చైనా గోడౌన్‌లో భారీ పేలుళ్లు...
* 50 మంది మృతి
* 700 మందికి పైగా గాయాలు
చైనా: ఉత్తర చైనాలోని తియాంజిన్ నగరంలో ఓ రసాయనిక పదార్థాల గోడౌన్‌లో పేలుళ్లు సంభవించి 50 మంది దుర్మరణం చెందారు. 700 మందికి పైగా గాయపడగా వారిలో 52 మంది పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం రాత్రి 11.20 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అగ్ని కీలలు పరిసర ప్రాంతాలకూ విస్తరించాయి. గోడౌన్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు తెలుస్తోంది. పేలుళ్ల ధాటికి సమీపంలో నిలిపి ఉన్న సుమారు 1000 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
మంటలను అదుపుచేసేందుకు వెయ్యిమంది అగ్నిమాపక సిబ్బంది, 143 ఫైర్ ఇంజిన్లతో శ్రమిస్తున్నారు. తీవ్రత కొంత అదుపులోకి వచ్చింది. ప్రమాద ప్రాంతంలో నిప్పురవ్వలు ఎగిసి, దట్టమైన పొగ అలుముకుంది. పలు ఇళ్ల గోడలు, కిటికీలు బీటలు వారాయి. గోడౌన్‌లో పేలుళ్లకు ముందు.. దగ్గర్లోని కంటైనర్లు మంటల్లో చిక్కుకున్నాయని, తర్వాతే పేలుళ్లు జరిగాయని వార్తలొచ్చాయి.
సూపర్ కంప్యూటర్ షట్‌డౌన్: ఈ పేలుళ్ల కారణంగా చైనా తన సూపర్ కంప్యూటర్ ‘త్యాన్‌హే-1ఎ’ను అరగంట షట్‌డౌన్ చేసింది. దీని నిర్వహణ కేంద్రం ప్రమాద ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కంప్యూటర్ ఒక సెకనుకు 2.57 క్వాడ్రిలియన్(పదికోట్ల కోట్లు) కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ కంప్యూటర్ కేంద్రం నెలకొన్న భవనంలో పేలుడు దెబ్బకు సీలింగ్ కూలిపోయింది.