లండన్: ఆసియాలోని యూనివర్సిటీల ర్యాంకింగ్‌లలో భారత్ గణనీయమైన పురోగతిని సాధించింది. 2014 సంవత్సరానికి సంబంధించి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మేగజైన్ గురువారం విడుదల చేసిన టాప్ 100 యూనివర్సిటీల జాబితాలో భారత్‌లోని పది విద్యాసంస్థలకు చోటు లభించింది. 2013లో ఈ జాబితాలో కేవలం మూడింటికి మాత్రమే చోటు లభించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 10కి పెరిగింది. ఈ జాబితాలో చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీకి 32వ స్థానం లభించింది. అలాగే ఖరగ్‌పూర్‌లోని ఐఐటీకి 45, కాన్పూర్ ఐఐటీకి 55వ ర్యాంకులు వచ్చాయి. ఢిల్లీ, రూర్కీ ఐఐటీలకు సంయుక్తంగా 59వ ర్యాంకు లభించింది. గువాహటి, మద్రాస్ ఐఐటీలు 74, 76 స్థానాల్లో నిలిచాయి. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ వర్సిటీకూడా 76వ ర్యాంకు వచ్చింది. అలీగఢ్ ముస్లిం వర్సిటీకి 80, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి 90వ స్థానం దక్కింది. ఇదిలా ఉండగా 20 విద్యాసంస్థలతో జపాన్ ఈ జాబితాలో అగ్రభాగంలో ఉంది.