపై ఎందుకంత కక్ష?
♦ వైఎస్సార్‌సీపీ మహిళా ఎమ్మెల్యేలు
♦ సీఎం, మంత్రుల ‘అన్‌పార్లమెంటరీ’ కనిపించదా? అని ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: తమ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంత కక్ష ఎందుకని, ఆమెను లక్ష్యంగా చేసుకుని ఎందుకు వేధిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు. ఆమె సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు వంతెల రాజేశ్వరి, పాముల పుష్పశ్రీవాణితో కలిసి మీడియాతో మాట్లాడారు. రోజా సస్పెన్షన్ అంశం హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా తామంతా న్యాయ వ్యవస్థకు మద్దతుగా సభకు హాజరు కాలేదని, అయితే ప్రజా సమస్యలను పక్కనపెట్టి రోజా అంశానికి సంబంధించిన ప్రివిలేజెస్ కమిటీ నివేదికపై గంటల తరబడి చర్చించడం ఏమిటని ప్రశ్నించారు.
‘ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానం నోటీసిస్తే దానిపై చర్చకు కేటాయించిన సమయం 4 గంటలు, అదే స్పీకర్‌పై అవిశ్వాసం నోటీసిస్తే చర్చకు ఇచ్చిన సమయం 2 గంటలు. అలాంటిది ఈరోజు రోజా అంశంపై మాత్రం అపరిమితంగా గంటల తరబడి ఇష్టానుసారం మాట్లాడారు’ అని చెప్పారు. ‘మొత్తం దేశాన్ని, రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై చర్చ జరగాలని రోజా వాయిదా తీర్మానం నోటీసిస్తే అంగీకరించలేదు. ఈ ఉదంతంతో సబంధమున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులను కాపాడుకోవడానికి చర్చకు అనుమతినివ్వలేదు. రోజాను మాట్లాడ్డానికి కూడా అనుమతించనపుడు మేమందరం పోడియం దగ్గరకు వెళ్లి నినాదాలు చేసి నిరసన తెలిపాం. కానీ రోజా ఒక్కరినే లక్ష్యంగా చేసుకున్నారంటే చంద్రబాబుకు ఆమె అంటే ఎంత భయమో అర్థమవుతోందన్నారు. రోజా విపరీత మనస్తత్వం గల వ్యక్తి అని టీడీపీ సభ్యుడు శివాజీ సోమవారం చర్చలో పాల్గొంటూ అన్నారని.. రోజా టీడీపీలో ఉన్నపుడు ఆ మనస్తత్వం అనిపించలేదా? అని ఈశ్వరి ప్రశ్నించారు.
ఇంత రాద్ధాంతమా?:టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వ్యాఖ్యలపై పుష్పశ్రీవాణి స్పందిస్తూ.. ఆమె తమ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కనుక అన్యాయం జరుగుతున్నపుడు తప్పకుండా కాపాడుకుంటామన్నారు. హైకోర్టు తీర్పు 17న వస్తే దాన్ని అమలు చేయకుండా ఒక్క రోజా కోసమే మూడ్రోజులుగా టీడీపీ వాళ్లు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో చెప్పాలని పుష్ప డిమాండ్ చేశారు.