Torrential rains
-
బిపర్జోయ్ పంజా రాజస్తాన్‌పై
జైపూర్/భుజ్: గుజరాత్ తీరప్రాంత జిల్లాలను అతలాకుతలం చేసిన బిపర్జోయ్ తుపాను పక్కనే ఉన్న రాజస్తాన్‌పై ప్రతాపం చూపుతోంది. తుపాను దెబ్బకు గుజరాత్‌ను ఆనుకుని ఉన్న రాజస్తాన్ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. మౌంట్ అబూలో 210 మిల్లీమీటర్లు, సెడ్వాలో 136 మిల్లీమీటర్లు.. ఇలా తదితర ప్రాంతాల్లో తెరిపినివ్వకుండా వర్షం పడుతోంది. ఎడతెగని వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ బార్మెర్, జలోర్, సిరోహి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. పాలీ, జోధ్‌పూర్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. త్వరలోనే రాష్ట్రంలో తుపాను మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే సోమవారం దాకా వర్షాలు ఆగవని వారు వెల్లడించారు. ఓవైపు వర్షాలు పడుతున్నా మరోవైపు రాష్ట్రంలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ధోల్పూర్ ప్రాంతంలో 41.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తుపాను కారణంగా నార్త్ వెస్టర్న్ రైల్వే జోన్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. జఖౌలో షా పర్యటన, పరామర్శ.. సొంత రాష్ట్రం గుజరాత్లో తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. ఏరియల్ సర్వే చేశారు. సహాయక కార్యక్రమాలు జరిగిన ప్రాంతాల్లో పనుల్లో నిమగ్నమైన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అభినందించారు. జఖౌ, మండ్వీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాధితులను పరామర్శించారు. భుజ్‌లో సమీక్షా సమావేశంలో పాల్గొని తాజా పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెల్సుకున్నారు. తుపాను బీభత్సం నుంచి నెమ్మదిగా గుజరాత్‌లోని కఛ్ జిల్లా పట్టణాలు, గ్రామాలు కోలుకుంటున్నాయి. వరద నీరు నివాసాలు, రహదారులను వదలడంతో వ్యాపారాలు, దుకాణాలు తెరుచుకున్నాయి. గురువారం సాయంత్రం జఖౌ పోర్టులో తీరాన్ని తాకిన తుపాను భీకర రూపం దాల్చి కుండపోత వర్షాలతో ముంచెత్తడం తెల్సిందే. త్వరలో అది వాయుగుండం మారి బలహీనమవనుందని అధికారుల తెలిపారు. శనివారం సైతం బనస్కాంతా జిల్లా, పటాన్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పటాన్, మెహ్సానా, కఛ్ జిల్లాల్లోని కొన్ని చోట్ల ఆదివారం సైతం భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వెల్లడించారు. గాంధీనగర్, అహ్మదాబాద్, సురేంద్రనగర్, మోర్బీ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు. -
కొండచరియలు విరిగిపడి 21 మంది మృతి
బటంగ్ కలి: మలేసియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది గల్లంతయ్యారు. సెలంగోర్ రాష్ట్రం బటంగ్ కలి పట్టణ సమీపంలోని ఓ ఫార్మ్‌హౌస్‌లో గురువారం అర్ధరాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. ఫార్మ్‌హౌస్‌లోని మూడెకరాల్లో 90 మంది పర్యాటకులున్న క్యాంప్ సైట్‌ను 100 అడుగుల ఎత్తైన రోడ్డు నుంచి బురద, రాళ్లతో కూడిన మట్టి ఒక్కసారిగా ముంచెత్తింది. గాఢ నిద్రలో ఉన్న 21 మంది బురద మట్టి కింద సజీవ సమాధి కాగా, 12 మంది జాడ తెలియకుండా పోయారు. రోడ్డు పక్కన ఉన్న ఓ ఫార్మ్‌హౌస్‌ను క్యాంప్ సౌకర్యాల కోసం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. క్యాంప్ వెనకాల ఉన్న కొండ సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ నరోజమ్ ఖామిస్ తెలిపారు. ఏడాది క్రితం భారీ వర్షాల కారణంగా సుమారు 21వేల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఇదీ చదవండి: కొండచరియలు విరిగిపడి 50 మంది గల్లంతు -
కొండచరియలు విరిగిపడి 50 మంది గల్లంతు
కౌలాలంపూర్: మలేసియా రాజధాని కౌలాలంపూర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. 50 మందికిపైగా ఆచూకీ గల్లంతైంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కౌలాలంపూర్‌కు సమీపంలోని సెలాంగోర్ రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. రోడ్డు పక్కన ఉన్న ఓ ఫామ్‌హౌజ్‌ను క్యాంప్ సౌకర్యాల కోసం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కార్మికులు, అధికారులు క్యాంపులో నిద్రపోతున్న సమయంలో కొండచరియలు విరిగిపడినట్లు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో మొత్తం 79 మంది క్యాంప్‌లో ఉండగా అందులో 23 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు మరణించారు. 51 మంది ఆచూకీ గల్లంతయ్యారు. క్యాంప్ వెనకాల ఉన్న కొండ సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ నరోజమ్ ఖామిస్ తెలిపారు. సుమారు ఒక ఎకరం విస్తీర్ణంలో క్యాంప్‌పై కొండచరియలు పడినట్లు చెప్పారు. ఏడాది క్రితం భారీ వర్షాల కారణంగా సుమారు 21వేల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఇదీ చదవండి: గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ పైనుంచి దూకి భారత సంతతి బాలుడు ఆత్మహత్య -
బస్సును కమ్మేసిన బురద.. 34 మంది సజీవ సమాధి
బొగోటా: భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి అమెరికాలోని కొలంబియాలో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడడంతో రహదారిపై వెళ్తున్న ఓ బస్సును పూర్తిగా ముంచేసింది బురద. మరో రెండు వాహనాలు సైతం పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. రిసరాల్డా జిల్లాలోని ప్లూబో రికో నగరంలో ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. భారీగా బురద ఉప్పొంగటంతో రహదారి రెండుగా చీలిపోయింది. భారీగా ట్రీఫిక్ జామ్ ఏర్పడింది. రెండు మీటర్ల లోతులో బురదలో కూరుకుపోయిన బస్సులో మొత్తం 33 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బురద కమ్మేయడంతో ఓ కారులోని ఆరుగురు, ద్విచక్రవాహనంపై ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. సుమారు 70 మంది రెస్క్యూ సిబ్బంది 24 గంటల పాటు శ్రమించి మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో. ‘బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారికి ప్రభుత్వ తరపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది.’ అని పేర్కొన్నారు. A #landslide engulfed a #bus in #Colombia on Sunday afternoon, leaving at least 34 people dead and several injured. The bus and 3 other vehicles were traveling on the highway near Pueblo Rico, #Risaralda when they were surprised by the #avalanche. #viralvdoz pic.twitter.com/ePahStfzo1 — ViralVdoz (@viralvdoz) December 6, 2022 ఇదీ చదవండి: మనిషి మెదడులో చిప్.. న్యూరాలింక్ ప్రయోగాలపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ -
హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. కుండపోతగా పడుతున్న వర్షానికి చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచి.. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా పంజాగుట్ట నుంచి సికింద్రబాద్, ఖైరతాబాద్ నుంచి ఎర్రగడ్డ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యధికంగా మదాపూర్‌లో 7.9 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్‌లో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమైన క్రమంలో జీహెచ్ఎంసీ డిజాస్టర్ టీమ్స్ రంగంలోకి దిగాయి. -
హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. కిలోమీటర్లమేర నిలిచిన ట్రాఫిక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షంతో నగరంలో కిలోమీటర్లమేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక వాకర్స్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. రోడ్డుపై నడవాలంటేనే జంకుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతవరణశాఖ వెల్లడించింది. కూకట్పల్లి వై జంక్షన్ చెరువును తలపిస్తోంది. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. మెట్రో పక్కన పార్క్ చేసిన బైక్‌లు నీటిలో మునిగాయి. ఫతేనగర్ స్టేషన్ దగ్గర భారీగా వరద నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. 5 అడుగులకు పైగా వరద నీరు చేరడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఫతేనగర్ మీదుగా వెళ్లే వాహనాలు ఇతర మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ సిబ్బంది సూచించారు. అమీర్‌పేట్ నుంచి కూకట్పల్లి వెళ్లే వాహనాలు నిలిపివేశారు. చదవండి: తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ మెట్రో ఇబ్బందులు భారీ వర్ష ప్రభావం మెట్రో స్టేషన్లను కూడా తాకింది. మెట్రో స్టేషన్లలో సర్వర్ ప్రాబ్లమ్ తలెత్తింది. టికెట్లు ఇష్యూ కాకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీంతో అరగంట నుంచి మెట్రో స్టేషన్లలో భారీ క్యూలైన్లు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి ముందస్తు సమాచారం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
వామ్మో! ఇదేం వాన.. గ్రేటర్లో కుండపోత రికార్డు ఇప్పుడే
సాక్షి, హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో గ్రేటర్ సిటీని కుండపోత వాన ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఆకాశానికి చిల్లు పడిందన్న చందంగా 20 సెంటీమీటర్లకు పైగా కుంభవృష్టి కురిసింది. నాలాలు ఉగ్రరూపం దాల్చాయి. పలు చెరువులు పూర్తి స్థాయిలో నిండి వరదనీరు పొంగిపొర్లి సమీప బస్తీలు, కాలనీలను ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. వందలాది బస్తీల్లో ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు పలు బస్తీల వాసులు రాత్రంతా జాగారం చేశారు. ఈ సీజన్లో జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు నమోదైన అతి భారీ వర్షం ఇదేనని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడం, ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో పాటు క్యుములోనింబస్, స్ట్రాటస్ మేఘాల ప్రభావంతో నగరంలో పలు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. వరద నీటిలో ఉప్పల్ స్వరూపానగర్ పలు మండలాల్లో సాధారణం కంటే అత్యధికం.. జీహెచ్ఎంసీ పరిధితో పాటు పొరుగునే ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలో పలు మండలాల్లో జూన్ ఒకటి నుంచి జూలై 15 వరకు సాధారణం కంటే 70 నుంచి 90 శాతానికి పైగా అధిక వర్షపాతం నమోదవడం విశేషం. అత్యధికంగా తిరుమలగిరిలో 106 శాతం, ముషీరాబాద్‌లో 131 శాతం, కాప్రాలో ఏకంగా 153 శాతం, ఉప్పల్‌లో 173 శాతం, సరూర్‌నగర్‌లో 148 శాతం అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. గ్రేటర్లో కుండపోత రికార్డు ఇప్పుడే.. గ్రేటర్ పరిధిలో జూలై నెలలో అధిక వర్షపాతం నమోదవడం పరిపాటే. ఇక ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నగరంలో 24 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైన రికార్డులు గతంలో ఉన్నాయి. కానీ నగర వాతావరణ శాఖ రికార్డులను పరిశీలిస్తే జూలై నెలలో అధిక వర్షపాతం నమోదైంది మాత్రం.. జూలై 15, 2021 కావడం విశేషం. పలు చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనప్పటికీ.. సరాసరిన నగరంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు జూలై మాసంలో 1989 జూలై 24న మాత్రమే నగరంలో 14.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాజాగా పాత రికార్డులు బద్దలయ్యాయి. బాలాపూర్‌లో జలమయమైన ఆర్సీఐ రోడ్డు నగరాన్ని వణికించిన భారీ వర్షం బుధవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు భీతిల్లాయి. రాత్రి 8 గంటల నుంచి వేకువజాము వరకు ఏకధాటిగా కురిసిన కుండపోతతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. గత ఏడాది వరదల్ని గుర్తు తెచ్చుకుని వణికిపోయారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తెల్లారే లోపల ఏం జరగనుందోనని ఆందోళన చెందారు. గ్రేటర్ పరిధిలోని వంద కాలనీలకు పైగా ప్రజలు వాన భయంతో సరిగా నిద్రపోలేదు. మలక్‌పేట నియోజకవర్గంలోని ఎర్రగుంట, మీర్‌పేట, జిల్లెలగూడ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలో అంజయ్యనగర్ పూర్తిగా నీట మునిగింది. అయిదడుగుల మేర నీరు ఇంకా నిలిచే ఉంది. పద్మా కాలనీ, అచ్చయ్యనగర్, శ్రీరాంనగర్ బస్తీ తదితర ప్రాంతాల్లోనూ భారీగా నీటి నిల్వలు చేరాయి. బిక్కుబిక్కుమంటూ గడిపిన కాలనీలు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పద్మావతి కాలనీ, రాఘవేంద్ర కాలనీ, పీవీఆర్ కాలనీ, అయ్యప్పకాలనీ, సాగర్ ఎన్క్లేవ్, రెడ్డి కాలనీ, కోదండరామ కాలనీ, అయ్యప్పనగర్, మల్లికార్జున నగర్ తదితర కాలనీల్లో నీట మునిగాయి. ఉప్పల్ నియోజకవర్గంలోని శివసాయినగర్, మధురానగర్ కాలనీ, న్యూభవానీనగర్, ఇందిరానగర్, రాఘవేంద్రకాలనీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్లోని ఎన్ఎండీసీ కాలనీ, సరస్వతీనగర్ తదితర కాలనీలు నీట మునిగాయి. సనత్‌నగర్ నియోజకవర్గంలోని నాలా పరీవాహక ప్రాంతాల్లోని బ్రాహ్మణవాడి, అల్లంతోట బావి, తదితర ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని చింతలబస్తీ, మక్తా, ఇందిరానగర్‌లతోపాటు సోమాజిగూడ, ఫిల్మ్‌నగర్ ప్రాంతాల్లో వర్ష ప్రభావం కనిపించింది. నదీం కాలనీలో దాదాపు ఇరవై ఇళ్లలో వరద నీరు చేరింది. ఆనంద్‌బాగ్‌లో నీట మునిగిన కాలనీ తెగిపడిన కరెంట్ వైర్లు, ట్రిప్ అయిన ఫీడర్లు సాక్షి, హైదరాబాద్: ఈదురుగాలితో కూడిన భారీ వర్షానికి నగరంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడి వైర్లు తెగి పోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, మరికొన్ని చోట్ల ఇన్సులేటర్లు, ఏబీ స్విచ్‌లు, జంపర్లు, సీటీ/పీటీలో సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా బుధవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు గ్రేటర్లో 500పైగా ఫీడర్లు ట్రిప్పయ్యాయి. కొన్నిచోట్ల రెండు మూడు గంటల్లోనే విద్యుత్‌ను పునరుద్ధరించగా.. మరికొన్ని ప్రాంతాలు అంధకారంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంటి సామగ్రితో సురక్షిత ప్రాంతానికి తరలివెళ్తున్న హయత్‌నగర్ పద్మావతి కాలనీవాసులు విద్యుత్‌కు అంతరాయం దిల్సుఖ్నగర్, సరూర్‌నగర్, హయత్ నగర్, హస్తినాపురం, వందనపురి కాలనీ, సాగర్‌ఎన్‌క్లేవ్, రాఘవేంద్రనగర్, రెడ్డికాలనీ, కోదండరామ్‌కాలనీ, నాగోల్‌లోని అయ్యప్పనగర్, ఉప్పల్ స్వరూప్‌నగర్, మీర్పేట్ సాయినగర్ కాలనీ, మిథులానగర్ కాలనీ, జల్పల్లి, ఉస్మాన్‌నగర్, ఎర్రగుంట, జిల్లెలగూడ, అడిక్‌మెట్ డివిజన్లోని అంజయ్యనగర్, ముషీరాబాద్‌లోని పద్మాకాలనీ, అచ్చయ్య కాలనీ, శ్రీరాంనగర్‌బస్తీ, నాచారం ఎర్రకుంట, క్రి్రస్టియన్ కాలనీ, హరిహరపురం కాలనీలకు వరద పోటెత్తడంతో ఆయా ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు ఇంటి చుట్టూ నీరు.. ఇటు కరెంట్ కోత.. కొన్ని చోట్ల రెండు మూడు గంటల్లోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తే.. మరికొన్ని చోట్ల గురువారం రాత్రి పొద్దు పోయిన తర్వాత కూడా కరెంట్ సరఫరా కాలేదు. అసలే ఇంటి చుట్లు మోకాల్లోతు మురుగునీరు...ఆపై ఇంట్లో కరెంట్ కూడా లేక ప్యాన్లు పనిచేయక పోవడంతో దోమలు విజృంభించాయి. విని యోగదారుల కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఫలితంగా కొంత మంది ఇళ్లకు తాళాలు వేసుకుని బంధువుల ఇళ్లకు చేరుకోగా...మరికొంత మంది చీక ట్లోనే మగ్గిపోవాల్సి వచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులు క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బందికి ఫోన్ చేస్తే నంబర్లు స్విచ్ ఆఫ్ చేసి ఉంచడంతో వారు కొంత అసహనానికి గురయ్యారు. విధిలేని పరిస్థితుల్లో 1912 కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తే.. రోజంతా లైన్లు బిజీగా ఉన్నట్లు సమాధానమే వచ్చింది. ఆన్లైన్లో ఫిర్యాదులు చేసినా.. అధికారులు స్పందించలేదు. అంతే.. వానొస్తే చింతే.. సాక్షి, సిటీబ్యూరో: ఈ చిత్రం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని దీనదయాళ్నగర్ నాలా పనులకు సంబంధించినది. ఈ నాలాలో పడి గత సంవత్సరం సెపె్టంబర్లో సుమేధ (12) అనే బాలిక మరణించింది. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ రెండు మీటర్లలోపు ఓపెన్ నాలాలకు క్యాపింగ్ చేస్తామన్నారు. ఎక్కువ వెడల్పు నాలాలకూ అవసరమైన చర్యలు చేపడతామన్నారు. వర్షాకాలం రాకముందే మే మాసాంతానికి పనులు పూర్తి కావాల్సి ఉండగా, ప్రారంభమే కాలేదు. గత ఏడాది దుర్ఘటనను కొందరు గుర్తు చేయడంతో.. ఇటీవలే హడావుడిగా ప్రారంభించారు. పైకప్పులను పరుస్తున్నారు. ఈ నాలాకు సంబంధించి దీనదయాళ్నగర్ కమ్యూనిటీ హాల్ దగ్గరి నుంచి సంతోషిమాత గుడి వరకు 720 మీటర్ల మేర పనులకు బాక్స్ డ్రైనేజీ సహా రూ.2.40 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. పై ఫొటోల్లో కనిపిస్తున్నవే జరుగుతున్న పనులు. వర్షాలు దంచికొడుతున్నాయి. సీజన్ ముగిసేంత దాకా పనులయ్యే అవకాశం లేదు. ఇదే సర్కిల్ పరిధిలోని కాకతీయనగర్ నుంచి దీనదయాళ్నగర్ కమ్యూనిటీ హాల్ వరకు రూ. 45 లక్షలతో పనుల్ని కూడా ఇటీవలే చేపట్టారు. పరిసరాల్లోని రేణుకానగర్– కాకతీయనగర్ వరకు రూ. 1.40 కోట్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు.బండమైసమ్మ గుడి నుంచి దీనదయాళ్నగర్ వరకు 400 మీటర్ల మేర రూ. 19 లక్షల విలువైన పనులు మాత్రం పూర్తిచేశారు. బండ చెరువు నుంచి అనంత సరస్వతి కమాన్ వర కు రూ.66 లక్షల అంచనా పనుల టెండర్లు కూడా పూర్తికాలేదు.ఇదీ నాలాల పనులకు సంబంధించి ఉదాహరణ. అన్ని సర్కిళ్లలో అన్ని నాలాల పనులు కూడా దాదాపుగా ఇలాగే కుంటుతున్నాయి. చెరువుల పనులను పరిశీలిస్తే.. గత సంవత్సరమే దిల్సుఖ్నగర్ తపోవన్ కాలనీ రోడ్‌నెంబర్ 6 నుంచి సరూర్‌నగర్ చెరువులోకి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో స్కూటీతో ఉన్న ఒకరిని కాపాడబోయి ఓ వ్యక్తి మరణించిన ఘటన నగర ప్రజలింకా మరిచిపోలేదు. చెరువు వరద ముంపు సమస్య కంటే సుందర పనులకు ప్రాధాన్యం ఇచి్చన అధికారులు మట్టి కట్ట వేయడంతో చెరువులోకి నీరు పోకుండా కాలనీల్లో కాలనీల్లో నీరు నిలిచిపోయింది. కర్మన్‌ఘాట్, సరూర్‌నగర్ ప్రధాన రహదారి నుంచి చెరువు ఔట్ లెట్లో కలిపే తపోవన్ కాలనీలో పనులను చేయకుండా సగంలో ఆపేశారు. పరిసర కొన్ని కాలనీల నుంచి జనప్రియ కాలనీ వరకు నాలా పనులు పూర్తి చేసినప్పటికీ, అక్కడి నుంచి సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్ ప్రధాన రహదారి వరకు సుమారు 400 మీటర్ల పనులు ఇప్పటికీ ప్రారంభానికే నోచుకోలేదు. వీటితో పాటు పలు కాలనీల్లో పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాలేదు. దీంతో నీరు చెరువులోకి వెళ్లకుండా నీళ్లలో కాలనీల దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. -
చైనా ఛిన్నాభిన్నం!
-
చైనా ఛిన్నాభిన్నం!
భారీ వర్షాలు, వరదలతో 200మందికిపైగా మృతి ఎడతెగకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలు, భారీ వరదలు చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. తాజా వర్ష బీభత్సంలో చైనాలో 200మందికిపైగా మృతిచెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. అయినా వర్షాలు ఆగకపోవడంతో వాయవ్య చైనాలోని షాన్గ్జి ప్రావిన్స్‌లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఇక షాన్గ్జీ ప్రావిన్స్ రాజధాని గ్జియాన్‌లో పరిస్థితి భీకరంగా మారింది. భారీ వర్షాలతో నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వేలాది వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. రోడ్లపై మోకాళ్లలోతు నీళ్లు చేరడంతో ప్రజలు తమ వాహనాలను రోడ్డుమీద వదిలిపెట్టి కాలినడకన ఇంటిబాట పట్టారు. గత సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలు ఆగకపోవడంతో వరదలు వెల్లువెత్తాయి. వరదలకు తోడు కొండచరియలు విరిగిపడి.. ఇళ్లపై పడుతుండటంతో మరణాలు సంభవిస్తున్నాయి. ఉత్తర ప్రావిన్స్ హెబీలో అత్యధికంగా మరణాలు సంభవించాయి. ఇక్కడ వరదలు, వర్షాల వల్ల 114 మంది చనిపోగా, 111మంది గల్లంతయ్యారు. వర్షాలు, వరదలు వెల్లువెత్తి నదులు ప్రమాదస్ధాయిని దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో రిజర్వాయర్ సమీప ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరదముప్పు పొంచి ఉన్నా తమను సురక్షిత ప్రాంతాలకు తరలించకపోవడంపై పలు గ్రామాల వాసులు రోడ్లపై ఆందోళన చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యంలో అల్లాడుతున్న తమకు సాయం, పునరావాసం అందించడంలో ప్రభుత్వ అధికారులు విఫలమవుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. -
‘నీటి ఇంజెక్షన్’తో తీరును ఇక్కట్లు!
మారిన వాతావరణ పరిస్థితుల్లో వర్షం కురిసే రోజులు తగ్గిపోవడమే కాకుండా తుపాన్ల వల్ల లేదా అకాలంగా వచ్చే కుండపోత వర్షాల సంఖ్య పెరుగుతోంది. కుండపోత వర్షాల సమయంలో ఆ నీటిని చప్పున భూగర్భంలోకి ఇంకింప జేసుకుంటే.. తదనంతరం కొన్ని నెలల పాటు సాగు నీటి కొరత ఉండదని నిపుణులు చెబుతున్నారు. పొలాల్లో వాలుకు అడ్డంగా ఖండిత కందకాలు (మీటరు లోతు, మీటరు వెడల్పు, 25 మీటర్ల పొడవు) తవ్వుకుంటే అదాటుగా పెద్ద వర్షాలు పడినప్పుడు కూడా వాన నీటిని పొలం నుంచి బయటకు పోకుండా చాలా వరకు భూమిలోకి ఇంకేలా చేయవచ్చని మనకు తెలుసు. నీటి వాలులో ఉన్న బోర్ల చుట్టూ ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకుంటే వాన నీటిని కొంతమేరకు ఇంకింపజేసుకోవచ్చనీ మనకు తెలుసు... అయినా, అదాటుగా వచ్చే కుండపోత వర్షాల నీరు ఎక్కువ శాతం పొలాల బయటకు కొట్టుకుపోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా కొట్టుకుపోయిన వాన నీరు పొలాల పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నీటి మడుగులు ఏర్పడుతుంటాయి. అలా నీటి మడుగులోకి చేరిన నీటిని భూమిలోకి ఇంకింపజేసే (ఇంజెక్ట్ చేసే) ఏర్పాట్లు చేసుకుంటే.. రెండు పంటలకూ నీటి కొరతే ఉండదని బిప్లవ్ కేతన్ పాల్ చెబుతున్నారు. గుజరాత్‌కు చెందిన పాల్ ఏడెనిమిదేళ్ల క్రితం ఇందుకు ఉపకరించే ఒక పద్ధతిని ఆవిష్కరించారు. దీనికి ‘భుంగ్రు’ అని పేరు పెట్టారు. గుజరాతీ భాషలో దీని అర్థం ‘నీటిని పీల్చుకునే గొట్టం’ అని అర్థం. అతి చిన్న కమతాలున్న ఐదుగురు మహిళా రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి.. బృందానికి ఒకటి చొప్పున ప్రభుత్వ ఆర్థిక సాయంతో వందలాది భుంగ్రులను నెలకొల్పారు. మడుగుల్లోకి చేరే వాన నీటిని లేదా వరద నీటిని పీవీసీ గొట్టం ద్వారా భూమికి తాపి (ఇంజెక్ట్ చేసి).. కరువు కాలంలో ఆ నీటిని మోటారు ద్వారా తోడుకొని నిక్షేపంగా రెండు పంటలు పండించుకొని అధిక నికరాదాయం పొందవచ్చని రుజువు చేశారు. ఒక్కో భుంగ్రు 15 ఎకరాలకు రెండు పంటలకు నీరందిస్తుంది. 18 వేలకు పైగా చిన్న కుటుంబాలు వీటి ద్వారా ఆహార భద్రతను సాధించి పేదరికాన్ని జయించాయని ఆయన చెబుతున్నారు. పొలాల్లో భూమి పైపొర వాన నీటిని ఇంకింపజేసుకోలేనంత గట్టిగా మారిన భూముల్లో కుండపోత వానలు లేదా వరదలు వచ్చినప్పుడు ఈ పద్ధతి ద్వారా నీటిని భూమిలోకి ‘ఇంజెక్ట్’ చేసుకోవడం ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. భూమి చౌడు బారి, భూమి లోపలి పొరల్లో ఇసుక పాళ్లు ఎక్కువగా ఉన్న భూముల్లో కూడా ఈ పద్ధతిలో వాన నీటిని ఇంకింపజేసుకోవడం ప్రయోజనకరమని అంటున్నారు. భూమి అడుగు పొరల్లో ఉప్పు నీరు ఉన్నప్పటికీ.. పైపొర ఇసుక భూమిలో స్వచ్ఛమైన వాన నీరు నిల్వ ఉంటుందని, మోటారు ద్వారా ఈ నీటిని తోడినప్పుడు ఈ మంచినీరే అందుబాటులోకి వస్తుందని, ఆ విధంగా పంటలకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. తీర ప్రాంతాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ యే ప్రాంతాలకు నీటి ఇంజెక్షన్ పద్ధతి ఎంతవరకూ ఉపయోగమో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నిపుణులు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. వివరాలకు.. ‘భుంగ్రు’ ఆవిష్కర్త బిప్లవ్ కేతన్ పాల్‌ను 0091 98255 06900 లేదా ఛజీఞ్చఛజుఞఃజఝ్చజీ.ఛిౌఝ ద్వారా సంప్రదించవచ్చు. - సాగుబడి డెస్క్ -
వరుణుడు ఆ కుటుంబాన్ని మింగేశాడు!
పెషావార్: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో కురిసిన భారీవర్షం ఓ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షం కారణంగా ఇల్లు నవాజ్ కల్లాయ్ గిరిజన ప్రాంతంలో ఓ ఇల్లు కూలిపోయింది. పాక్‌లోని మాలాకంద్ జిల్లా క్వాయిద్ అబాద్ ప్రాంతం కైబర్ పక్తుంక్వా ప్రాంతంలో ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కుటుంబంలోని నలుగురు మహిళలు సహా ఐదుగురు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న రిస్క్యూం టీం, స్థానికులు హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకుని ఐదుగురి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇటీవల పాకిస్తాన్లో కురిసిన కుండపోత వర్షాల ధాటికి 60మందికి పైగా దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. -
జపాన్‌లో వర్షబీభత్సం: 36 మంది మృతి
టోక్యో: కుండపోత వర్షాలతో జపాన్ పశ్చిమ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో హిరోషిమా ప్రాంతంలో కనీసం 36మంది మరణించారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడటంతో హిరోషిమా శివార్లలో పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయని, వరదలా ప్రవహించిన బురద ఇళ్లను చుట్టుముట్టిందని అధికారులు తెలిపారు. -
ఎడతెరిపిలేని వర్షాలతో భారీ నష్టం
రాయచూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఇటీవల ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాల కారణంగా భారీగా నష్టం వాటిల్లిందని, దీంతో సహాయ పనుల కోసం జిల్లా యంత్రాంగానికి తాత్కాలికంగా రూ.50 లక్షలు విడుదల చేశామని జిల్లా ఇన్చార్జ్, రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ శరణ ప్రకాష్ పాటిల్ తెలిపారు. ఆయన శుక్రవారం తాలూకాలోని జే.మల్లాపురంలో విలేకరులతో మాట్లాడారు. ఎడతెగని వర్షాల వల్ల జిల్లాలో రూ.17 కోట్ల మేర నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశామన్నారు. ఎంత మేర నష్టం జరిగిందని అధికారులు అధ్యయనం చేస్తున్నారన్నారు. సంబంధిత అధికారుల నుంచి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందుతుందన్నారు. జిల్లా పంచాయతీకి సంబంధించి రూ.8.15 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. వర్షాల వల్ల జిల్లాలో 104 ఇళ్లు కూలిపోయినట్లు సమాచారం ఉందన్నారు. ఈ విషయంలో కూడా మరింతగా అధ్యయనం జరుగుతోందన్నారు. పూర్తి వివరాలు అందిన వెంటనే బాధితులకు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ చేపడుతామన్నారు. వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా రోడ్లన్ని దెబ్బతిన్నాయని, త్వరలో మరమ్మతు పనులు చేపడతామన్నారు. రాజీవ్‌గాంధీ గృహ వసతి సంస్థ అధికారులతో చర్చించి కూలిన ఇళ్లకు పరిహారం అందించడంపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. వర్షాల వల్ల ఎక్కువ నష్టం జరగకుండా సకాలంలో చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి సూచిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రతాప్‌గౌడ పాటిల్, జెడ్పీ ఉపాధ్యక్షుడు శరణప్ప, ఏసీ మంజుశ్రీ, కాంగ్రెస్ అధ్యక్షుడు వసంతకుమార్, కాంగ్రెస్ ప్రముఖులు శివమూర్తి, శాంతప్ప, అమరేగౌడ, తాయణ్ణ నాయక్ పాల్గొన్నారు.