
దిండుతో కొడితే ముక్కు పగిలింది!
అది యునైటెడ్ స్టేట్స్ మిలటరీ అకాడమీ.. ఒక వేసవి సాయంత్రాన శిక్షణలో ఉన్న సైనికులు ఒక్కొక్కరుగా గ్రౌండ్లోకి వచ్చారు. అందరి చేతుల్లో తెల్లగా మెరిసిపోతున్న మెత్తటి తలదిండ్లు. విజిల్ మోగింది. పిల్లో ఫైటింగ్ మొదలైంది. ఒకర్ని ఒకరు.. మరొకరిని పది మంది కలిసి ఇరగ కుమ్మేసుకున్నారు. అంతలోనే ఏదో కలకలం దిండ్ల దెబ్బలకు కొందరి ముక్కులు పగిలాయి, ఇంకొందరు నోటి నుంచి రక్తం కక్కుకున్నారు. మరికొందరైతే ఏకంగా స్పృహ తప్పి పడిపోయారు. మ్యాటర్ సీరియస్ అవుతుందని గ్రహించిన ఉన్నతాధికారులు వెంటనే అంబులెన్స్ ను పిలిపించి క్షతగాత్రులను ఆసుపత్రికి పంపారు.
న్యూయార్క్ నగరంలోని వెస్ట్ పాయింట్ ప్రాంతంలో మిలటరీ అకాడమీలో చోటుచేసుకున్న బీభత్సమింది. అకాడమీలో కొత్తగా చేరిన క్యాడెట్లకు హోమ్ సిక్నెస్ దూరమయ్యేలా ఫ్రెషర్స్ పార్టీ తరహాలో ఏటా పిల్లో ఫైట్ కార్యక్రమాన్నినిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది వేడుకల్లో మాత్రం సంబరం కాస్తా శ్రుతి మించి రక్తపాతానికి దారితీసింది. కొందరు క్యాడెట్లు ఇనుప గుండ్ల వంటి గట్టి వస్తువులను తలదిండ్లలో దాచి దాడి చేయడం వల్లే రక్తపాతం జరిగిందని అకాడమీ బాధ్యులు చెప్పారు.
ఆగస్టు 20న చోటుచుసుకున్న ఈ సంఘటనను ఇంతకాలం దాచిపెట్టిన అకాడమీ నిర్వాహకులు.. మీడియా ఒత్తిడి మేరకు చివరకు విషయాన్ని వెల్లడించారు. గాయాల నుంచి తేరుకున్న క్యాడెట్లు ప్రస్తుతం క్లాసులకు హాజరవుతున్నారని, వచ్చే ఏడాది పిల్లో ఫెస్టివల్లో ఇలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త వహిస్తామని చెబుతున్నారు.