
16 ఏళ్ల బాలికపై 33 మంది..
రియో డి జెనీరో: మరి కొద్ది రోజుల్లో ఒలంపిక్స్కు ఆతిధ్యమివ్వనున్న బ్రెజిల్ నగరం రియో డి జెనీరోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దేశ రాజధానిలో జరిగిన నిర్భయ ఘటనను మించేలా తలపిస్తున్న ఈ ఘటనలో ఓ 16 ఏళ్ల బాలికపై 33 మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బ్రెజిల్ మహిళా సంఘాలు, సమాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రియోలోని ఫవేలా ప్రాంతానికి చెందిన ఓ బాలిక తన 20 ఏళ్ల బాయ్ఫ్రెండ్ను కలువడానికి వెస్టర్న్ ఫ్రింజ్లోని అతని గదికి వెళ్లింది. అయితే నమ్మిన బాయ్ఫ్రెండే ఆమె పాలిట కాలయముడిలా మారాడు. బాలికకు డ్రగ్స్ ఇచ్చిన దుండగులు 36 గంటల పాటు నిర్భందించి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో గతవారం జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు బాలిక బాయ్ఫ్రెండ్తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు.