
తాతలకే తాత
డాక్టర్ అలెగ్జాండర్‌కు 111 ఏళ్లు
న్యూయార్క్: ప్రపంచంలో అత్యంత పెద్ద వయసు వ్యక్తిగా అమెరికాకు చెందిన డాక్టర్ అలెగ్జాండర్ ఇమిచ్ రికార్డు సృష్టించారు. 111 ఏళ్ల ఇమిచ్ జీవించి ఉన్న వారిలో అత్యంత వృద్ధుడుగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. గతంలో ఈ రికార్డు ఇటలీ వాసి ఆర్తురో లికాటా పేరుతో ఉంది. 111 ఏళ్ల 357 రోజుల వయసులో గత నెలలో ఆయన చనిపోయారు. గతంలో రష్యాలో భాగంగా ఉన్న పోలాండ్‌లోని జెస్తోచోవాలో ఇమిచ్ 1903 ఫిబ్రవరి 4వ తేదీన జన్మించారు.
1951లో భార్య వేలాతో కలిసి అమెరికాకు వలస వచ్చారు. 1986లో ఆమె చనిపోయిన అనంతరం మన్‌హట్టన్‌లో ఒంటరిగా ఉంటున్నారు. చక్కటి ఆహార అలవాట్లు, జన్యువులే తన దీర్ఘాయుష్షు రహస్యమని ఇమిచ్ తెలిపారు. ఇప్పటివరకు ఎక్కువ సంవత్సరాలు జీవించిన రికార్డు ఫ్రాన్స్‌కు చెందిన జీన్ లూయిస్ కామెంట్ పేరుతో ఉంది. ఆయన 122 ఏళ్ల 164 రోజులు జీవించారు.