3 రష్యా కాన్సులేట్ల స్వాధీనం
వాషింగ్టన్, న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో కార్యాలయాలను సీజ్ చేసిన అమెరికా
వాషింగ్టన్: అమెరికా– రష్యాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి. శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, వాషింగ్టన్‌ల్లోని రష్యా దౌత్య కార్యాలయాలను అమెరికా శనివారం స్వాధీనం చేసుకుంది. రెండు రోజుల్లో వీటిని ఖాళీ చేయాలంటూ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. గత నెలలో తమ దేశంలోని అమెరికా దౌత్య సిబ్బందిని రష్యా సగానికి పైగా తగ్గించింది. దీనికి ప్రతిగా ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దౌత్య కార్యకలాపాలకు రష్యా ఈ కార్యాలయాలను ఇకపై ఉపయోగించుకోవడానికి వీల్లేదని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
భద్రత, నిర్వహణ సహా ఈ మూడు కార్యాలయాలూ పూర్తి స్థాయిలో తమ అధీనంలోనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతి ఉంటే తప్ప వీటిల్లోకి రష్యా దౌత్యవేత్తలకు ప్రవేశం కల్పించమన్నారు. దీనిపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాళీ చేయకపోతే తమ దౌత్య కార్యాలయం తలుపులు బద్దలు కొడతామని ఎఫ్‌బీఐ హెచ్చరించిందని రష్యా ఆరోపించింది. అమెరికాది దూకుడు చర్యగా అభివర్ణించింది. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదని అమెరికా పేర్కొంది. రష్యా ఎంబసీ ప్రతినిధుల సమక్షంలో ప్రభుత్వ అధికారులు ఈ మూడు కార్యాలయాలను తనిఖీ మాత్రమే చేసినట్టు సంబంధిత అధికారి తెలిపారు.