కెర్మన్‌లో సులేమానీ అంతిమయాత్రకు భారీగా తరలివచ్చిన జనం
టెహ్రాన్/వాషింగ్టన్/బెర్లిన్/బ్రస్సెల్స్: అమెరికా డ్రోన్ దాడిలో మృతి చెందిన ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ అంతిమయాత్ర తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 50 మంది మరణించగా మరో 200 మంది వరకు గాయపడ్డారని ఇరాన్ మీడియా వెల్లడించింది. సులేమానీ అంతిమయాత్ర ఆయన స్వస్థలం కెర్మన్‌లో మంగళవారం జరిగింది. తమ ప్రియతమ నాయకుడికి నివాళులర్పించడానికి లక్షల్లో పోటెత్తిన జనం అదుపుతప్పడంతో తొక్కిసలాట జరిగింది.
అనంతరం వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, గాయపడిన వారి అరుపులు, కేకలతో కూడిన దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ ప్రసారం చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంటున్నారు. అంతకు ముందు కెర్మన్‌లోని కూడలిలో గుమికూడిన వేలాది మందిని ఉద్దేశించి రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ హొస్సేన్ సలామీ మాట్లాడారు. అమెరికాకు మద్దతిచ్చే ప్రాంతాలను బుగ్గిపాలు చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు.
వాళ్లందరూ ఉగ్రవాదులే
‘అమెరికా సైనికులు, రక్షణశాఖ (పెంటగాన్), అనుబంధ సంస్థల అధికారులు, ఏజెంట్లు, కమాండర్లతోపాటుæ సులేమానీని డ్రోన్ దాడిలో చంపాలని ఆదేశించిన వారందరూ ఉగ్రవాదులే. అమెరికా సైనిక, నిఘా, ఆర్థిక, సాంకేతిక, రవాణా, సేవా రంగాలకు చెందిన బలగాలకు ఎలాంటి సాయం చేసినా ఉగ్రవాదులకు సాయపడినట్లే పరిగణిస్తాం’అంటూ ఇరాన్ పార్లమెంట్ తీర్మానించింది. జనరల్ సులేమానీ నేతృత్వం వహించిన రివల్యూషనరీ గాడ్స్‌లోని ఖుద్స్ బలగాల విదేశీ కార్యకలాపాలకు గాను రూ.1600 కోట్లు కేటాయించేందుకు కూడా ఆమోదం తెలిపింది.
కాగా, సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రభుత్వం 13 రకాలైన పథకాలను సిద్ధం చేసిందని ఇరాన్ వార్తా సంస్థ ‘తస్నిమ్’తెలిపింది. ఐరాస సమావేశాల్లో పాల్గొనాల్సిన ఇరాన్ విదేశాంగ మంత్రి జరీఫ్‌కు అమెరికా వీసా నిరాకరించింది. సమయం దొరకనందున జరీఫ్‌కు వీసా ఇవ్వలేదంటూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమాచారమిచ్చారంటూ ఐరాస చీఫ్ గుటెరస్ తెలిపారని ఆయన వెల్లడించారు.
శతాబ్దంలోనే తీవ్రస్థాయి ఉద్రిక్తతలు
పశ్చిమాసియాలో అంతకంతకూ పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘అస్థిర పరిస్థితుల మధ్యే ఈ నూతన సంవత్సరం మొదలైంది. మనం ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య ఉన్నాం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ శతాబ్దంలోనే అతితీవ్ర స్థాయికి చేరాయి’అని న్యూయార్క్‌లో అన్నారు. ఇరాక్‌లోని తమ బలగాల ఉపసంహరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్ వెల్లడించారు.
అమెరికా బలగాలు అప్రమత్తం
అమెరికా నేవీ తమ యుద్ధ నౌకలకు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. హోర్ముజ్ జల సంధి గుండా ప్రయాణించే చమురు నౌకలకు ముప్పు నుంచి తప్పించేందుకు చర్యలు తీసుకుంటామని బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా నావికా దళం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment