-
భారీ వర్షాలు, వరదలతో 200మందికిపైగా మృతి
ఎడతెగకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలు, భారీ వరదలు చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. తాజా వర్ష బీభత్సంలో చైనాలో 200మందికిపైగా మృతిచెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. అయినా వర్షాలు ఆగకపోవడంతో వాయవ్య చైనాలోని షాన్‌గ్జి ప్రావిన్స్‌లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది.
ఇక షాన్‌గ్జీ ప్రావిన్స్ రాజధాని గ్జియాన్‌లో పరిస్థితి భీకరంగా మారింది. భారీ వర్షాలతో నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వేలాది వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. రోడ్లపై మోకాళ్లలోతు నీళ్లు చేరడంతో ప్రజలు తమ వాహనాలను రోడ్డుమీద వదిలిపెట్టి కాలినడకన ఇంటిబాట పట్టారు.
గత సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలు ఆగకపోవడంతో వరదలు వెల్లువెత్తాయి. వరదలకు తోడు కొండచరియలు విరిగిపడి.. ఇళ్లపై పడుతుండటంతో మరణాలు సంభవిస్తున్నాయి. ఉత్తర ప్రావిన్స్ హెబీలో అత్యధికంగా మరణాలు సంభవించాయి. ఇక్కడ వరదలు, వర్షాల వల్ల 114 మంది చనిపోగా, 111మంది గల్లంతయ్యారు. వర్షాలు, వరదలు వెల్లువెత్తి నదులు ప్రమాదస్ధాయిని దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో రిజర్వాయర్ సమీప ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరదముప్పు పొంచి ఉన్నా తమను సురక్షిత ప్రాంతాలకు తరలించకపోవడంపై పలు గ్రామాల వాసులు రోడ్లపై ఆందోళన చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యంలో అల్లాడుతున్న తమకు సాయం, పునరావాసం అందించడంలో ప్రభుత్వ అధికారులు విఫలమవుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.