బలహీనపడిన బిపర్‌జోయ్‌.. గుజరాత్‌ నుంచి రాజస్తాన్‌ వైపు పయనం | Cyclone Biparjoy Brings Heavy Rain In Rajasthan, Red Alert | Sakshi
Sakshi News home page

Cyclone Biparjoy: బలహీనపడిన బిపర్‌జోయ్‌.. గుజరాత్‌ నుంచి రాజస్తాన్‌ వైపు పయనం

Published Sat, Jun 17 2023 5:52 AM | Last Updated on Sat, Jun 17 2023 9:50 AM

Cyclone Biparjoy Brings Heavy Rain In Rajasthan, Red Alert - Sakshi

జైపూర్‌/అహ్మదాబాద్‌/న్యూఢిల్లీ: గుజరాత్‌ తీర ప్రాంతాన్ని వణికించిన బిపర్‌జోయ్‌ తుపాను బలహీనపడింది. ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ పొరుగు రాష్ట్రమైన రాజస్తాన్‌ వైపు మళ్లిందని అధికారులు వెల్లడించారు. తుఫాను ప్రభావం వల్ల రాజస్తాన్‌లోని జలోర్, బార్మర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. గురువారం సాయంత్రం దాదాపు 70 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ ప్రకటించింది. జలోర్‌లో శుక్రవారం ఉదయానికల్లా 69 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలియజేసింది.

రెండు జిల్లాల్లో 200 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జోథ్‌పూర్, జైసల్మేర్, పాలీ, సిరోహీ వైపు తుపాను పయనిస్తోందని, అక్కడ సైతం భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. శుక్రవారం, శనివారం రాజ్‌సమంద్, దుంగార్పూర్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముందుజాగ్రత్త చర్యగా రాజస్తాన్‌ ప్రభుత్వం జైపూర్, కోట, భరత్‌పూర్, ఉదయ్‌పూర్, అజ్మీర్, జోద్‌పూర్, బికనేర్‌ తదితర ప్రాంతాలకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించింది. అజ్మీర్‌ జిల్లాలోని కిషన్‌గఢ్‌కు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం చేరుకుంది.   
చదవండి: తుపాన్లు తలొంచుతున్నాయ్‌..! వారం రోజుల ముందే హెచ్చరికలతో..

గుజరాత్‌లో ప్రాణ నష్టం సున్నా  
గుజరాత్‌లో బిపర్‌జోయ్‌ తుఫాను వల్ల ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఎన్డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌ కార్వాల్‌ శుక్రవారం చెప్పారు. వివిధ ప్రాంతాల్లో 23 మంది గాయపడ్డారని, దాదాపు 1,000 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాను ఇంకా పునరుద్ధరించలేదని ప్రకటించారు. గుజరాత్‌లో తుపాను కంటే ముందే ఇద్దరు చనిపోయారని వెల్లడించారు. తుపాను హెచ్చరికలపై ప్రభుత్వ యంత్రాంగం వేగంగా స్పందించి, చేపట్టిన చర్యల వల్లే ప్రాణనష్టం సంభవించలేదని అన్నారు. కచ్‌ ప్రాంతంలో 40 శాతం గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. 500 ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. పక్కా ఇళ్లకు పెద్దగా నష్టం వాటిల్లలేదన్నారు. 800 చెట్లు కూలిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, ఇందుకోసం గుజరాత్‌ ఎస్‌డీఆర్‌ఎఫ్‌తో కలిసి పని చేస్తున్నామని వివరించారు. రహదారుల వ్యవస్థకు నష్టం జరగలేదన్నారు. సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ యథాతథంగా పని చేస్తోందన్నారు.   

విద్యుత్‌ పునరుద్ధరణకు చర్యలు  
గుజరాత్‌లో 8 జిల్లాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు 1,000కి పైగా బృందాలను రంగంలోకి దించినట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కచ్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్, మోర్బీ, జునాగఢ్, గిర్‌ సోమనాథ్, రాజ్‌కోట్, పోర్‌బందర్‌ తదితర జిల్లాల్లో తుపాను వల్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ముందస్తు చర్యలు చేపట్టడం, లక్ష మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ చెప్పారు. తుపాను సహాయక చర్యల్లో సహకారం అందించిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.   

707 మంది శిశువుల జననం  
గుజరాత్‌లో మంగళవారం సాయంత్రం నుంచి తుపాను కల్లోలం మొదలైంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంతంలోని 8 జిల్లాల్లో 1,171 మంది గర్భిణులు ఉండగా, వీరిలో 1,152 మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. గత నాలుగు రోజుల్లో వీరిలో 707 మంది గర్భిణులకు వివిధ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో సురక్షితంగా ప్రసవం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. 707 మంది శిశువులు జన్మించారని పేర్కొంది.   

► బిపర్‌జోయ్‌ అత్యంత తీవ్ర నుంచి తీవ్ర తుపానుగా బలహీనపడింది. రాజస్తాన్‌లోకి ప్రవేశించింది.   
► తుపాను ధాటికి గుజరాత్‌లోని కచ్‌–సౌరాష్ట్ర ప్రాంతంలో గురువారం సాయంత్రం నాటికి 5,120 విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. 4,600 గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఇప్పటిదాకా 3,580 గ్రామాలకు సరఫరా పునరుద్ధరించారు. మరో 1,000కిపైగా గ్రామాలకు పునరుద్ధరించాల్సి ఉంది.  
► దాదాపు 800 చెట్లు నేలమట్టమయ్యాయి. ఫలితంగా పలు రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.  
► గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.  
► ప్రజలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు ప్రాణనష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగాన్ని గుజరాత్‌ ప్రభుత్వం అభినందించింది.  
► ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌కు ఫోన్‌ చేసి పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, అటవీ జంతువుల రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.  
► ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలకు స్వచ్ఛంద సంస్థలు, మీడి యా సంస్థలు కూడా సహకారం అందించాయి.  
► మరో 3 రోజులపాటు 23 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.  
► సీఎం భూపేంద్ర పటేల్‌ తరచుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు.  
► పాకిస్తాన్‌లోనూ తీర ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. దక్షిణ సింధూ ప్రావిన్స్‌ నుంచి 82,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement