24 గంటల్లో 19 దేశాలు..
వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా.. వీరు ముగ్గురు అది సాధించి చూపారు. 24 గంటల్లో 19 దేశాలు తిరిగొచ్చేశారు. తద్వారా ప్రపంచ రికార్డును సాధించారు. ఈ టూర్‌కు ఉన్న నిబంధనలు మూడే. ఒకటి.. ప్రతి దేశంలో కాలుమోపాలి, రెండు.. 24 గంటల వ్యవధిలో అన్ని దేశాలను తిరిగిరావాలి, మూడు.. తిరిగామన్న దానికి మీడియాపరమైన ఆధారం ఉండాలి.
ఈ రికార్డు సాధన కోసం నార్వేకు చెందిన గున్నార్ గార్‌ఫోర్స్, టే యంగ్, ఓస్టీన్‌లు సెప్టెంబర్ 22న అర్ధరాత్రి గ్రీస్ నుంచి బయలుదేరారు. వాయవ్య మార్గంలో ప్రయాణిస్తూ 24 గంటల వ్యవధిలో బల్గేరియా, మెసడోనియా, కొసోవో, సెర్బియా, క్రొయేషియా, బోస్నియా, స్లొవేనియా, ఆస్ట్రియా, హంగేరి, స్లొవాకియా, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, లీక్టన్‌స్టైన్ దేశాలు తిరిగొచ్చేశారు. వాతావరణం అనుకూలించలేదట.. లేకుంటే ఇటలీలోనూ అడుగుపెట్టేసి.. 24 గంటల్లో 20 దేశాలు తిరిగొచ్చేసేవాళ్లమని వీరు చెబుతున్నారు.
మెసడోనియా నుంచి సెర్బియాకు వెళ్లడానికి.. ఆస్ట్రియా నుంచి జర్మనీకి వెళ్లడానికి వీళ్లు విమానమెక్కారు. మిగతా ప్రయాణమంతా అద్దె కార్లలోనే సాగించారు. ఖానాపీనా అంతా కార్లలోనే.. కొన్నిసార్లు మూత్రానికి వెళ్లే టైమ్ కూడా దొరికేది కాదట. దాంతో బాటిల్స్‌లోనే కానిచ్చేసేవారట! మొత్తానికి ఏదైతేనేం.. ప్రపంచ రికార్డును(గత రికార్డు 17 దేశాలు) బద్దలుకొట్టేశారు.