Heavy Rains In Hyderabad Leave Several Colonies Waterlogged - Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో ఎడతెరిపి లేకుండా కుండపోత

Published Fri, Jul 16 2021 7:37 AM | Last Updated on Fri, Jul 16 2021 10:57 AM

Heavy Rain Lashes Hyderabad, Leave Several Colonies Waterlogged - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో గ్రేటర్‌ సిటీని కుండపోత వాన ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఆకాశానికి చిల్లు పడిందన్న చందంగా 20 సెంటీమీటర్లకు పైగా కుంభవృష్టి కురిసింది. నాలాలు ఉగ్రరూపం దాల్చాయి. పలు చెరువులు పూర్తి స్థాయిలో నిండి వరదనీరు పొంగిపొర్లి సమీప బస్తీలు, కాలనీలను ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి.

వందలాది బస్తీల్లో ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు పలు బస్తీల వాసులు రాత్రంతా జాగారం చేశారు. ఈ సీజన్‌లో జూన్‌ ఒకటి నుంచి ఇప్పటివరకు నమోదైన అతి భారీ వర్షం ఇదేనని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడం, ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో పాటు క్యుములోనింబస్, స్ట్రాటస్‌ మేఘాల ప్రభావంతో నగరంలో పలు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.  


 వరద నీటిలో ఉప్పల్‌ స్వరూపానగర్‌

పలు మండలాల్లో సాధారణం కంటే అత్యధికం.. 
జీహెచ్‌ఎంసీ పరిధితో పాటు పొరుగునే ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలో పలు మండలాల్లో జూన్‌ ఒకటి నుంచి జూలై 15 వరకు సాధారణం కంటే 70 నుంచి 90 శాతానికి పైగా అధిక వర్షపాతం నమోదవడం విశేషం. అత్యధికంగా తిరుమలగిరిలో 106 శాతం, ముషీరాబాద్‌లో 131 శాతం, కాప్రాలో ఏకంగా 153 శాతం, ఉప్పల్‌లో 173 శాతం, సరూర్‌నగర్‌లో 148 శాతం అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. 

గ్రేటర్‌లో కుండపోత రికార్డు ఇప్పుడే..  
గ్రేటర్‌ పరిధిలో జూలై నెలలో అధిక వర్షపాతం నమోదవడం పరిపాటే. ఇక ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నగరంలో 24 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైన రికార్డులు గతంలో ఉన్నాయి. కానీ నగర వాతావరణ శాఖ రికార్డులను పరిశీలిస్తే జూలై నెలలో అధిక వర్షపాతం నమోదైంది మాత్రం.. జూలై 15, 2021 కావడం విశేషం. పలు చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనప్పటికీ.. సరాసరిన నగరంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు జూలై మాసంలో 1989 జూలై 24న మాత్రమే నగరంలో 14.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాజాగా పాత రికార్డులు బద్దలయ్యాయి.

 
బాలాపూర్‌లో జలమయమైన ఆర్‌సీఐ రోడ్డు

నగరాన్ని వణికించిన భారీ వర్షం
బుధవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు భీతిల్లాయి. రాత్రి 8 గంటల నుంచి వేకువజాము వరకు ఏకధాటిగా కురిసిన కుండపోతతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. గత ఏడాది వరదల్ని గుర్తు తెచ్చుకుని వణికిపోయారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తెల్లారే లోపల ఏం జరగనుందోనని ఆందోళన చెందారు. గ్రేటర్‌ పరిధిలోని వంద కాలనీలకు పైగా ప్రజలు వాన భయంతో సరిగా నిద్రపోలేదు. మలక్‌పేట నియోజకవర్గంలోని ఎర్రగుంట, మీర్‌పేట, జిల్లెలగూడ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో అంజయ్యనగర్‌ పూర్తిగా నీట మునిగింది. అయిదడుగుల మేర నీరు ఇంకా నిలిచే ఉంది. పద్మా కాలనీ, అచ్చయ్యనగర్, శ్రీరాంనగర్‌ బస్తీ తదితర ప్రాంతాల్లోనూ భారీగా నీటి నిల్వలు చేరాయి.

బిక్కుబిక్కుమంటూ గడిపిన కాలనీలు 
ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని పద్మావతి కాలనీ, రాఘవేంద్ర కాలనీ, పీవీఆర్‌ కాలనీ, అయ్యప్పకాలనీ, సాగర్‌ ఎన్‌క్లేవ్, రెడ్డి కాలనీ, కోదండరామ కాలనీ, అయ్యప్పనగర్, మల్లికార్జున నగర్‌ తదితర కాలనీల్లో నీట మునిగాయి. ఉప్పల్‌ నియోజకవర్గంలోని శివసాయినగర్, మధురానగర్‌ కాలనీ, న్యూభవానీనగర్, ఇందిరానగర్, రాఘవేంద్రకాలనీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ డివిజన్‌లోని ఎన్‌ఎండీసీ కాలనీ, సరస్వతీనగర్‌ తదితర కాలనీలు నీట మునిగాయి. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని నాలా పరీవాహక ప్రాంతాల్లోని బ్రాహ్మణవాడి, అల్లంతోట బావి, తదితర ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని చింతలబస్తీ, మక్తా, ఇందిరానగర్‌లతోపాటు సోమాజిగూడ, ఫిల్మ్‌నగర్‌ ప్రాంతాల్లో వర్ష ప్రభావం కనిపించింది.  నదీం కాలనీలో దాదాపు ఇరవై ఇళ్లలో వరద నీరు చేరింది. 


ఆనంద్‌బాగ్‌లో నీట మునిగిన కాలనీ

తెగిపడిన కరెంట్‌ వైర్లు, ట్రిప్‌ అయిన ఫీడర్లు 
సాక్షి, హైదరాబాద్‌: ఈదురుగాలితో కూడిన భారీ వర్షానికి నగరంలో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడి వైర్లు తెగి పోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోగా, మరికొన్ని చోట్ల ఇన్సులేటర్లు, ఏబీ స్విచ్‌లు, జంపర్లు, సీటీ/పీటీలో సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా బుధవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు గ్రేటర్‌లో 500పైగా ఫీడర్లు ట్రిప్పయ్యాయి. కొన్నిచోట్ల రెండు మూడు గంటల్లోనే విద్యుత్‌ను పునరుద్ధరించగా.. మరికొన్ని ప్రాంతాలు అంధకారంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

 
ఇంటి సామగ్రితో సురక్షిత ప్రాంతానికి తరలివెళ్తున్న హయత్‌నగర్‌ పద్మావతి కాలనీవాసులు

విద్యుత్‌కు అంతరాయం 
దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, హయత్‌ నగర్, హస్తినాపురం, వందనపురి కాలనీ, సాగర్‌ఎన్‌క్లేవ్, రాఘవేంద్రనగర్, రెడ్డికాలనీ, కోదండరామ్‌కాలనీ, నాగోల్‌లోని అయ్యప్పనగర్, ఉప్పల్‌ స్వరూప్‌నగర్, మీర్‌పేట్‌ సాయినగర్‌ కాలనీ, మిథులానగర్‌ కాలనీ, జల్‌పల్లి, ఉస్మాన్‌నగర్, ఎర్రగుంట, జిల్లెలగూడ, అడిక్‌మెట్‌ డివిజన్‌లోని అంజయ్యనగర్, ముషీరాబాద్‌లోని పద్మాకాలనీ, అచ్చయ్య కాలనీ, శ్రీరాంనగర్‌బస్తీ, నాచారం ఎర్రకుంట, క్రి్రస్టియన్‌ కాలనీ, హరిహరపురం కాలనీలకు వరద పోటెత్తడంతో ఆయా ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  

అటు ఇంటి చుట్టూ నీరు.. ఇటు కరెంట్‌ కోత..  
కొన్ని చోట్ల రెండు మూడు గంటల్లోనే విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తే.. మరికొన్ని చోట్ల గురువారం రాత్రి పొద్దు పోయిన తర్వాత కూడా కరెంట్‌ సరఫరా కాలేదు. అసలే ఇంటి చుట్లు మోకాల్లోతు మురుగునీరు...ఆపై ఇంట్లో కరెంట్‌ కూడా లేక ప్యాన్లు పనిచేయక పోవడంతో దోమలు విజృంభించాయి. విని యోగదారుల కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఫలితంగా కొంత మంది ఇళ్లకు తాళాలు వేసుకుని బంధువుల ఇళ్లకు చేరుకోగా...మరికొంత మంది చీక ట్లోనే మగ్గిపోవాల్సి వచ్చింది.

అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులు క్షేత్రస్థాయి విద్యుత్‌ సిబ్బందికి ఫోన్‌ చేస్తే నంబర్లు స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉంచడంతో వారు కొంత అసహనానికి గురయ్యారు. విధిలేని పరిస్థితుల్లో 1912 కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేస్తే.. రోజంతా లైన్లు బిజీగా ఉన్నట్లు సమాధానమే వచ్చింది. ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేసినా.. అధికారులు స్పందించలేదు.  

అంతే.. వానొస్తే చింతే.. 
సాక్షి, సిటీబ్యూరో: ఈ చిత్రం మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలోని దీనదయాళ్‌నగర్‌ నాలా పనులకు సంబంధించినది. ఈ నాలాలో పడి గత సంవత్సరం సెపె్టంబర్‌లో సుమేధ (12) అనే బాలిక మరణించింది. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌ రెండు మీటర్లలోపు ఓపెన్‌ నాలాలకు క్యాపింగ్‌ చేస్తామన్నారు. ఎక్కువ వెడల్పు నాలాలకూ అవసరమైన చర్యలు చేపడతామన్నారు.  వర్షాకాలం రాకముందే మే మాసాంతానికి పనులు పూర్తి కావాల్సి ఉండగా, ప్రారంభమే కాలేదు. గత ఏడాది దుర్ఘటనను కొందరు  గుర్తు చేయడంతో.. ఇటీవలే హడావుడిగా ప్రారంభించారు.   పైకప్పులను పరుస్తున్నారు. ఈ నాలాకు సంబంధించి దీనదయాళ్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌ దగ్గరి నుంచి సంతోషిమాత గుడి  వరకు  720 మీటర్ల మేర పనులకు బాక్స్‌ డ్రైనేజీ సహా రూ.2.40 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు.

పై ఫొటోల్లో కనిపిస్తున్నవే జరుగుతున్న పనులు. వర్షాలు దంచికొడుతున్నాయి.  సీజన్‌ ముగిసేంత దాకా పనులయ్యే అవకాశం లేదు. ఇదే సర్కిల్‌ పరిధిలోని కాకతీయనగర్‌ నుంచి దీనదయాళ్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌ వరకు రూ. 45 లక్షలతో పనుల్ని కూడా ఇటీవలే చేపట్టారు. పరిసరాల్లోని రేణుకానగర్‌– కాకతీయనగర్‌ వరకు రూ. 1.40 కోట్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు.బండమైసమ్మ గుడి నుంచి దీనదయాళ్‌నగర్‌ వరకు 400 మీటర్ల మేర రూ. 19 లక్షల విలువైన  పనులు మాత్రం పూర్తిచేశారు. బండ చెరువు నుంచి అనంత సరస్వతి కమాన్‌ వర కు రూ.66 లక్షల అంచనా పనుల టెండర్లు కూడా పూర్తికాలేదు.ఇదీ నాలాల పనులకు సంబంధించి ఉదాహరణ. అన్ని సర్కిళ్లలో అన్ని నాలాల పనులు కూడా  దాదాపుగా ఇలాగే కుంటుతున్నాయి.   

చెరువుల పనులను పరిశీలిస్తే..  
గత సంవత్సరమే దిల్‌సుఖ్‌నగర్‌ తపోవన్‌ కాలనీ రోడ్‌నెంబర్‌ 6 నుంచి  సరూర్‌నగర్‌  చెరువులోకి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో స్కూటీతో ఉన్న ఒకరిని కాపాడబోయి ఓ వ్యక్తి మరణించిన ఘటన  నగర ప్రజలింకా మరిచిపోలేదు. చెరువు వరద ముంపు సమస్య కంటే సుందర పనులకు ప్రాధాన్యం ఇచి్చన అధికారులు  మట్టి కట్ట వేయడంతో చెరువులోకి నీరు పోకుండా కాలనీల్లో కాలనీల్లో నీరు నిలిచిపోయింది. కర్మన్‌ఘాట్, సరూర్‌నగర్‌ ప్రధాన రహదారి నుంచి చెరువు ఔట్‌ లెట్‌లో కలిపే తపోవన్‌ కాలనీలో పనులను చేయకుండా సగంలో ఆపేశారు.

పరిసర కొన్ని కాలనీల నుంచి  జనప్రియ కాలనీ వరకు నాలా పనులు పూర్తి చేసినప్పటికీ, అక్కడి నుంచి సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్‌ ప్రధాన రహదారి వరకు సుమారు 400 మీటర్ల పనులు ఇప్పటికీ ప్రారంభానికే నోచుకోలేదు. వీటితో పాటు పలు కాలనీల్లో పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాలేదు. దీంతో నీరు చెరువులోకి వెళ్లకుండా నీళ్లలో కాలనీల దృశ్యాలు పునరావృతమవుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement