భారత విద్యార్ధులకు అమెరికా వర్సిటీ షాక్
వాషింగ్టన్: అమెరికాలో చదువుకోసం వెళ్లిన భారత విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రోగ్రామింగ్ లో సరైన పట్టులేకపోవడంతో యూఎస్ లోని వెస్టర్న్ కెంటకీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో ఎమ్మెస్ చేయడానికి వెళ్లిన 25 మంది విద్యార్థులను వెనక్కు వెళ్లిపోవాలని లేదా వేరే ఏదైనా ఇన్ స్టిట్యూట్ లో అడ్మిషన్ కోసం ప్రయత్నించుకోవాలని వర్సిటీ కోరింది.
ఈ ఏడాది జనవరిలో 60 విద్యార్థులు కోర్సులో చేరేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 40 మంది కనీస ప్రమాణాలు అందుకోలేకపోయారని యూనివర్సిటీ చైర్మన్ జేమ్స్ గ్యారీ తెలిపారు. విద్యార్థులకు ప్రత్యామ్నాయాలను సూచించిన వాటిలో కూడా విఫలం కావడంతో వారిని వెనక్కు పంపడం తప్ప మరో దారి కనిపించలేదని వెల్లడించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధికి ఉండాల్సిన కనీస ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా వాళ్లకు లేవని ఇది తన డిపార్ట్ మెంట్ ను ఇబ్బందికి గురిచేసినట్లు వివరించారు.
యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న వాళ్లంతా అంతర్జాతీయ రిక్రూటర్ల ద్వారా స్పాట్ అడ్మిషన్ల ద్వారా తీసుకున్నవేనని చెప్పారు. ఇక నుంచి విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చే ముందు యూనివర్సిటీ నుంచి ఫ్యాకల్టీ భారత్ కు వెళ్లి విద్యార్ధుల అకడమిక్ రికార్డులను పరిశీలించిన తర్వాతే ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన కెంటకీ యూనివర్సిటీ ఇండియన్ స్టూడెంట్ అసోషియేషన్ చైర్మన్ ఆదిత్య శర్మ విద్యార్ధులను యూనివర్సిటీ నుంచి వెళ్లిపోమనడం బాధకరమైన విషయం అని అన్నారు. గ్రాడ్యుయేషన్ గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ) లేని విద్యార్ధులు డబ్బులు పోసి సీట్లు కొనుక్కున్నారని తెలిపారు. కాగా, ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు పర్యటన కోసం అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే.