చైనాలో భూకంపం, 8మంది మృతి
బీజింగ్ : చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్‌లో ఈ రోజు తెల్లవారుజామున సంభవించిన భూకంపంలో ఎనిమిదిమంది మృతి చెందినట్లు యూఎస్ జియలాజికల్ సర్వే వెల్లడించింది. అలాగే 11మంది గాయపడిట్లు సమాచారం. రిక్కర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.5గా నమోదు అయింది. కాగా భూమి పలుమార్లు భారీగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. భూప్రకంపనల ధాటికి పలు భవనాలు నేలకొరిగాయి. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది భవనాల శిథిలాలను తొలగిస్తున్నారు.
శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భూ ఉపరితలానికి 8 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని.. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.4గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఆరుగంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. తజికిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని మారుమూల ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.