
ఇటీవలి కాలంలో చైనాను తరచూ ప్రకృతి విపత్తులు చుట్టుముడుతున్నాయి. ఈమధ్యనే వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల కారణంగా దేశంలోని పలు నగరాలు నీట మునిగాయి. ఇప్పుడు వరదల కారణంగా ఆహార సంక్షోభం కూడా అంతకంతకూ పెరుగుతోంది. పొలాల్లోకి వరద నీరు చేరింది. పంటలన్నీ నాశనమయ్యాయి.
కొత్త పంటలు వేసేందుకు అవకాశం లేకుండా పోయింది. గత కొన్ని నెలలుగా చైనా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న చైనాలోని ఈశాన్య ప్రాంతం వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యింది. తుఫాను కారణంగా సంభవించిన వరదలకు లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. 30 మంది మరణించారు. ఈ మరణాలు బీజింగ్, దాని పక్కనే ఉన్న హెబీ ప్రావిన్స్‌లో సంభవించాయి.
ఆహార సంక్షోభం దిశగా..
హీలాంగ్‌జియాంగ్, జిలిన్, లియోనింగ్.. ఇవి చైనాకు ఈశాన్య ప్రాంతంలోని మూడు ప్రావిన్సులు. వీటిని చైనా ధాన్యాగారం అని పిలుస్తారు. ఈ మూడు ప్రావిన్సుల్లోనూ సాగు భూమి చాలా సారవంతమైనది. దేశంలోని ఆహార ధాన్యాలలో ఎక్కువ భాగం ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. సోయాబీన్స్, మొక్కజొన్న, వరి మొదలైనవి ఈ మూడు ప్రాంతాలలో ఎక్కువగా సాగవుతాయి. అయితే వర్షాల కారణంగా ఈ మూడు ప్రావిన్స్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో దేశంలో ఆహార సంక్షోభం సంభవించవచ్చనే చర్చలు జరుగుతున్నాయి.
ధ్వంసమైన పంటపొలాలు
హీలాంగ్‌జియాంగ్‌లో వరదల కారణంగా వరి పొలాలు పూర్తిగా నాశనమయ్యాయి. కూరగాయల ఉత్పత్తి కూడా పూర్తిగా నిలిచిపోయింది. హీలాంగ్‌జియాంగ్ రాజధాని హర్బిన్‌లో భారీ వర్షాలకు 90 వేల హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. హర్బిన్‌కు ఆనుకుని ఉన్న షాంగ్‌జీ నగరంలో 42,575 హెక్టార్లలో పంటలు పూర్తిగా నీట మునిగాయి.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం
వర్షాలు, వరదల కారణంగా దేశంలో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్నదని చైనా వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గోధుమల దిగుబడి కూడా తగ్గింది. వరి పొలాలు నాశనమయ్యాయి. గత ఏడాది తీవ్రమైన ఎండలకు పంటలు నాశనం కాగా ఈ ఏడాది వరదలు విధ్వంసం సృష్టించాయి. ఫలితంగా ఆహార ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: 20 ఏళ్లపాటు వారానికో ఫొటో.. వయసొచ్చాక.. ‘సొగసు చూడతరమా’
Comments
Please login to add a commentAdd a comment