
11మంది భారతీయులను రక్షించిన పాక్
ఇస్లామాబాద్: ఉద్రిక్త పరిస్థితుల్లో మునిగిపోయిన యెమెన్ నుంచి తమవాళ్లతోపాటు 11మంది భారతీయులను కూడా రక్షించి తీసుకొస్తున్నామని పాకిస్థాన్ ప్రకటించింది. ఏప్రిల్ 7న కరాచీకి వారి నౌక చేరుకోనుందని తెలిపింది. పూర్తిగా అల్ కాయిదా వారి హస్తగతంలో ఉన్న యెమెన్లోని మొకల్లా అనే నగరం నుంచి తమ దేశీయులను వెనక్కి రప్పించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఓ నౌకను పంపించింది. అక్కడి వారితో చర్చలు జరిపి మొత్తం 148 మంది పాకిస్థానీయులను తమ నౌకలో ఎక్కించుకోవడమే కాకుండా మరో 35 మంది విదేశీయులకు కూడా ఆశ్రయం కల్పించింది.
ఆ 35 మందిలోనే 11 మంది భారతీయులు ఉన్నారు. యెమెన్లో రాజకీయ అస్థిరత చోటుచేసుకోవడమే కాకుండా.. నిత్యం ఘర్షణలతో అట్టుడుకోతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉంటున్న తమ దేశాలవారిని స్వదేశాలకు రప్పిస్తున్నారు. భారత్ ఇప్పటికే ఈ విషయంలో వేగంగా స్పందిస్తోంది.