భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి–కొత్తగూడెం మధ్య కిన్నెరసాని బ్రిడ్జిపై నుంచి వరద ఉధృతి
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో విస్తారంగా వానలు పడతాయని వాతావరణశాఖ ప్రకటించింది. పలుచోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రానికి రెండు రోజులపాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని.. దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. వర్షాలకు తోడు పలుచోట్ల గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రకటించింది.
కరకగూడెంలో 22.7 సెంటీమీటర్ల భారీ వాన
బుధవారం రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 2.26 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. బుధవారం రాత్రి 10 గంటల సమయానికి అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో 29.2 సెంటీమీటర్ల భారీ వాన పడింది. రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో 15 సెంటీమీటర్లకుపైగా, మరో 35 చోట్ల 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ లెక్కలు చెప్తున్నాయి.
నైరుతి సీజన్‌కు సంబంధించి జూలై 26 నాటికి రాష్ట్రంలో 32.2 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. ఈసారి 43.25 సెంటీమీటర్లు కురిసింది. అంటే సాధారణంతో పోలిస్తే.. 34శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 5 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 24 జిల్లాల్లో అధిక వర్షపాతం, 4 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలంలోని కటాక్షపూర్ చెరువు పొంగడంతో మునిగిన జాతీయ రహదారి
హైదరాబాద్‌లో భారీ వర్షం..
రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బుధవారం పొద్దున్నుంచి ముసురు వాన కురవగా రాత్రి భారీ వర్షం పడింది. నగరంలోని టోలిచౌకిలో 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో రెండు నుంచి మూడు సెంటీమీటర్ల మేర వాన పడింది. దీంతో డ్రైనేజీలు, మ్యాన్‌హోల్స్ పొంగాయి. ప్రధాన రోడ్లపై నీరు చేరి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఎగువ నుంచి వరద పెరగడంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ తీర ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.
గోదావరిఖనిలో వరద నీటి ప్రవాహం
జిల్లాల్లో దంచికొట్టిన వాన
► కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో మంగళవారం రాత్రి నుంచీ వానలు దంచి కొడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు పరవళ్లు తొక్కుతుంది. సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోనరావుపేట మండలం మామిడిపల్లి, వట్టిమల్ల గ్రామాల వద్ద రెండు చోట్ల కాజ్‌వేలు కొట్టుకుపోయాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌లోని చాలా కాలనీలు జలమయం అయ్యాయి.
► ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగ, ప్రాణహిత, గోదావరి, కడెం ప్రాజెక్టుల్లో భారీగా వరద చేరుతోంది. పెన్‌గంగ, ప్రాణహిత తీరాల్లోని పొలాలు నీటిలో మునిగాయి. పలుచోట్ల చెరువులు, సాగు నీటి కాలువలకు గండ్లు పడ్డాయి. మంచిర్యాలలో రోడ్లపై మోకాళ్ల లోతుకు చేరింది. జిల్లా ఆస్పత్రిలోని వార్డుల్లోకీ వరద ప్రవేశించింది.
► నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ మండలంలో పంటలు నీట మునిగాయి. దీనితో పాటు కామారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న చిన్న ప్రాజెక్టులు, చెరువులన్నీ నిండి అలుగు పోస్తున్నాయి.
► ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా బుధవారం భారీ వర్షం కురిసింది. ఆత్మకూర్ మండలంలోని కటాక్షపూర్ చెరువు మత్తడి దూకుతుండటంతో.. దిగువన ఉన్న 163 నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరకాల చలివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లాలోని రామప్ప జలాశయం, లక్నవరం చెరువు నిండిపోయాయి. కొంగాల వాగు, మర్రిమాగు వాగు, బొమ్మనపల్లి, గుండ్ల వాగు, ఇసుక వాగు ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరంగల్ నగరంలోని ఎన్టీఆర్ నగర్, సంతోషిమాతకాలనీ, భద్రకాళి నగర్, గాయత్రినగర్, సాయినగర్ కాలనీలు నీట మునిగాయి. నర్సంపేటలో ఎనీ్టఆర్ నగర్, సర్వాపురం కాలనీలు నీట మునిగాయి.
► ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం అతి భారీ వర్షాలు కురిశాయి. పాలేరు రిజర్వాయర్ అలుగు పోస్తోంది. వైరా రిజర్వాయర్, లంకాసాగర్ ప్రాజెక్టు, బేతుపల్లి చెరువు, జాలిముడి ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు నిండిపోయింది. పలుచోట్ల వాగులు, చెరువులు ఉప్పొంగి రోడ్లపైకి రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
► ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిధిలోని చాలా ప్రాంతాల్లో బుధవారం మోస్తరు వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో మండలంలో సముద్రం చెరువు, వీరుల చెరువు, మోటకొండూర్ చెరువులు అలుగు పోస్తున్నాయి. ఆత్మకూరు మండలంలోని బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భూదాన్‌పోచంపల్లి మండలంలోని జూలూరు–రుద్రవెల్లి మధ్య ఉన్న లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ నది ప్రవహిస్తోంది.
గంధమల్లలో వర్షానికి రెండు ఇళ్లు కూలిపోయాయి. సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు, పాత చిలుకూరు మధ్య బ్రిడ్జిపై వరద ప్రవహిస్తోంది. బేతవోలు రోడ్డులోని పొలాల్లో ఇసుక మేటలు వేసింది. జాజిరెడ్డిగూడెం మండలంలో తిమ్మాపురం– సంగెం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment