వాషింగ్టన్: అమెరికా మిలిటరీ అకాడెమీలో ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా నిర్వహించే పిల్లో(దిండు) ఫైట్ రక్తసిక్తమైంది. ఈ ఫైట్‌లో 30 మంది సైనిక విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దృ ఢమైన వస్తు సామగ్రితో దిండ్లను నింపుకుని కొట్టుకోవడంతో దెబ్బలు గట్టిగా తగిలినట్లు అకాడెమీ అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏడాది వేసవి శిక్షణా తరగతులు ముగింపు సందర్భంగా విద్యార్థులు ఈ పిల్లో ఫైట్‌ను నిర్వహించడం ఆనవాయితీ అని వారు తెలిపారు. ఈ ఫైట్ వీడియోను యూట్యూబ్‌లోనూ పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో సైనిక విద్యార్థులు ఒకరిని ఒకరు దారుణంగా దిండ్లతో అకాడెమీ ఆవరణలో కొట్టుకుంటూ కనిపించిన దృశ్యాలు ఉన్నాయి. గాయపడిన విద్యార్థులు కొందరు ఆ ఫైట్ దృశ్యాలను ట్వీట్ కూడా చేశారు. ఘటనపై విచారణ జరుపుతామని, ఆనవాయితీగా వస్తోన్న ఈ సంప్రదాయాన్ని తాము ఆపదలచుకోలేదని, విద్యార్థులపై కూడా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవని అకాడెమీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ క్రిస్టఫర్ కాస్కర్ చెప్పారు. గాయపడిన ఒక విద్యార్థి ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నట్లు కొందరు విద్యార్థులు చెబుతుండగా అలాంటిదేమి లేదని అందరూ విధుల్లో హాజరవుతున్నట్లు కాస్కర్ వివరించారు.
పిల్లో ఫైట్‌లో 30 మందికి గాయాలు
Published Sun, Sep 6 2015 1:48 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM
Advertisement
Advertisement