మండ్విలోని ఆస్పత్రిలో తుపాను బాధితులను పరామర్శిస్తున్న అమిత్ షా, సీఎం పటేల్
జైపూర్/భుజ్: గుజరాత్ తీరప్రాంత జిల్లాలను అతలాకుతలం చేసిన బిపర్‌జోయ్ తుపాను పక్కనే ఉన్న రాజస్తాన్‌పై ప్రతాపం చూపుతోంది. తుపాను దెబ్బకు గుజరాత్‌ను ఆనుకుని ఉన్న రాజస్తాన్ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. మౌంట్ అబూలో 210 మిల్లీమీటర్లు, సెడ్వాలో 136 మిల్లీమీటర్లు.. ఇలా తదితర ప్రాంతాల్లో తెరిపినివ్వకుండా వర్షం పడుతోంది. ఎడతెగని వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ బార్మెర్, జలోర్, సిరోహి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
పాలీ, జోధ్‌పూర్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. త్వరలోనే రాష్ట్రంలో తుపాను మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే సోమవారం దాకా వర్షాలు ఆగవని వారు వెల్లడించారు. ఓవైపు వర్షాలు పడుతున్నా మరోవైపు రాష్ట్రంలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ధోల్పూర్ ప్రాంతంలో 41.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తుపాను కారణంగా నార్త్ వెస్టర్న్ రైల్వే జోన్‌లో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది.
జఖౌలో షా పర్యటన, పరామర్శ..
సొంత రాష్ట్రం గుజరాత్‌లో తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. ఏరియల్ సర్వే చేశారు. సహాయక కార్యక్రమాలు జరిగిన ప్రాంతాల్లో పనుల్లో నిమగ్నమైన ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అభినందించారు. జఖౌ, మండ్వీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాధితులను పరామర్శించారు. భుజ్‌లో సమీక్షా సమావేశంలో పాల్గొని తాజా పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెల్సుకున్నారు. తుపాను బీభత్సం నుంచి నెమ్మదిగా గుజరాత్‌లోని కఛ్ జిల్లా పట్టణాలు, గ్రామాలు కోలుకుంటున్నాయి.
వరద నీరు నివాసాలు, రహదారులను వదలడంతో వ్యాపారాలు, దుకాణాలు తెరుచుకున్నాయి. గురువారం సాయంత్రం జఖౌ పోర్టులో తీరాన్ని తాకిన తుపాను భీకర రూపం దాల్చి కుండపోత వర్షాలతో ముంచెత్తడం తెల్సిందే. త్వరలో అది వాయుగుండం మారి బలహీనమవనుందని అధికారుల తెలిపారు. శనివారం సైతం బనస్కాంతా జిల్లా, పటాన్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పటాన్, మెహ్‌సానా, కఛ్ జిల్లాల్లోని కొన్ని చోట్ల ఆదివారం సైతం భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వెల్లడించారు. గాంధీనగర్, అహ్మదాబాద్, సురేంద్రనగర్, మోర్బీ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment