
వరుణుడు ఆ కుటుంబాన్ని మింగేశాడు!
పెషావార్: పాకిస్తాన్‌లోని పెషావర్లో కురిసిన భారీవర్షం ఓ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షం కారణంగా ఇల్లు నవాజ్ కల్లాయ్ గిరిజన ప్రాంతంలో ఓ ఇల్లు కూలిపోయింది. పాక్‌లోని మాలాకంద్ జిల్లా క్వాయిద్ అబాద్ ప్రాంతం కైబర్ పక్తుంక్వా ప్రాంతంలో ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కుటుంబంలోని నలుగురు మహిళలు సహా ఐదుగురు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న రిస్క్యూం టీం, స్థానికులు హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకుని ఐదుగురి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇటీవల పాకిస్తాన్‌లో కురిసిన కుండపోత వర్షాల ధాటికి 60మందికి పైగా దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు.