
25 గ్రాముల చక్కెర చాలు!
అమెరిక : చాక్లెట్లు, కూల్‌డ్రింకులను పిల్లలు ఎడాపెడా లాగించేస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్త. ఎందుకంటే రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వయసు లోపు పిల్లలు రోజుకు 25 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటోంది అమెరికన్ హార్ట్ అసోసియేషన్. సర్క్యులేషన్ అనే జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రోజుకు ఆరు టీస్పూన్లు లేదా 25 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర తింటే పిల్లలు, యుక్తవయస్సులో ఉన్న వారికి రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశముందని, గుండెజబ్బుల బారిన పడే ప్రమాదముందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మిర్రమ్ వాస్ అంటున్నారు.
చక్కెర పదార్థాలు ఎక్కువగా తినే పిల్లలు ఆరోగ్యకరమైన పండ్లు, కాయగూరలు, హోల్ గ్రెయిన్స్ తక్కువగా తింటారని, ఇది కూడా వారి ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతుందని పేర్కొన్నారు. పిల్లలు ఎంత మేరకు చక్కెరలు తీసుకోవచ్చు అన్న అంశంపై ఇప్పటివరకూ స్పష్టత లేదని, ఫలితంగా అన్నిరకాల ఆహార పదార్థాల్లో చక్కెరలు చేరిపోతున్నాయన్నారు. అమెరికాలోని పిల్లలు ప్రతిరోజూ మూడు రెట్లు ఎక్కువ చక్కెరలు తింటున్నారని, ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న శాస్త్రీయ పరిశోధనలన్నింటినీ సమీక్షించిన తర్వాత రోజుకు 25 గ్రాములకు మించి చక్కెర తీసుకోవడం మంచిది కాదన్న అంచనాకు తాము వచ్చినట్లు తెలిపారు. అలాగే రెండేళ్ల లోపు వయసున్న పిల్లలకు చక్కెరలు ఇవ్వకపోవడమే మంచిదని సూచించారు. దీనివల్ల వారు చక్కెర రుచికి అలవాటు పడకుండా భవిష్యత్తులో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేందుకు దోహదపడుతుందని చెప్పారు.